Friday, September 17, 2010

రేవతి + కీరవాణి + శంకర్ మహదేవన్

ఎప్పటినుంచో ఈ పాట పైన ఒక టపా వ్రాదాము అనుకుంటున్నాను.

శ్రీ రామదాసు సినిమాలోని ’ఏ మూర్తి’పాట ఒక masterpiece అని అనుకుంటాను.
శంకర్ మహదేవన్ గొంతులో నాకు నచ్చిన సుగుణాలు 1) శ్రుతి. 2) శ్రావ్యత 3) స్పష్టత. కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి ఒకప్పుడైతే బాలు గారు పాడాలి. ఇప్పుడు శంకర్ పాడాడు. మరొకరి గొంతులో బాగుండదు.

ఇంకా కీరవాణి ఈ పాటను రేవతి లో స్వరపరచటం నాకు బాగా నచ్చింది. పాట సాహిత్యం కూడా చాలా గంభీరంగా విలక్షణంగా ఉంది. పాట బాణీ 'un-keeravani-esque' గా ఉంది. రామదాసు సినిమాకే తలమానికం వంటి పాట ఏమూర్తి పాట.


రేవతి మంచి vibrant రాగం. ఒక healing touch ఉన్న రాగం. ఎప్పటినుంచో ఒక పూర్ణకుంభం లాంటి పాటకోసం ఎదురుచూశాను. ఈ పాటతో ఆ కోరిక తీరింది.

ఈ రాగంలో నాకు నచ్చిన కొన్ని పాటలు :

’మానసవీణ మధుగీతం’- పంతులమ్మ (పాట పల్లవి, మొదటి చరణం వరకు రేవతి)
’నానాటి బతుకు నాటకము’

ఇంకా ఝుమ్మందినాదం సై అంది పాదం, ఓ బంగరు రంగుల చిలకా పలకవే, అభినవ శశిరేఖవో,ఉదయకిరణ రేఖలో etc.. ఉన్నాయి . 

Wednesday, September 8, 2010

వెంకీ చెబితే వినాలి.

నాకు ఈ మధ్య వెంకటేశ్ తో తీసిన మణప్పురం గోల్డ్ లోన్ ప్రకటన బాగా నచ్చింది. వెంకటేశ్ తన నటనను చక్కగా మెరుగుపరుచుకున్నాడు. i simply loved him in this ad. simple yet effective.

మూణ్ణెల్ల క్రితం ఉద్యోగంలో స్థానాంతరణ చెంది బోధన్ లో ఉంటున్నాను. బ్లాగ్ లు చూడలేకపోతున్నాను. వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎటుచూసినా పచ్చటి పొలాలు. నేత్రపర్వంగా ఉంది.

బ్లాగ్లోకం సూపర్ నోవాలాగా విస్తరిస్తుంది. ఈ వేగం నేను అందుకోలేనని అనిపిస్తుంది.

Saturday, June 19, 2010

సింధుభైరవి+ బాలు గారు + విశ్వరూప విన్యాసం

బాలు గారి గొంతులో ఉరకలెత్తిన ఒక పాట. ఎమ్మెస్వీ సంగీతం. సింధుభైరవిలో వరద గోదారి లాంటి బాణీ -బాలు  ప్రాణం పోశాడు. కమల్ dance steps comical గా అనిపిస్తాయి.  
-- విన్నతరువాత ఎదలో నిశ్శబ్ద జలపాతం.

సింధుభైరవి pathos బాగా పలికిస్తుంది. ఎన్నో నదులను కలుపుకునే సముద్రం లాంటి లోతైన రాగం.

నీ పేరు తలచినా చాలు. ఈ పాటవిన్నతరువాత ఒక అరగంట సేపు ’ఏవిటిది? ఏదో తెలియనిదీ? ఎప్పుడూ జరగనిది ఏవిటిది’ అన్న భావం చాలాసార్లు నాకు కలిగింది. నిజంగా నిజం.

’మామ’ కు ఇష్టమైన రాగమని ఎక్కడో చదివాను.

శ్రీరంగం గోపాలరత్నం గారి గొంతులో ఈ అన్నమయ్య సంస్కృత పదం సకలం హే సఖి--ముఖ్యంగా ’చారు కపోల స్థల కరాంచిత విచారం హే సఖి జానామి’

ఈ పదచిత్రం వింటే అలా చక్కటి చెక్కిలిపై చేయి చేర్చి శ్రీనివాసుని కోసం ఆలోచిస్తున్న అలమేలుమంగ రూపం స్పురిస్తుంది. జయదేవుని శైలి ఈ అన్నమయ్యపదంలో కనిపిస్తున్నది.

సింధుభైరవి విన్నంతసేపు మనస్సు గడ్డ కట్టిందో కరిగిపోయిందో ఇట్టె అర్థంకాదు.

Sunday, April 25, 2010

పచ్చాని పైరుమీద బాసచేసి చెబుతాను- పాట నచ్చిందని

ఖైదీ బాబాయ్ సినిమాలోని ’ఓరబ్బీ చెబుతాను’ పాట బాగుంటుంది.

సినారె వ్రాసిన ఈ పాటలో కవితాత్మ కలిగిన రెండు మాటలు నాకు బాగా నచ్చాయి.

1) పండగ పూట ఒక నిండు నిజం చెబుతాను
2) పచ్చాని పైరుమీద బాసచేసి చెబుతాను. (ఈ మాటలు ఎంతో హృద్యంగా అనిపిస్తాయి)

సినారె వ్రాసిన ఎన్నో పాటల లాగే ప్రశ్న జవాబు రీతి లో పాట ఉంటుంది. ఘంటసాల జానకి గారు పాడిన విధానం పాటకు నిండుదనం ఇస్తుంది.
కెవి మహదేవన్ బాణీ చక్కగా ఉంది. కీరవాణి రాగ చాయవలె నాకు అనిపించింది.

ఏమైనా ఆ పాటలకున్న ఆత్మసౌందర్యం ఇప్పటిపాటలకు లేదు. అవును నిజం. నిక్కమగు నీలం లాంటి నిజం. కొంతమంది సినారె ను విమర్శించుదురుగాక. ఆయన నాకు అభిమాన కవి. పండిత పామరులను ఏకకాలంలో రంజింపజేసే రచనలు ఆత్రేయ, సినారే చేసినారు. వేటూరి, సీతారామ శాస్త్రి గొప్పరచయితలే కావచ్చు కానీ సినిమా పాటకు ఎంత అవసరమో అంతమేరకే సంక్లిష్టత చూపగలిగే ఒడుపు ఆత్రేయ, సినారె దగ్గర ఉంది.

Monday, March 29, 2010

వసంతం - సుందరం సుమధురం

ఈ రాగంలో పాటలు తక్కువే. అప్పుడప్పుడు సుందరమో సుమధురమో అన్నట్టుగా వినిపిస్తాయి.

ఈ పాట పల్లవి ఇలా ఉంది

సుందరమో సుమధురమో
చందురుడందిన చందన శీతలమో
మలయజ మారుత శీకరమో
మనసిజరాగ వశీకరమో

ok. పదాలు బాగున్నాయి. పాటకు packing materialగా ఉపయోగ పడినాయి.

సంగీతము, సాహిత్యము రెండు వేరువేరు plane లలో ఉంటాయి అనిపిస్తుంది. చెత్త బాణీలలో మంచి సాహిత్యం ఉంటే విడిగా చదువుకోవటం బెటర్. మంచి tune అయితేనేమో just swallows lyrics. అప్పుడైనా విడివిడిగా ఆస్వాదించాల్సిందే. ఎందుకంటె tune మాయలో పడి ఏపదాలు ఉన్నాయో జ్ఞప్తికి రాదు. అసలు సంగీతానికి మాటలు అవసరమా?

రెంటికీ చక్కని balance చేయటం పాతతరం వాళ్ళు బాగా చేసేవారు.

శుభోదయం చిత్రంలో నటనం ఆడెనే పాట, సాగరసంగమంలో నాదవినోదము అన్నపాటలోని కైలాసానకార్తీకాన హిమదీపం చరణం వసంతరాగంలో ఉన్నాయి.
నరసింహా సినిమాలో నీలాంబరి పాడిన ఈ పాట (నిత్యశ్రీ - రహమాన్ )  
త్యాగరాజస్వామి వారి 'సీతమ్మ మాయమ్మ' ప్రసిద్ధ సంప్రదాయ కృతి.

Saturday, March 13, 2010

vibrant రాగాలూ, pastel రాగాలూ-ధర్మావతి.

రంగులలో లాగానే రాగాలలో కూడా vibrant రాగాలూ, pastel రాగాలూ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మూడోరకం in your face రాగాలు కొన్ని ఉన్నాయి. ఇది నేను సరదాగా విభాగం చేసుకున్నది. 

vibrant రాగాలు ఇరుసంజల సూరీడి రంగు లాంటి గాఢతతో కమ్మేస్తాయి. లాగేసుకుంటాయి.

కొన్ని లేత రంగుల మల్లే కనిపించకుండానే కనిపిస్తాయి ఆకాశం రంగులాగా. ఇవి pastel రాగాలు.

ధర్మావతి ఒక ముదురు నేరేడుపండు రంగు లాంటి రాగం.(ఎందుకలాగ అనిపించింది అంటే ఏమో తెలీదు)

రహమాన్ సంగీతం ఇచ్చిన ఈ డబ్బింగ్ పాట గుర్తుకు వస్తుంది జెంటిల్ మేన్ సినిమాలోది. పిచ్చివాణ్ణి కట్టుకో నెత్తికేసి కొట్టుకో’(అసలు పాటలో కొంటెవాణ్ణి కట్టుకో అని ఉంటుంది.) ఇలా మార్చి పాడుకున్నా it makes no difference. రహమాన్ బాణీలు ఎందుకో నాకు nursery rhymes లాగా అనిపిస్తాయి. కొండొకచో విశృంఖలంగా కొండదారుల్లో ప్రవహించే నదుల్లాగా కూడా అనిపిస్తుంటాయి.

msv స్వరపరచిన ఈ పాట
హలో మైడియర్ రాంగ్ నంబర్ 70 లలో మంచి హిట్ పాట.

ధర్మావతిలో నాకు బాగా నచ్చిన పాట శోభారాజు గారు స్వరపరచిన గోవిందాశ్రిత గోకులబృందా అనే అన్నమయ్య కీర్తన.
over simplification అనుకోకుంటే : గౌరి మనోహరి రాగం లోనుంచి శుద్ధమధ్యమాన్ని మార్చి ప్రతిమధ్యమం చేరిస్తే ధర్మావతి స్వరాలు వస్తాయి. శంకరాభరణం లో కూడా ఇదే మార్పుచేస్తే కళ్యాణి మూర్చనలు ఏర్పడతాయి.

Thursday, March 11, 2010

గౌరి మనోహరి-కొన్ని మంచిపాటలు

నేను అమితంగా అభిమానించే ఒక రాగం గౌరి మనోహరి. ఎన్నో మంచి సినీ గీతాలు ఉన్నాయి ఈ రాగంలో. పంచదార తియ్యగా ఉంది. తేనె మధురంగా ఉంది అని చెప్పడము కంటే కొంత నోటిలో వేసుకుంటే తెలిసిపోతుంది.

రాజేశ్వర రావు గారు స్వరపరచిన ఈ రెండు పాటలు.

1) కన్నుల దాగిన అనురాగం - రంగుల రాట్నం -- పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ గారు  గానం.
2) నీ జిలుగు పైటనీడలోన నిలువనీ -పూలరంగడు - సుశీల, ఘంటసాల గానం

msv సంగీతం కూర్చిన పెళ్ళీడు పిల్లలు చిత్రంలోని ’ పరువపు వలపుల సంగీతం’ పాట వింటే సుశీలగారి గానమాధుర్యం అవగతమవుతుంది. 

సుశీలగారే పాడిన ’ఎవరో రావాలీ’ పాట మామ సంగీతంలో ప్రేమ నగర్ చిత్రంలో. ఇది కొంచెం కష్టమైన పాట.

ఇంకా సితార చిత్రం లోని ’వెన్నెల్లో గోదారి అందం’ ఇదే రాగంలోని మరొక ప్రసిద్ధమైన పాట.

ఇలా ఒకే రాగంలోని పాటలు వరుసగా వింటే మెలకువగా ఉంటూనే ఒకవిధమైన నిద్రలోకి జారుకోవటం జరుగవచ్చు. ఒక కొంచెం సేపు అన్నీ మరిచిపోవచ్చు.

ఈ రాగానికి దగ్గరగా ఉండే మరొక మేళకర్త రాగమైన ’ధర్మావతి’ లో పాటల గురించి మరొకసారి వ్రాయాలని ఉంది.