Thursday, December 30, 2010

ఆరభి, సామ, శుద్ధ సావేరి రాగ త్రయం - త్రివేణీ సంగమం

నేను ప్రాణంగా ప్రేమించే రాగం పైన రాస్తున్నఈ టపాతో నా కల నెరవేరింది. కొండను కొంచెం అద్దంలో పట్టుకుంటాను.
ఆరభి, సామ ,శుద్ధ సావేరి రాగాలు ఒకే నదిలోని మూడు పాయలుగా అనిపిస్తాయి నాకు. ముఖ్యంగా శుద్ధ సావేరి
సమ్మోహన శక్తి ఉన్న రాగం. ఈ రాగాలలో ఉన్న మాధుర్యం చెప్పనలవి కాదు.

బృందావనమది అందరిది తో మొదలైన ఆ ఇష్టం పాడనా తెనుగు పాట తో అమాంతం పెరిగిపోయి జానకి కలగనలేదు పాటతో సంపూర్ణమైంది.

జానకి కలగనలేదు పాటకు all time ఇళయరాజా favourites లో రెండవ స్థానం ఇస్తాను. (first spot is a no brainer. మాటే మంత్రము పాటకు చెందుతుంది.) ఎంత గొప్పపాట. కొన్ని వందలసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. they marred the picturization of this song with comical steps. ఆత్రేయ సాహిత్యం,సుశీల, బాలు యుగళం--తెలుగు సినిమా పాటలకే తలమానికం వంటి పాట ఇది.

అసలు ఈ పాటకు బీజం పాడనా తెనుగు పాట (అమెరికా అమ్మాయి) తో పడింది అనుకుంటున్నాను. ఎందుకంటే స్వరకర్త g k వెంకటేశ్ కు అప్పుడు ఇళయరాజా సహాయకుడు గా ఉన్నాడు. ఈ పాట సాహిత్యం దేవుల పల్లి. ఆ పేరే చాలు. ఈ పాటలో వీణ, వయొలిన్లు చాలా చక్కగా western style ను కర్ణాటక శైలి లో fusion చేసిన విధానం అపురూపం. సుశీలగారు మాధుర్యానికి care of address అని చెప్పటం లో పునరుక్తి దోషం ఒక్కనాటికీ ఉండదు.

ఆరభి రాగానికి బైబిల్ వంటి కీర్తన ’సాధించెనే’. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతి. ముఖ్యంగా బాలమురళి ఈ కీర్తన ను అనితర సాధ్యంగా పాడారు. త్యాగరాజ స్వామి వారి పంచరత్న కృతుల సాహితీ, సంగీత మాధుర్యాన్ని ఆస్వాదించటానికి ఒక జీవితకాలం సరిపోదు.
రెండు మెచ్చు తునకలు- ’సమయానికి తగు మాటలాడెనే’, ’వెత కలిగిన తాళుకొమ్మనెనే’.

Saturday, December 11, 2010

తబలాను చెవి మరుగు చేసేశారు

దాదాపుగా తబలాను వాడటం మానేశారు. ఇప్పుడంతా drums లేదా digital sounds

ఎంత నిండుదనంగా ఉండేవి ఆ పాటలు.
తబలాను stylish గా వాడిన కొన్నిపాటలు ఉదహరిస్తాను.

1) యుగంధర్ సినిమాలో ’దాస్తే దాగేదా’ పాట. మంచి stylised composition.
ఇళయరాజా తొలినాళ్ళలో ఇచ్చిన పాట.
సినారే(?)/ ఆత్రేయ సాహితి కూడా చాలా simple yet effective గా ఉంది.

బాలు, జానకి అద్భుతంగా పాడారు.

ఈ పాటలో నాకు బాగా నచ్చిన కొన్ని వాక్యాలు.

- పుట్టాము గనక తప్పదు చావక ముందు వెనక తేడాగా
ఏతాడైనా మూడే ముళ్ళు సంబరమంతా మూన్నాళ్ళు.
ఉరితాడంటి బిగి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేసేస్తా.
ఇది నీ అంతో మరి నావంతో ఏదో ఒకటి ఇక తేలాలి.

2) ప్రేమలేఖలు సినిమా లోని ’ఇది తీయని వెన్నెల రేయి’ పాట.
alltime classic పాట. బాలు సుశీల గారు పాడిన గొప్ప యుగళ గీతాలలో ఒకటి.

ఎన్నో గొప్ప పాటలు తబలా percussion తో పరిపూర్ణతను పొందాయి.

అసలు తబలా లేని పాటలో తెలుగుదనం, ఇంకా భారతీయత పోయినట్టు అనిపిస్తుంది

Friday, November 19, 2010

కాఫీ ఒక్కోసారి నిద్ర పుచ్చుతుంది కూడా

విద్యాసాగర్. a much improved composer. నా అభిమాన సంగీత దర్శకుడు.

తమిళంలోనే ఎన్నో మంచిపాటలు ఇచ్చాడు. అతని పాటలు కొన్నితలచుకుంటే  బాగుంటుంది అనిపించింది. కాఫి రాగం లోని ఈ పాట అరవంలో చాలా హిట్టయ్యింది.

తమిళ గాయకులు కొన్నిచోట్ల ఒత్తులు పలకక పోవడం నేను గమనించాను. ఉదా: బాస్కర్, బైరవి, కాంబోజి ఇలా అనటం కద్దు. అలాగే కాఫీ ని కాపి అంటారు.(త్రాగేది) వారి భాష ప్రకారం అది సరైనదేనేమో. కానీ సంస్కృత భాష ఆలంబనగా కల మనకు సరైన ఒత్తులు లేకుండా వింటే చెవుల్లో సీసం పోసినట్లు ఉంటుంది.
digression ఆపేస్తే.

’మాస్’ పాటలాగా అనిపిస్తూనే ’క్లాసికల్’ బేసు గా స్వరపరచటం విద్యాసాగర్ చక్కగా నేర్చుకున్నాడు. ఈ కాఫి రాగం ఒక గాడత తో కూడి ముదురు వర్ణమల్లే ఉంటుంది. కొంచెం బజ్జో పెట్టే స్వభావం కూడా ఉంది.

పై పాటలో రెండు విషయాలు ప్రముఖంగా ప్రస్తావిస్తాను. 1) సాధనా సర్ గమ్ గొంతు. అతి మధురమైన గొంతు కలిగిన గొప్ప గాయని ఈమె. ఎంత శృతి సుభగం గాఉంటుందో ఈవిడ స్వరం. ఏమైనా హిందుస్థానీ గాయకులకు ఈ శ్రుతి మీద విపరీతమైన పట్టు ఉంటుంది. ఇంకా ఈమె పాడిన కొన్ని గొప్ప పాటలు ఉన్నాయి. అలాగే vintage జేసుదాస్ గారు.

2) వాయిద్య సమ్మేళనం. ఎంతో అనుభవముంటేనే ఆ optimum use, brevity సాధించగలుగుతారు. విద్యాసాగర్ has mastered the art of composing interludes అనటంలో సందేహం లేదు.

ఎమ్మెస్ పాడిన ’జో అచ్యుతానంద’
శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ’నమో నారాయణ నా విన్నపమిదిగో’- కాపిలో సమ్మోహన పరిచే గీతాలు.

Saturday, October 30, 2010

బృందావన సారంగము-ఉద్యానమున వీర విహారము.

బృందావన సారంగ రాగం ఇంపుగా ఉంటుంది. శుభకార్యపు సందడి లాగా మురిపిస్తుంది. కొంచెం హిందుస్థానీ రాగంలాగా అనిపిస్తుంది.

వెంటనే గుర్తుకు వస్తుంది ’చూపులు కలసిన శుభవేళ’. రాజేశ్వర రావు+ ఘంటసాల+ లీల. మధురమైన పాట . ముఖ్యంగా ఉద్యానమున వీర విహారము అన్నమాట విని నవ్వు వస్తుంది. ఘంటసాల గొంతు.  majestic గా ఉన్నది. 


ఒక కన్నడ పాట (సదా కణ్ణలి ) డా. రాజకుమార్,వాణీ జయరాం పాడినది-కవిరత్న కాళిదాస సినిమాలోది. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఎం రంగారావు ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం సమకూర్చారు. రాజకుమార్, జయప్రద నటించారు .

ఈ పాట కూడా బాగుంది. typical ఇళయరాజా బాణీలో.


శ్రీరంగపుర విహార’ ప్రసిద్ధమైన ముత్తుస్వామి దీక్షితులు వారి కీర్తన.

ఇంకా మయూరి సినిమాలో ’ఇది నా ప్రియ నర్తన వేళ’ అన్న పాట బాగుంటుంది. బాలు కట్టిన బాణీ బాగుంది. కానీ music అవసరాన్ని మించి ఉంది.

Tuesday, October 19, 2010

నది గొంతులో అలపాట

మండుటెండలో చలివేందర కనిపించి దాహం తీరితే కలిగే ఆనందం. ’ఒకమనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు’. ఈ పాట వింటే కలుగుతుంది .

ఒక్కోసారి మంచి పాటలు చెవినపడటం ’serendipity' అనుకుంటాను.

రాగం కళ్యాణి. రాగలోకానికి మకుటం ఉన్న మహారాణి. పూర్ణమద: పూర్ణమిదం. అన్నట్టుగా పరిపూర్ణమైన రాగం.

కీరవాణి, గంగ పాడారు. ఈ అబ్బాయి చాలా మంచోడు అనే ఒక రవితేజ సినిమాలోది. కీరవాణి పాడితే నాకు నచ్చదు కానీ ఈ పాట అతను బాగానే పాడాడు అనిపించింది.

పాట సాహిత్యం హృదయంగమంగా ఉన్నది. కవితాత్మకత ఉట్టి పడుతోంది. సాధారణంగా పాట సాహిత్యంలో సంక్లిష్టత, అస్పష్టత కొంచెం ఎక్కువైనా నా mind blank అవుతుంది. పాటలోని కొన్ని మాటలు ఇలా ఉన్నాయి.

’పసిపాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమ
మునిమాపులో మరుమల్లెలా మలినాలు లేని ప్రేమ’

’అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమ
నదిగొంతులో అలపాటలా తడబాటు లేని ప్రేమ’

thanks కీరవాణి & చంద్రబోస్.

Friday, September 17, 2010

రేవతి + కీరవాణి + శంకర్ మహదేవన్

ఎప్పటినుంచో ఈ పాట పైన ఒక టపా వ్రాదాము అనుకుంటున్నాను.

శ్రీ రామదాసు సినిమాలోని ’ఏ మూర్తి’పాట ఒక masterpiece అని అనుకుంటాను.
శంకర్ మహదేవన్ గొంతులో నాకు నచ్చిన సుగుణాలు 1) శ్రుతి. 2) శ్రావ్యత 3) స్పష్టత. కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి ఒకప్పుడైతే బాలు గారు పాడాలి. ఇప్పుడు శంకర్ పాడాడు. మరొకరి గొంతులో బాగుండదు.

ఇంకా కీరవాణి ఈ పాటను రేవతి లో స్వరపరచటం నాకు బాగా నచ్చింది. పాట సాహిత్యం కూడా చాలా గంభీరంగా విలక్షణంగా ఉంది. పాట బాణీ 'un-keeravani-esque' గా ఉంది. రామదాసు సినిమాకే తలమానికం వంటి పాట ఏమూర్తి పాట.


రేవతి మంచి vibrant రాగం. ఒక healing touch ఉన్న రాగం. ఎప్పటినుంచో ఒక పూర్ణకుంభం లాంటి పాటకోసం ఎదురుచూశాను. ఈ పాటతో ఆ కోరిక తీరింది.

ఈ రాగంలో నాకు నచ్చిన కొన్ని పాటలు :

’మానసవీణ మధుగీతం’- పంతులమ్మ (పాట పల్లవి, మొదటి చరణం వరకు రేవతి)
’నానాటి బతుకు నాటకము’

ఇంకా ఝుమ్మందినాదం సై అంది పాదం, ఓ బంగరు రంగుల చిలకా పలకవే, అభినవ శశిరేఖవో,ఉదయకిరణ రేఖలో etc.. ఉన్నాయి . 

Wednesday, September 8, 2010

వెంకీ చెబితే వినాలి.

నాకు ఈ మధ్య వెంకటేశ్ తో తీసిన మణప్పురం గోల్డ్ లోన్ ప్రకటన బాగా నచ్చింది. వెంకటేశ్ తన నటనను చక్కగా మెరుగుపరుచుకున్నాడు. i simply loved him in this ad. simple yet effective.

మూణ్ణెల్ల క్రితం ఉద్యోగంలో స్థానాంతరణ చెంది బోధన్ లో ఉంటున్నాను. బ్లాగ్ లు చూడలేకపోతున్నాను. వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎటుచూసినా పచ్చటి పొలాలు. నేత్రపర్వంగా ఉంది.

బ్లాగ్లోకం సూపర్ నోవాలాగా విస్తరిస్తుంది. ఈ వేగం నేను అందుకోలేనని అనిపిస్తుంది.