Tuesday, December 24, 2013

నీవులేవు. నీ జడనుంచి జారిన మల్లెల పరిమళం నిచిచే ఉంది. - చారుకేశి.


చారుకేశి - చక్కని కురులు కల స్త్రీ. 'ప్రతిదినం  నీ దర్శనం'  దొరకినా మంచిదే. మద్రాసులో మార్గళి మాసపు సాయంత్రాలు చిరుచలిలో కచ్చేరీలు వింటూ మధ్యలో పొగలు కక్కే 'కాపి' తాగిన ఆనందం. 

 'కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్పి ఏమార్చేవు?'

' నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వున కద్దము చూపేను'.

 ఇటువంటి awesome lyrics కలిగిన 'ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ' పాట.
ఆత్రేయ వ్రాసిన ఈ  పాటలోని మాటలు మదురై మల్లెపూల పరిమళంలాగా  కమ్ముకుంటాయి.

త్యాగరాజు 'ఆడ మోడి గలదే' చారుకేశి కి ఒక పాఠ్య పుస్తకం వంటిది.  bombay జయశ్రీ గొంతులో.

పాటలో 'చదువులన్ని' దగ్గర నెరవులు కడిమి చెట్టును అల్లుకున్న అడవిమల్లెతీగల్లాగా అనిపిస్తాయి.

ఇదే పాట బాలమురళి గొంతులో ఇక్కడ.  ముఖ్యంగా ప్రవిస్తారమైన, అనితరసాధ్యమైన  ఆలాపన ఆకట్టుకుంటుంది. 

త్యాగరాజస్వామి మాటల్లోని purity , authenticity కొట్టవచ్చినట్టు కనపడుతాయి.

'సంక్షిప్తంగా పాటలో నాకు అర్థమైన  భావం:  చదువులన్ని తెలిసిన సాక్షాత్  శంకరాంశ సంభూతుడైన హనుమంతుడంతటి  వాడు  సుగ్రీవుని పనుపున వచ్చి నీకు మ్రొక్కి వివరమడిగితే నీవు నేరుగా భాషింపక అనుజుడైన లక్ష్మణుడితో చెప్పించావు. అలాగే నీవు నిన్నే నమ్ముకున్న నాతో ఏదో ఒక తీరున  మాటలాడుతావా రామా? '

చారులత మణి (ఒక gifted singer and columnist ) చారుకేశి గురించి ఇచ్చిన demo lecture ఇక్కడ వినవచ్చు. తమిళంలో ఉన్నా సులభంగా అర్థమవుతుంది. 

చారుకేశి రాగం విన్న తరువాత మనసుకు సాంత్వన గా ఉంటుంది.  పాట అయిపోయిన తరువాతకూడా పాటలోని పరిమళం జడనుంచి జారిపడిన మల్లెలా నిలిచే ఉంటుంది.













  

Monday, September 30, 2013

'ఘటాకాశం' లో 'కొంతకాలం' విద్యా విహారం

ఆకాశంలో కుండ ఉందా కుండలో ఆకాశం ఉందా అంటే రెండూ నిజమే. కానీ ఆకాశంలో ఘటం ఉంది అందులో శబ్దం ఉంది. అది ఇలాంటి పాటలో చెవులను తాకుతుంది అన్నది నిండునిజం. రాగం దాదాపుగా శుద్ధ ధన్యాసి. కొన్ని అన్య స్వరాలు వేయటం విద్యసాగర్ కు అలవాటే.

పాటలో ఘటం చక్కగా ఉపయోగించాడు విద్యసాగర్. పాడినది మధు బాలక్రిష్ణన్. బాగానే పాడాడు కానీ ఇదేపాటను జేసుదాసు గొంతులో 80 లలో  వినిఉంటే  ఇంకా బాగుండేది.

విద్యాసాగర్ చంద్రముఖి చిత్రానికి మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని కొంతకాలం పాట చాలా బాగుంటుంది. పాట mostly శ్రీ రంజని లో ఉన్నది.పాట మొత్త్తం హాయిగా ఉంటుంది. ముఖ్యంగా రెండవచరణానికి ముందు వచ్చే interlude ఆకట్టుకుంటుంది

'both the above songs are contemporary in feel and

 traditional at the roots'  

ఇవి నా పదాలు కావు. ఒక ఆంగ్ల వ్యాసం లో నుంచి 

దించుకున్నాను.



సంప్రదాయ రాగాలు ఆలంబనగా ఆధునిక బాణీలను కట్టడం అనే ఈ విద్యను విద్యాసాగర్ బాగా నేర్చుకున్నాడు.


పాట లో ఒక finesse తో కూడిన  కల్పన చేయటం masters కే 

సాధ్యం అనిపిస్తుంది.


Saturday, July 20, 2013

మనసు పరిమళించెనే - తనువు పరవశించెనే- పాట మాధుర్యాన ప్రాణాలు కరిగెనే



తెలుగులో యుగళగీతాలకు  పరిపూర్ణత  తెచ్చినవారు  ఘంటసాల సుశీల. వారు పాడిన వందల  పాటలలో పది అత్యుత్తమమైనవి అని నాకు అనిపించినవి  ఒక జాబితా.
ఇవి మనతెలుగువారి అపురూప సంపద. 

పదే ఎందుకు ?  ఈ జాబితా  అవసరమా ? అంటే ఏమీ లేదు. ఉబుసుపోక అంతే.

ఈ పాటల ఎంపికలో నేను పాటించిన ప్రాథమ్యాలు 1) మాధుర్యం  2) పాట బాణీ 3) ఎన్నిమార్లు విన్నా హాయిగా ఉండటం   4) సాహిత్యం.

1) మనసు పరిమళించెనే -  శ్రీ కృష్ణార్జున యుద్ధంలోని ఈ పాట లో అణువణువునా  మాధుర్యం తొణికిసలాడుతుంది. సంగీతం పెండ్యాల . పాట వింటే చాలు పదిమాటలేల. నా మొదటి వోటు ఈ పాటకే 

2) కొండగాలి తిరిగింది. గుండె ఊసులాడింది. :  చిత్రం ఉయ్యాల జంపాల.  సంగీతం పెండ్యాల  పాటను మలయా మారుతంలో చక్కగా స్వరపరిచాడు. ఆరుద్ర మలయమారుతాన్ని అచ్చతెనుగులో కొండగాలిగా మార్చాడు. 

ఆరుద్ర ఈ పాటలో విశ్వరూపం చూపాడు. 'పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది'; 'మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది'; 'ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది'... 
3) మోహనరాగమహా మూర్తిమంతమాయే : చిత్రం మహామంత్రి  తిమ్మరుసు. సంగీతం పెండ్యాల  రచన పింగళీ. ఈ పాటలో ఘంటసాల సుశీల ఆలాపనలు విని పరవశించిపోవచ్చు. పెండ్యాల గీతాలలో ఆలాపనలకు తప్పక చోటు ఉంటుంది. ఆయన trademark అని  చెప్పవచ్చు.
4) ఎంతహాయి ఈ రేయి : చిత్రం గుండమ్మ కథ. సంగీతం ఘంటసాల. రచన పింగళి.  insominiac లకు చక్కటి మందు ఈ  పాట. పింగళి మార్కు brevity కి ఒక మచ్చుతునక. 
5) ప్రేయసీ మనోహరి వరించి చేరవే: చిత్రం వారసత్వం సంగీతం ఘంటసాల. ఘంటసాల ఎంతగొప్ప గాయకుడో అంతకుతగ్గ సంగీతకర్తకూడా. పాటను జనరంజకంగా బాణి కట్టడం ఆయనకున్న ప్రత్యేకత. 
6) నన్ను వదలి నీవు పోలేవులే : చిత్రం మంచి మనసులు. సంగీతం కె.వి. మహదేవన్. హిందోళం లో స్వరపరచిన ఐ పాట ఒక classic. 
7) ఆకాశ వీధిలో అందాల జాబిలి : చిత్రం మాంగల్య బలం. సంగీతం మాస్టర్ వేణు. రచన శ్రీ శ్రీ పాటలో ఒక simplicity, innocence ఉన్నాయి. 
8) నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని: చిత్రం గులేబకావళి కథ , రచన సినారె,  సంగీతం  విజయ కృష్ణ మూర్తి.  సినారె తొలిపాట. పాటనిండా అందమైన పదబంధాల గుంఫనం పొందుపరిచాడు. కర్పూరం గంధం  గుబాళింపు అనుభూతినిస్తుంది ఈపాట 
9) మాధవా మాధవా నన్ను లాలించరా :  చిత్రం  శ్రీరామకథ (?) సంగీతం s p  కోదండపాణి. ఇది ఒక విలక్షణమైన  పాట. రాగం కళ్యాణ వాసంతం . 
10) సంగమం సంగమం : చిత్రం కోడెనాగు. సంగీతం  పెండ్యాల. last but not the least. ఈ  పాట ఒక చక్కని యుగళగీతం. ఘంటసాల గొంతు  అప్పటికే  పాడయింది. కానీ సుశీల గారు తన గాన మాధుర్యంతో more than compensate చేసింది.  it is one of my personal favourites. 
almost there: ఐనదేమో అయినది , నీ జిలుగుపైట నీడలోన నిలువనీ, పాడవేల రాధిక, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. the list continues..
అమ్మయ్య. ఎప్పటినుంచో ఘంటసాల సుశీల గార్ల పాటలను ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ  ఒక టపా వ్రాయాలి అనుకున్నాను. ఆ కోరిక తీరింది. 

Thursday, February 14, 2013

కన కన రుచిరా ప్రహ్లాద కనక కశిపు కథ

హిరణ్యకశిపుని పాత్రకు కొంచెం హాస్యం కొంచెం మానవత్వం జోడిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో ఈ క్రింది ఘట్టాలను  వ్రాయటం జరిగింది. ఎక్కడా కథౌచిత్య భంగం లేకుండా జాగ్రత్త పడ్డాను.

హిరణ్య కశిపుడు  చండామార్కుల  సంభాషణ:

హిరణ్య కశిపుడు (హి. క.) : చండామార్కుల వారూ: మీరు మన రక్ష: కుల చరిత్రలు మా అన్నగారి పోరాటపటిమ , రాకాసి పాటలు, పజ్యాలు నేర్పమంటే నారాయణ మంత్రం నేర్పటంలో మీ ఉద్దేశ్యం సెలవిస్తారా? కులగురువులని మీకు మన్నన చేసినందుకు ఇదా ఫలితం?


 గురువు గార్లు: ప్రభూ! మా ప్రయత్నలోపం ఇంచుకమాత్రంలేదు. పరిపరివిధముల రక్కసి పురాణాలు టక్కు టమార విద్యలు గరపడానికి ప్రయత్నం చేశాము. ప్రహ్లాదుడు మాకు సహకరించటం లేదు. పైపెచ్చు తోటి రాక్షసబాలలకు హరికథలు చెప్పుచూ పాటలు పాడుచు పాడు చేయుచున్నాడు. ఇతనికి చదువు చెప్పటం మాకు ఎంతమాత్రమూ వీలుపడదు. కావాలంటే తోటి పిల్లలను అడగండి

(హి. క.) : ఏమిరా బాలలు గురువుగారు చెప్పినమాటనిజమేనా ఏదీ హిరణ్యాక్ష స్తోత్రం ఒకమారు పాడండి

రాక్షస బాలలు: చీ అదేమీ బాగులేదు మాకు ప్రహ్లాదుడు నేర్పిన విష్ణుమూర్తి భజనలే నచ్చాయి. అవే పాడుతాము.
 అని ఒక మంచి సంకీర్తన పాడారు.
 (హి. క.) : పాట మాధుర్యాన ప్రాణాలు కరిగెనే అంటూ మైమరచిపోయి అంతలోనే తేరుకుని.

(హి. క.) : అయ్యో దేవుడా ఏమిటీ వైపరీత్యం.

ప్రహ్లాదుడు: తండ్రీ చూచితిరా! మీరుకూడా దైవస్మరణ చేసితిరి. అందరికీ ఆ హరే శరణాగతి

(హి. క.) : చీ. మీకోతిమూక నా బుద్ధినికూడా చెరుపుతున్నారు. గురువుగారు! వీళ్ళకి తగిన శాస్తి చేయవలసి ఉన్నది. ఇవ్వాల్టికి పిల్ల వెధవలందరికీ పండ్లు ఫలములు, మిఠాయిలకు మారుగా కాకరకాయలు, ముల్లంగి, వెల్లుల్లి, గన్నేరు  పప్పు పెట్టించండి. అలాగే వీరికి బంగాళదుంప , కంద, అరటి, చామ వేపుడుకూరలు అన్నీ నిషేధించి కేవలం ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ కూరలే వండించండి.  మాట విన్నవారికి పళ్ళరసాలు, విననివారికి కషాయాలు త్రాగించండి.

మరునాడు:

గురువులు : ప్రభు  మీరు చెప్పినట్టే చేశాము. పిల్లలు ఈ  ఆహారాలను తట్టుకోలేక పోతున్నారండి.
(హి. క.) :అయ్యో హిరణ్యాక్ష : ఏదో కోపంలో అలా పురమాయించాము. పాపం పిల్లలకు సరైన తిండి లేకపోతే ఎలా. అన్నీ పెట్టండి. మళ్ళి మళ్ళీ చెప్పి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలి. మేమేమీ పాషాణ పాక ప్రభువులం గాదు

 హిరణ్యకశిపుడు  రాక్షస భటులతో:                                                                                                                                                      

(హి. క.) : (ప్రహ్లాదుడు ఇక మారడని నిశ్చయించుకుని) వీడు మన మలయజవనం వంటి మన రాక్షసకులంలో తప్పబుట్టాడు. వీనిని పలువిధములుగా హింసించి చంపివేయండి.

రాక్షస భటులు: చిత్తం ప్రభూ.

(హి. క.) : ఏవిటి చిత్తం. నా శ్రాద్ధం. పోయినసారి ఇలాగే వెళ్లి ప్రహ్లాదుని పదిలంగా తీసుకువచ్చారు. ఈ తడవ విఫలమయ్యారో మీ గుడ్లు పెరికి వేస్తాను.

హిరణ్య కశిపుడు లీలావతుల సంభాషణ:


(హి. క.) : (బాధతో) అయ్యో దేవీ. మన ముద్దుల కుమారుణ్ణి ఏనుగులతో తొక్కించి బండరాళ్ళతో మోదించి, చంపించమని నేనే పురమాయించాను. ఏమి నా దురవస్థ.

లీలావతి : స్వామీ! మీకు మనస్సులో పిల్లవాడి పైన ఎంతో ప్రేమ ఉన్నా ఈ లాగున అఘాయిత్యం ఎందుకు చేస్తున్నారో బోధపడదు.

(హి. క.) : నేను దుష్టుడినీ, రాక్షసుడినీ అన్నమాట మరచిపోవద్దు. నా స్వభావ సహజంగా ప్రవర్తించవలసి ఉన్నది.

లీ : ఒకరు చెబితే వినేవారు కారు మీరు.

(హి. క.) : జగజ్జేతను. నేను ఎవ్వరి మాటా వినను. అందరూ నా మాట వినాలి అదంతే. హరి నా ఎదుటనిలచి శరణుకోరితే కరుణించగలవాడను.

లీ : ఏమి ఈ కనీ వినీ ఎరుగని మూర్ఖత్వం.

(హి. క.) :   నారదుడు ఇంతపని చేస్తాడనుకోలేదు గర్భములో ఉండగానే మన ప్రహ్లి కి హరిభక్తి నూరి పోశాడు. ఏనాటి నుంచో వెతుకుతున్నాను. మన ప్రహ్లాదుడు చెప్పే హరి నా ముందుకు రాడేమి. అతనికి నేనంటే చచ్చేంత భయం.

లీ : మీకు పోయేకాలం వచ్చినప్పుడు తప్పక మీకు హరి కనిపిస్తాడు.

(హి. క.) :ఏమిటి దేవి? నీవు కూడా విపరీత ప్రసంగం చేయుచున్నావు ?

లీ :మరి నా బిడ్డను చంపబూనిన మిమ్ములను నేను ఎలా మన్నించగలను.

(హి. క.) : (మనసులో) అయ్యో ! ఆ హరి దర్శనంకోసం నేను ఎంత తపించిపోతున్నానో, ఎంత త్వరగా వైకుంఠం చేరవలసి ఉన్నదో వీళ్ళకు ఒక్కనాటికీ బోధపడదు

కనక కశిపు ప్రహ్లాద సంభాషణ:


(హి. క.) :నాయనా ప్రహ్లాదా! ఏమైనా కొంచెం హరిపిచ్చి వదిలిందా?

ప్రహ్లాదుడు : లేదు తండ్రీ. మరికాస్త పెరిగింది.


(హి. క.) : పిచ్చి తండ్రీ! అతను మనకు కులశత్రువురా. నా ఎదుటికి రమ్మను. ఇట్టే వైకుంఠం పంపించి వేస్తాను.

ప్ర: అక్కడ ఇక్కడ వెదకుటేల ? హరి సర్వాంతర్యామి.

(హి. క.) : ఆలాగేం. అయితే ఈ స్తంభములో ఉన్నాడా నీ హరి. లేదంటే నిన్ను నా చేతులతోనే నీ హరివద్దకు పంపిస్తాను.

స్వగతం లో : (వీనికి హరిపిచ్చితో మతి చెడింది. ముందు స్తంభం పగులగొట్టి ఆనేకు వీనిపని పడతాను )

ప్ర: నిస్సందేహంగా ఉన్నాడు.

(హి. క.) : స్వగతంలో -(వీని ఆత్మ విశ్వాసం చూస్తే భయం వేస్తోంది.హరి బయటికి వచ్చే సూచనలు నాకు పోయే  సూచనలు ఉన్నాయి. నాకు మూడినట్టే తోస్తుంది. అయినా బాధ లేదు).

బయటికి:' ఏడిరా నీ హరి. ఎందైనా కలడేమో కానీ ఇందు మాత్రం లేడు' అంటూ స్తంభాన్ని గదతో పగలగొట్టాడు.

కదిరి నృసింహుడు కంబమునా వెడలె అన్నట్టుగా నరసింహస్వామి ఆ స్థంభ మధ్యంలోనుంచి ఆవిర్భవించాడు.

(హి. క.) : అయ్యో ప్రహ్లాదా! ఈ నరసింహము భీతి గొలుపుచున్నది నన్ను రక్షించు నాయనా.


ప్ర: తండ్రీ, ఇప్పుడైనా మించిపోయినది లేదు. హరిని శరణు వేడండి

(హి. క.) : ఎంతమాత్రం వీలుపడదు నేను దుష్టుడినీ రాక్షసుడినిన్నీ. ఆ ప్రకారం నడచుకోవలసి ఉంది.
ఈ మారువేషము దాల్చిన నరహరిని ఎదుర్కొంటాను

ప్ర: వినాశకాలే విపరీత బుద్ధి:

(హి. క.) : నేనిక్కడ విష్ణుమూర్తి తో కలబడుతుంటే ఏమిటా కుదురులేని మాటలు.

(హి. క.) : వచ్చావా స్వామీ. కోరినన్ను ఏలినట్టి కుల దైవమా. వైకుంఠ వియోగము భరింపలేకున్నాను. త్వరగా నాకు ముక్తిని ప్రసాదించు తండ్రీ. నీకు నాకూ ముఖారికీ భైరవి ఉన్నంత అంతరాన్ని కూడా భరింపలేకున్నాను.

 

Wednesday, January 23, 2013

ధర్మానికి విరుద్ధం కాని కోరికను నేను --కొన్ని ఆధ్యాత్మిక కబుర్లు


       స్వామి రంగనాథానంద :"Are you growing spiritually? Can you love others? Can you feel oneness with others? Have you attained peace within yourself? And do you radiate it around you? That is called spiritual growth, which is stimulated by meditation inwardly, and by work done in a spirit of service outwardly."
practical vedanta కు ఒక చక్కని నిర్వచనం ఇది.

1990-91 లో స్వామి భగవద్గీత పై రామకృష్ణ మఠం (హైదరాబాదు) లో ఉపన్యాసాలు ఇచ్చేవారు. అంతగా అర్థం చేసుకోలేక పోయినా అప్పుడప్పుడు వినేవాడిని. కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. పగలు పనిచేసి అలసిపోయి ఉంటామేమో ఉపన్యాసం మధ్యలో ఆపుకోలేని నిద్ర వచ్చేసేది. మెలకువ వచ్చే సరికి అయిపోయేది

స్వామిగారు వ్రాసిన భగవద్గీత, వివేక చూడామణి ఓ మాదిరిగా చదివాను. ఏకబిగిన, తీవ్రంగానూ ఇప్పటిదాకా ఏ పుస్తకము చదవలేక పోయాను. (exceptions : చదువుకునే ( ??) రోజుల్లో చదివిన యండమూరి మల్లాది నవలలు.)

స్వామి గారి రచనలు చదివితే తప్పక అంతో ఇంతో inspire అవుతాము. (ఎవరి  మానసిక పరిపక్వత ను అనుసరించి వారు ప్రభావితమవుతాము అనుకుంటున్నాను). వారి నిరాడంబరత, ఆలోచనా ఔన్నత్యము జగద్విదితాలు. నిస్వార్థంగా institution building చేయటం స్వామి వివేకానంద నుంచి వారు పుణికి పుచ్చుకున్నారు. 2004 లో పరమ పదించారు.

45 సం: దాటిన తరువాత కొంత ఆద్యాత్మిక చింతన మొదలవ్వటం జరుగుతుంది.

దుష్ట సంస్కారాలు జన్మ జన్మలనుండి పోగుచేసుకోవటం  వల్ల మనసు ధర్మాచరణం కంటే దుర్మార్గంలోకి దూసుకు పోతూ ఉంటుంది (in spite of ourselves). ప్రయత్నపూర్వకంగా మంచిదారి లోకి తెచ్చుకోవాలి. though it is very difficult, it is possible (శాస్త్రం, గురువులు చెప్పిన మాట ప్రకారం).

భగవద్గీతకు ఎన్నో అనువాదాలు ఉన్నాయి. అందులో శిష్ట్లా  సుబ్బారావు గారు వ్రాసిన అనువాదం పామరులకు కూడా అర్థమయ్యే  రీతిలొనూ, ఆకట్టుకునే తీరులోనూ  ఉంటుంది. తితిదే stall లో లభ్యమౌతుంది.

కొన్ని ఆధ్యాత్మిక  పుస్తకాలు time pass కోసం మొదలు పెట్టినా తరువాత ఆసక్తికరంగా మారటం నేను గమనించాను. 

the song celestial continues to be a beacon light to human kind. అందులో ఎన్నో గొప్ప phrases ఉన్నాయి. ఉదా: ధర్మావిరుద్ధో కామోస్మి. : (ధర్మానికి విరుద్ధం కాని కోరికను నేను).

my take on ఆధ్యాత్మిక books : తీవ్రమైన వైరాగ్యం కలవారు మోక్షానికి ప్రయత్నం చేసుకోవచ్చు. మామూలు మనుషులు మరీ సంసారంలో పడి  కొట్టుకుపోకుండా కొంచెం ఆసరాగా ఉపయోగించుకోవచ్చు. సాహితీ పిపాస కలవారు కేవలం భాషా సౌందర్య దృష్టితో చదువుకోవచ్చు. కొంతమంది  bed time sedative గా, soporific ఎయిడ్  గా కూడావాడుకోవ చ్చు. హేతువాదులు విమర్శనా దృష్టితో చదవవచ్చు. అసలు ఏమాత్రం చదివకుండా జీవితం గడిపేయవచ్చు.
 
ఆధ్యాత్మిక ప్రగతి అనేది  ఒక ఆసక్తికరమైన ఆట వంటిదే. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళి మొదలు పెట్టవచ్చు.
 ఎంత దురాచార పరులయినా మంచిమార్గంలోకి రాగల అవకాశం ఉంది. each saint has had a past and every sinner has a future.

ఉబుసుపోక సంగీతకబుర్లు వ్రాసుకునే నేను ఇలా వ్రాయటమంటే అర్థం ఉన్నపళంగా ఆధ్యాత్మికం గా మారిపోయాననికాదు. ఉత్తినే.