Thursday, December 30, 2010

ఆరభి, సామ, శుద్ధ సావేరి రాగ త్రయం - త్రివేణీ సంగమం

నేను ప్రాణంగా ప్రేమించే రాగం పైన రాస్తున్నఈ టపాతో నా కల నెరవేరింది. కొండను కొంచెం అద్దంలో పట్టుకుంటాను.
ఆరభి, సామ ,శుద్ధ సావేరి రాగాలు ఒకే నదిలోని మూడు పాయలుగా అనిపిస్తాయి నాకు. ముఖ్యంగా శుద్ధ సావేరి
సమ్మోహన శక్తి ఉన్న రాగం. ఈ రాగాలలో ఉన్న మాధుర్యం చెప్పనలవి కాదు.

బృందావనమది అందరిది తో మొదలైన ఆ ఇష్టం పాడనా తెనుగు పాట తో అమాంతం పెరిగిపోయి జానకి కలగనలేదు పాటతో సంపూర్ణమైంది.

జానకి కలగనలేదు పాటకు all time ఇళయరాజా favourites లో రెండవ స్థానం ఇస్తాను. (first spot is a no brainer. మాటే మంత్రము పాటకు చెందుతుంది.) ఎంత గొప్పపాట. కొన్ని వందలసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. they marred the picturization of this song with comical steps. ఆత్రేయ సాహిత్యం,సుశీల, బాలు యుగళం--తెలుగు సినిమా పాటలకే తలమానికం వంటి పాట ఇది.

అసలు ఈ పాటకు బీజం పాడనా తెనుగు పాట (అమెరికా అమ్మాయి) తో పడింది అనుకుంటున్నాను. ఎందుకంటే స్వరకర్త g k వెంకటేశ్ కు అప్పుడు ఇళయరాజా సహాయకుడు గా ఉన్నాడు. ఈ పాట సాహిత్యం దేవుల పల్లి. ఆ పేరే చాలు. ఈ పాటలో వీణ, వయొలిన్లు చాలా చక్కగా western style ను కర్ణాటక శైలి లో fusion చేసిన విధానం అపురూపం. సుశీలగారు మాధుర్యానికి care of address అని చెప్పటం లో పునరుక్తి దోషం ఒక్కనాటికీ ఉండదు.

ఆరభి రాగానికి బైబిల్ వంటి కీర్తన ’సాధించెనే’. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతి. ముఖ్యంగా బాలమురళి ఈ కీర్తన ను అనితర సాధ్యంగా పాడారు. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతుల సాహితీ, సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించటానికి ఒక జీవితకాలం సరిపోదు.
రెండు మెచ్చు తునకలు- ’సమయానికి తగు మాటలాడెనే’, ’వెత కలిగిన తాళుకొమ్మనెనే’.

Saturday, December 11, 2010

తబలాను చెవి మరుగు చేసేశారు

దాదాపుగా తబలాను వాడటం మానేశారు. ఇప్పుడంతా drums లేదా digital sounds

ఎంత నిండుదనంగా ఉండేవి ఆ పాటలు.
తబలాను stylish గా వాడిన కొన్నిపాటలు ఉదహరిస్తాను.

1) యుగంధర్ సినిమాలో ’దాస్తే దాగేదా’ పాట. మంచి stylised composition.
ఇళయరాజా తొలినాళ్ళలో ఇచ్చిన పాట.
సినారే(?)/ ఆత్రేయ సాహితి కూడా చాలా simple yet effective గా ఉంది.

బాలు, జానకి అద్భుతంగా పాడారు.

ఈ పాటలో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు.

- పుట్టాము గనక తప్పదు చావక ముందు వెనక తేడాగా
ఏతాడైనా మూడే ముళ్ళు సంబరమంతా మూన్నాళ్ళు.
ఉరితాడంటి బిగి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసేస్తా.
ఇది నీ అంతో మరి నావంతో ఏదో ఒకటి ఇక తేలాలి.

2) ప్రేమలేఖలు సినిమా లోని ’ఇది తీయని వెన్నెల రేయి’ పాట.
alltime classic పాట. బాలు సుశీల గారు పాడిన గొప్ప యుగళ గీతాలలో ఒకటి.

ఎన్నో గొప్ప పాటలు తబలా percussion తో పరిపూర్ణతను పొందాయి.

అసలు తబలా లేని పాటలో తెలుగుదనం, ఇంకా భారతీయత పోయినట్టు అనిపిస్తుంది

Friday, November 19, 2010

కాఫీ ఒక్కోసారి నిద్ర పుచ్చుతుంది కూడా

విద్యాసాగర్. a much improved composer. నా అభిమాన సంగీత దర్శకుడు.

తమిళంలోనే ఎన్నో మంచిపాటలు ఇచ్చాడు. అతని పాటలు కొన్నితలచుకుంటే  బాగుంటుంది అనిపించింది. కాఫి రాగం లోని ఈ పాట అరవంలో చాలా హిట్టయ్యింది.

తమిళ గాయకులు కొన్నిచోట్ల ఒత్తులు పలకక పోవడం నేను గమనించాను. ఉదా: బాస్కర్, బైరవి, కాంబోజి ఇలా అనటం కద్దు. అలాగే కాఫీ ని కాపి అంటారు.(త్రాగేది) వారి భాష ప్రకారం అది సరైనదేనేమో. కానీ సంస్కృత భాష ఆలంబనగా కల మనకు సరైన ఒత్తులు లేకుండా వింటే చెవుల్లో సీసం పోసినట్లు ఉంటుంది.
digression ఆపేస్తే.

’మాస్’ పాటలాగా అనిపిస్తూనే ’క్లాసికల్’ బేసు గా స్వరపరచటం విద్యాసాగర్ చక్కగా నేర్చుకున్నాడు. ఈ కాఫి రాగం ఒక గాడత తో కూడి ముదురు వర్ణమల్లే ఉంటుంది. కొంచెం బజ్జో పెట్టే స్వభావం కూడా ఉంది.

పై పాటలో రెండు విషయాలు ప్రముఖంగా ప్రస్తావిస్తాను. 1) సాధనా సర్ గమ్ గొంతు. అతి మధురమైన గొంతు కలిగిన గొప్ప గాయని ఈమె. ఎంత శృతి సుభగం గాఉంటుందో ఈవిడ స్వరం. ఏమైనా హిందుస్థానీ గాయకులకు ఈ శ్రుతి మీద విపరీతమైన పట్టు ఉంటుంది. ఇంకా ఈమె పాడిన కొన్ని గొప్ప పాటలు ఉన్నాయి. అలాగే vintage జేసుదాస్ గారు.

2) వాయిద్య సమ్మేళనం. ఎంతో అనుభవముంటేనే ఆ optimum use, brevity సాధించగలుగుతారు. విద్యాసాగర్ has mastered the art of composing interludes అనటంలో సందేహం లేదు.

ఎమ్మెస్ పాడిన ’జో అచ్యుతానంద’
శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ’నమో నారాయణ నా విన్నపమిదిగో’- కాపిలో సమ్మోహన పరిచే గీతాలు.

Saturday, October 30, 2010

బృందావన సారంగము-ఉద్యానమున వీర విహారము.

బృందావన సారంగ రాగం ఇంపుగా ఉంటుంది. శుభకార్యపు సందడి లాగా మురిపిస్తుంది. కొంచెం హిందుస్థానీ రాగంలాగా అనిపిస్తుంది.

వెంటనే గుర్తుకు వస్తుంది ’చూపులు కలసిన శుభవేళ’. రాజేశ్వర రావు+ ఘంటసాల+ లీల. మధురమైన పాట . ముఖ్యంగా ఉద్యానమున వీర విహారము అన్నమాట విని నవ్వు వస్తుంది. ఘంటసాల గొంతు.  majestic గా ఉన్నది. 


ఒక కన్నడ పాట (సదా కణ్ణలి ) డా. రాజకుమార్,వాణీ జయరాం పాడినది-కవిరత్న కాళిదాస సినిమాలోది. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎం రంగారావు ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం సమకూర్చారు. రాజకుమార్, జయప్రద నటించారు .

ఈ పాట కూడా బాగుంది. typical ఇళయరాజా బాణీలో.


శ్రీరంగపుర విహార’ ప్రసిద్ధమైన ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన.

ఇంకా మయూరి సినిమాలో ’ఇది నా ప్రియ నర్తన వేళ’ అన్న పాట బాగుంటుంది. బాలు కట్టిన బాణీ బాగుంది. కానీ music అవసరాన్ని మించి ఉంది.

Tuesday, October 19, 2010

నది గొంతులో అలపాట

మండుటెండలో చలివేందర కనిపించి దాహం తీరితే కలిగే ఆనందం. ’ఒకమనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు’. ఈ పాట వింటే కలుగుతుంది .

ఒక్కోసారి మంచి పాటలు చెవినపడటం ’serendipity' అనుకుంటాను.

రాగం కళ్యాణి. రాగలోకానికి మకుటం ఉన్న మహారాణి. పూర్ణమద: పూర్ణమిదం. అన్నట్టుగా పరిపూర్ణమైన రాగం.

కీరవాణి, గంగ పాడారు. ఈ అబ్బాయి చాలా మంచోడు అనే ఒక రవితేజ సినిమాలోది. కీరవాణి పాడితే నాకు నచ్చదు కానీ ఈ పాట అతను బాగానే పాడాడు అనిపించింది.

పాట సాహిత్యం హృదయంగమంగా ఉన్నది. కవితాత్మకత ఉట్టి పడుతోంది. సాధారణంగా పాట సాహిత్యంలో సంక్లిష్టత, అస్పష్టత కొంచెం ఎక్కువైనా నా mind blank అవుతుంది. పాటలోని కొన్ని మాటలు ఇలా ఉన్నాయి.

’పసిపాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమ
మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమ’

’అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమ
నదిగొంతులో అలపాటలా తడబాటు లేని ప్రేమ’

thanks కీరవాణి & చంద్రబోస్.

Friday, September 17, 2010

రేవతి + కీరవాణి + శంకర్ మహదేవన్

ఎప్పటినుంచో ఈ పాట పైన ఒక టపా వ్రాదాము అనుకుంటున్నాను.

శ్రీ రామదాసు సినిమాలోని ’ఏ మూర్తి’పాట ఒక masterpiece అని అనుకుంటాను.
శంకర్ మహదేవన్ గొంతులో నాకు నచ్చిన సుగుణాలు 1) శ్రుతి. 2) శ్రావ్యత 3) స్పష్టత. కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి ఒకప్పుడైతే బాలు గారు పాడాలి. ఇప్పుడు శంకర్ పాడాడు. మరొకరి గొంతులో బాగుండదు.

ఇంకా కీరవాణి ఈ పాటను రేవతి లో స్వరపరచటం నాకు బాగా నచ్చింది. పాట సాహిత్యం కూడా చాలా గంభీరంగా విలక్షణంగా ఉంది. పాట బాణీ 'un-keeravani-esque' గా ఉంది. రామదాసు సినిమాకే తలమానికం వంటి పాట ఏమూర్తి పాట.


రేవతి మంచి vibrant రాగం. ఒక healing touch ఉన్న రాగం. ఎప్పటినుంచో ఒక పూర్ణకుంభం లాంటి పాటకోసం ఎదురుచూశాను. ఈ పాటతో ఆ కోరిక తీరింది.

ఈ రాగంలో నాకు నచ్చిన కొన్ని పాటలు :

’మానసవీణ మధుగీతం’- పంతులమ్మ (పాట పల్లవి, మొదటి చరణం వరకు రేవతి)
’నానాటి బతుకు నాటకము’

ఇంకా ఝుమ్మందినాదం సై అంది పాదం, ఓ బంగరు రంగుల చిలకా పలకవే, అభినవ శశిరేఖవో,ఉదయకిరణ రేఖలో etc.. ఉన్నాయి . 

Wednesday, September 8, 2010

వెంకీ చెబితే వినాలి.

నాకు ఈ మధ్య వెంకటేశ్ తో తీసిన మణప్పురం గోల్డ్ లోన్ ప్రకటన బాగా నచ్చింది. వెంకటేశ్ తన నటనను చక్కగా మెరుగుపరుచుకున్నాడు. i simply loved him in this ad. simple yet effective.

మూణ్ణెల్ల క్రితం ఉద్యోగంలో స్థానాంతరణ చెంది బోధన్ లో ఉంటున్నాను. బ్లాగ్ లు చూడలేకపోతున్నాను. వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎటుచూసినా పచ్చటి పొలాలు. నేత్రపర్వంగా ఉంది.

బ్లాగ్లోకం సూపర్ నోవాలాగా విస్తరిస్తుంది. ఈ వేగం నేను అందుకోలేనని అనిపిస్తుంది.

Saturday, June 19, 2010

సింధుభైరవి+ బాలు గారు + విశ్వరూప విన్యాసం

బాలు గారి గొంతులో ఉరకలెత్తిన ఒక పాట. ఎమ్మెస్వీ సంగీతం. సింధుభైరవిలో వరద గోదారి లాంటి బాణీ -బాలు  ప్రాణం పోశాడు. కమల్ dance steps comical గా అనిపిస్తాయి.  
-- విన్నతరువాత ఎదలో నిశ్శబ్ద జలపాతం.

సింధుభైరవి pathos బాగా పలికిస్తుంది. ఎన్నో నదులను కలుపుకునే సముద్రం లాంటి లోతైన రాగం.

నీ పేరు తలచినా చాలు. ఈ పాటవిన్నతరువాత ఒక అరగంట సేపు ’ఏవిటిది? ఏదో తెలియనిదీ? ఎప్పుడూ జరగనిది ఏవిటిది’ అన్న భావం చాలాసార్లు నాకు కలిగింది. నిజంగా నిజం.

’మామ’ కు ఇష్టమైన రాగమని ఎక్కడో చదివాను.

శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతులో ఈ అన్నమయ్య సంస్కృత పదం సకలం హే సఖి--ముఖ్యంగా ’చారు కపోల స్థల కరాంచిత విచారం హే సఖి జానామి’

ఈ పదచిత్రం వింటే అలా చక్కటి చెక్కిలిపై చేయి చేర్చి శ్రీనివాసుని కోసం ఆలోచిస్తున్న అలమేలుమంగ రూపం స్పురిస్తుంది. జయదేవుని శైలి ఈ అన్నమయ్యపదంలో కనిపిస్తున్నది.

సింధుభైరవి విన్నంతసేపు మనస్సు గడ్డ కట్టిందో కరిగిపోయిందో ఇట్టె అర్థంకాదు.

Sunday, April 25, 2010

పచ్చాని పైరుమీద బాసచేసి చెబుతాను- పాట నచ్చిందని

ఖైదీ బాబాయ్ సినిమాలోని ’ఓరబ్బీ చెబుతాను’ పాట బాగుంటుంది.

సినారె వ్రాసిన ఈ పాటలో కవితాత్మ కలిగిన రెండు మాటలు నాకు బాగా నచ్చాయి.

1) పండగ పూట ఒక నిండు నిజం చెబుతాను
2) పచ్చాని పైరుమీద బాసచేసి చెబుతాను. (ఈ మాటలు ఎంతో హృద్యంగా అనిపిస్తాయి)

సినారె వ్రాసిన ఎన్నో పాటల లాగే ప్రశ్న జవాబు రీతి లో పాట ఉంటుంది. ఘంటసాల జానకి గారు పాడిన విధానం పాటకు నిండుదనం ఇస్తుంది.
కెవి మహదేవన్ బాణీ చక్కగా ఉంది. కీరవాణి రాగ చాయవలె నాకు అనిపించింది.

ఏమైనా ఆ పాటలకున్న ఆత్మసౌందర్యం ఇప్పటిపాటలకు లేదు. అవును నిజం. నిక్కమగు నీలం లాంటి నిజం. కొంతమంది సినారె ను విమర్శించుదురుగాక. ఆయన నాకు అభిమాన కవి. పండిత పామరులను ఏకకాలంలో రంజింపజేసే రచనలు ఆత్రేయ, సినారే చేసినారు. వేటూరి, సీతారామ శాస్త్రి గొప్పరచయితలే కావచ్చు కానీ సినిమా పాటకు ఎంత అవసరమో అంతమేరకే సంక్లిష్టత చూపగలిగే ఒడుపు ఆత్రేయ, సినారె దగ్గర ఉంది.

Monday, March 29, 2010

వసంతం - సుందరం సుమధురం

ఈ రాగంలో పాటలు తక్కువే. అప్పుడప్పుడు సుందరమో సుమధురమో అన్నట్టుగా వినిపిస్తాయి.

ఈ పాట పల్లవి ఇలా ఉంది

సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో
మనసిజరాగ వశీకరమో

ok. పదాలు బాగున్నాయి. పాటకు packing materialగా ఉపయోగ పడినాయి.

సంగీతము, సాహిత్యము రెండు వేరువేరు plane లలో ఉంటాయి అనిపిస్తుంది. చెత్త బాణీలలో మంచి సాహిత్యం ఉంటే విడిగా చదువుకోవటం బెటర్. మంచి tune అయితేనేమో just swallows lyrics. అప్పుడైనా విడివిడిగా ఆస్వాదించాల్సిందే. ఎందుకంటె tune మాయలో పడి ఏపదాలు ఉన్నాయో జ్ఞప్తికి రాదు. అసలు సంగీతానికి మాటలు అవసరమా?

రెంటికీ చక్కని balance చేయటం పాతతరం వాళ్ళు బాగా చేసేవారు.

శుభోదయం చిత్రంలో నటనం ఆడెనే పాట, సాగరసంగమంలో నాదవినోదము అన్నపాటలోని కైలాసానకార్తీకాన హిమదీపం చరణం వసంతరాగంలో ఉన్నాయి.
నరసింహా సినిమాలో నీలాంబరి పాడిన ఈ పాట (నిత్యశ్రీ - రహమాన్ )  
త్యాగరాజస్వామి వారి 'సీతమ్మ మాయమ్మ' ప్రసిద్ధ సంప్రదాయ కృతి.

Saturday, March 13, 2010

vibrant రాగాలూ, pastel రాగాలూ-ధర్మావతి.

రంగులలో లాగానే రాగాలలో కూడా vibrant రాగాలూ, pastel రాగాలూ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మూడోరకం in your face రాగాలు కొన్ని ఉన్నాయి. ఇది నేను సరదాగా విభాగం చేసుకున్నది. 

vibrant రాగాలు ఇరుసంజల సూరీడి రంగు లాంటి గాఢతతో కమ్మేస్తాయి. లాగేసుకుంటాయి.

కొన్ని లేత రంగుల మల్లే కనిపించకుండానే కనిపిస్తాయి ఆకాశం రంగులాగా. ఇవి pastel రాగాలు.

ధర్మావతి ఒక ముదురు నేరేడుపండు రంగు లాంటి రాగం.(ఎందుకలాగ అనిపించింది అంటే ఏమో తెలీదు)

రహమాన్ సంగీతం ఇచ్చిన ఈ డబ్బింగ్ పాట గుర్తుకు వస్తుంది జెంటిల్ మేన్ సినిమాలోది. పిచ్చివాణ్ణి కట్టుకో నెత్తికేసి కొట్టుకో’(అసలు పాటలో కొంటెవాణ్ణి కట్టుకో అని ఉంటుంది.) ఇలా మార్చి పాడుకున్నా it makes no difference. రహమాన్ బాణీలు ఎందుకో నాకు nursery rhymes లాగా అనిపిస్తాయి. కొండొకచో విశృంఖలంగా కొండదారుల్లో ప్రవహించే నదుల్లాగా కూడా అనిపిస్తుంటాయి.

msv స్వరపరచిన ఈ పాట
హలో మైడియర్ రాంగ్ నంబర్ 70 లలో మంచి హిట్ పాట.

ధర్మావతిలో నాకు బాగా నచ్చిన పాట శోభారాజు గారు స్వరపరచిన గోవిందాశ్రిత గోకులబృందా అనే అన్నమయ్య కీర్తన.
over simplification అనుకోకుంటే : గౌరి మనోహరి రాగం లోనుంచి శుద్ధమధ్యమాన్ని మార్చి ప్రతిమధ్యమం చేరిస్తే ధర్మావతి స్వరాలు వస్తాయి. శంకరాభరణం లో కూడా ఇదే మార్పుచేస్తే కళ్యాణి మూర్చనలు ఏర్పడతాయి.

Thursday, March 11, 2010

గౌరి మనోహరి-కొన్ని మంచిపాటలు

నేను అమితంగా అభిమానించే ఒక రాగం గౌరి మనోహరి. ఎన్నో మంచి సినీ గీతాలు ఉన్నాయి ఈ రాగంలో. పంచదార తియ్యగా ఉంది. తేనె మధురంగా ఉంది అని చెప్పడము కంటే కొంత నోటిలో వేసుకుంటే తెలిసిపోతుంది.

రాజేశ్వర రావు గారు స్వరపరచిన ఈ రెండు పాటలు.

1) కన్నుల దాగిన అనురాగం - రంగుల రాట్నం -- పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ గారు  గానం.
2) నీ జిలుగు పైటనీడలోన నిలువనీ -పూలరంగడు - సుశీల, ఘంటసాల గానం

msv సంగీతం కూర్చిన పెళ్ళీడు పిల్లలు చిత్రంలోని ’ పరువపు వలపుల సంగీతం’ పాట వింటే సుశీలగారి గానమాధుర్యం అవగతమవుతుంది. 

సుశీలగారే పాడిన ’ఎవరో రావాలీ’ పాట మామ సంగీతంలో ప్రేమ నగర్ చిత్రంలో. ఇది కొంచెం కష్టమైన పాట.

ఇంకా సితార చిత్రం లోని ’వెన్నెల్లో గోదారి అందం’ ఇదే రాగంలోని మరొక ప్రసిద్ధమైన పాట.

ఇలా ఒకే రాగంలోని పాటలు వరుసగా వింటే మెలకువగా ఉంటూనే ఒకవిధమైన నిద్రలోకి జారుకోవటం జరుగవచ్చు. ఒక కొంచెం సేపు అన్నీ మరిచిపోవచ్చు.

ఈ రాగానికి దగ్గరగా ఉండే మరొక మేళకర్త రాగమైన ’ధర్మావతి’ లో పాటల గురించి మరొకసారి వ్రాయాలని ఉంది.

Thursday, March 4, 2010

యమునా కళ్యాణిలో మ్రోగింది వీణ-thanks g.k.v.




జి.కె.వెంకటేష్ గారిని అమితంగా అభిమానిస్తాను నేను.  1) స్వత: గొప్ప సంగీతదర్శకుడు. 2) ఇళయరాజా కు గురువు గారు . ఆయన జమీందారు గారి అమ్మాయి సినిమాలో స్వరపరచిన ఈ గీతం తెలుగు సినీ సంగీతంలోనే శాశ్వతంగా నిలిచిపోయే పాట. సుశీలగారి గొంతులో ఉన్న మాధుర్యం చెప్పనలవికాదు ఈ గీతంలో . పాటలో వీణ, violins, flute ఉపయోగించినతీరు గొప్పగా ఉంటుంది. ఈ stamp ఇళయరాజా సంగీతంలో మనకు తరచుగా కనిపిస్తుంది. he has taken this style to the  highest level.

జి.కె కు తెలుగులో  సరైన tribute రాలేదు కన్నడంలో ఆయన బాగా పాపులర్ అయ్యారు. 

జి.కె. వెంకటేశ్ గారు సంగీతం అందించిన అమెరికా అమ్మాయి, చక్రధారి, రావణుడే రాముడైతే, .. చిత్రాలలో మంచి పాటలు ఉన్నాయి. 
Western arrangements ను సినిమా పాటలలో విరివిగా ఉపయోగించిన వారిలో ఆయన అగ్రగణ్యులు. 

ఇదే పాట బాలుగారి గొంతులో కూడా ఇక్కడ వినండి. ఇందులోని orchestrizationలోని వైవిధ్యం గొప్పగా ఉంటుంది.
యమునా కళ్యాణి రాగంలో ఈ పాటను మించే composition రాదు.

thanks G.K.Venkatesh గారు.

Tuesday, February 23, 2010

ఇళయరాజా టాప్ 10 పాటలలో ఒక్కటి

అవతారం(1995) అనే తమిళ్ చిత్రంలో ఒక ethnic/rustic flavourతో ఇసైగ్నాని స్వరపరచి జానకి గారితో కలిసి పాడిన ఈ పాట (తెండ్రల్ వందు తీండుం  బోదు-ఇళయరాజా -జానకి) . నా దృష్టిలో ఇది రాజా top 10లో ఉండాలి. ఈ సినిమాకు నటుడు నాజర్ దర్శకుడు. పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది. ఇది ఏరాగమో నేను గుర్తించలేక పోయినాను. కానీ జాలంలో వెతికితే జోన్ పురి అని తెలిసింది. సువర్ణసుందరి సినిమాలో ’హాయిహాయిగా ఆమనిసాగే’ పాటలో ’చూడుమా చందమామ’ అన్న చరణం ఈ రాగంలో ఉన్నట్టు శంకా గారి లిస్టులో చూచాను. లోహాన్నైనా పుత్తడిగామార్చే ఆల్కెమీ రాజాకు తెలుసు.

Saturday, February 20, 2010

’హంసనాదం’ లో ఈ రెండు పాటలు

ముందు ’ఈ పాట’ (తెండ్రల్ వందు - జేసుదాసు, జానకి ) తదుపరి ’ఇదీ’  (సొర్గమే ఎండ్రాలుమ్ - ఇళయరాజా-జానకి-1990) వినండి. చిత్రీకరణను పట్టించుకోవద్దు.
హంసనాదం రాగాన్ని ఇళయరాజా చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా రాజా సంగీతంలో percussion instruments కు ఒక విశిష్టత కనిపిస్తుంది. ఎన్నిరకాల beats సృష్టించాడో. పైరెండు పాటలలో beat ను గమనించండి. హంసనాదంలో నాకు తెలిసి ’నీవు నేను వలచితిమీ’ అన్న బాలమురళి-సుశీల గార్లు పాడిన పాట కర్ణ సినిమాలో ఉంది. ఎమ్మెస్వీ సంగీతంలో. చాలా హృద్యమైన రాగం. బంటురీతి కొలువియ్యవయ్యరామ ప్రసిద్ధ కీర్తన.

ఒక చిన్నమాట:అంతగా హిట్టవ్వని ఒక చిరంజీవి సినిమాలో కూడా రాజా హంసనాదంలో ఒకగీతం స్వరపరిచాడు. tune బాగుంటుందికానీ వేటూరి మసాలా లిరిక్కులు బాగుండవు .

Thursday, February 18, 2010

బాలమురళి + ఇళయరాజా + రీతిగౌళ = ఒక మంచి పాట

ఈ అపురూపమైన పాట  బాలమురళీ, ఇళయరాజా ఇంకా కొన్ని పాటలకోసం కలిసి పనిచేసిఉంటే ఎంతబాగా ఉండేదో అనిపిస్తుంది. అసలు బాలమురళి గొంతును సినీపరిశ్రమ సరిగా వినియోగించుకోలేదు. అదొక తీరని వెలితి. ఒక విషయం ..
గొప్పగాయకులకు పాట (మధ్యలో వచ్చే సంగతులు కూడా) టేకాఫ్ ఎలా చేయాలి లాండింగ్ ఎక్కడచేయాలి అన్న విషయంమీద గట్టి పట్టు ఉంటుంది. నేను విన్నంతలో బాలమురళి, ఘంటసాల గారలకు ఈ విషయం లో సంపూర్ణ ఆధిపత్యం ఉంది.

ఈ రీతిగౌళ లోనే ఏదో లాగేసుకునే మాయ ఉంది (ఇదే విధంగా చాలా రాగాలవిషయంలో నాకు అనిపిస్తుంది). ఇప్పటికి ఇదిసత్యం. ఇదే సత్యం.

 ఇంతమంచి పాటలను కొత్తతరంవారు కూడా వినాలని నాకోరిక. ఏపాట అయినా సంగీతాన్ని, సాహిత్యాన్ని విడివిడిగానే ఆస్వాదించడం బాగుంటుంది. . టీనేజీలో వింటూ పెరిగిన తమిళ్/కన్నడ  పాటలు శాశ్వతంగా మనస్సులో తిష్ట వేశాయి. 

 :ఇదే  రాగంలో శేషశైలావాస గీతం, రామాకనవేమిరా పాట అందరికీ సుపరిచితమే.

Wednesday, January 27, 2010

ఒక కొంచెం మోదం ఇంచుక ఖేదం.




నేను అమితంగా అభిమానించే గొప్ప కళాకారులకు ’పద్మ’ బహుమతులు లభించటంతో ఆనందం పట్టలేకపోతున్నాను.
గత సంవత్సరం గానకోకిల ’సుశీల’ గారికి పద్మభూషణ్ లభించటంతో ఎంతోకాలంగా మనసులోఉన్న వెలితి తీరింది. అలాగే జానకి గారికి ఇవ్వాలి. ఆమెకు తమిళనాడు వారే బహుమతివచ్చేలా చూస్తారని నాకు నమ్మకమున్నది.

.
ఈ ఏడాది ఇసైగ్నాని ఇళయరాజాకు పద్మభూషణ్ ప్రకటించారు. చాలా సంతోషం. ఆయన స్థాయికి ఇంకా దాదాసాహెబ్ అవార్డు, భారత రత్న కూడా ఇవ్వాలి





అలాగే అన్నమయ్య పాటకే జీవితం అంకితం చేసిన శోభారాజు గారికి పద్మశ్రీ ఇవ్వటం ఆనందంగా ఉంది. ఇంకా బాలకృష్ణప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ ఇవ్వల్సిఉంది.




అయితే ఒక వెలితి నాలో దాగిఉంది. కర్ణాటక సంగీత ప్రపంచానికే మహరాజు అయిన బాలమురళిగారికి భారతరత్న ఇవ్వటం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వచ్చే ఏడాది కేంద్రప్రభుత్వం పై మన ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకురావాలి. ఆయన ఆనందంగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండి స్వంతంగా తీసుకోగలిగినప్పుడే భారతరత్న ఇవ్వాలి. పండిట్ భీమ్సేన్ జోశీకి ఇచ్చారు. ఆయనకంటే ఎంతో పైస్థాయికి చెందిన బాలమురళి కి ఇవ్వకపోవటం ఏమాత్రం ఆమోదయోగ్యంకాదు.


ప్ర్జజల రివార్డులే అవార్డులు అన్నమాట నిజమే అయినప్పటికినిన్నీ ఇటువంటి ఉత్తమశ్రేణి కళాకారులను సముచితంగా గౌరవించుకోవటం మనబాధ్యత. సరియైనసమయంలో వారిని సమ్మానించకపోవటం మహాపరాధమే.

Wednesday, January 20, 2010

సిక్కిం లో ఐదు రోజులు-1

గతవారంలో సిక్కిం రాష్ట్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడి కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను.

1) ముఖ్యంగా సిక్కింలోని cab drivers అక్కడి కొండలలోని బాగా దెబ్బతిన్న రోడ్లలో ప్రతిరోజూ జీవికకోసం బండిని నడపటం మనసుపై ముద్రవేసింది. ఒక రోజు చాంగో సరస్సు, నాధులా పాస్ వద్దకు వెళ్ళాము. our cab driver was quite a character. For no apparent reason, he was ecstatic. సగం గడ్డకట్టిన చాంగో సరస్సు ఒడ్డున అతన్ని చూడండి.

2) నాథులా బార్డర్ 14700 అడుగుల ఎత్తులో ఉంది. చలికాలం అవటం మూలాన -3 డిగ్రీలు ఉంది. అక్కడ మన ఆర్మీ వాళ్ళు కష్టమైన వాతావరణంలో పహరా కాస్తున్నారు. దగ్గరలోనే చైనా సైనికులు కొరకొరమని చూస్తున్నారు. వాళ్ళను photo తీయొద్దని మనవాళ్ళు చెప్పారు.

3)ఒహోం ఒహోం అనుకుంటూ గడ్డకట్టే చలిలో యం థాంగ్ లోయలోకి వెళుతూ
4) ఉత్తర సిక్కింలో తీస్తా నది వడివడిగా పరుగులు తీస్తూ..

సిక్కింకు వెళ్ళినతరువాతే టిబెట్ ఎంతముఖ్యమైన ప్రదేశమో కొంత అవగాహన వచ్చింది. తీస్తా, బ్రహ్మపుత్ర నదుల పుట్టినిల్లు టిబెట్. అపార ఖనిజవనరులకు స్థానంకూడాను. చైనావాడు అందుకే భల్లూకంపట్టు పట్టాడు. జలవిద్యుత్ ఉత్పత్తికి అపారమైన అవకాశం ఉంది ఈ పర్వత రాష్ట్రంలో. ఇప్పుడిప్పుడే మనవాళ్ళు రోడ్లు బాగుచేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పర్వత రహదారుల్లో ప్రయాణమంటే గుండెలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాల్సిందే.