Tuesday, June 9, 2015

నే వెతుకుతున్న నిధి దొరికింది - not quite - కొన్ని సంగీత కబుర్లు

1) రుద్రమదేవి పాటలు విన్నాను.   - ఔనా నీవేనా  నే వెతుకుతున్న నిధి నీవేనా? ఇళయరాజా ఏనాడో  కురిపించిన ఎన్నటికీ వాడని సుమసమూహంలో నుంచి జారిన ఒక  పువ్వులా అనిపించింది. . హరిహరన్, సాధనా సర్గమ్ గొంతులలో  సీతారామశాస్త్రి గీతం.
పాటలో ఆకట్టుకొనే పదాలు. -'మేర మీరిపోయే ఏరయ్యింది వయసు' , 'జింకపిల్ల కళ్ళే ఇలా వేటాడేనా'. 
ఈ పాట బాణీ,సంగీతం, సాహిత్యం, పాడిన తీరు అన్నీ చక్కగా కుదిరాయి. 

తక్కిన పాటలు నాకు అంతగా నచ్చలేదు.   ఎంతో passion ఉన్నవాళ్ళే ఇటువంటి చిత్రాలు తీయగలరు. anushka looks majestic and gorgeous all at once. there is no one like her. Great screen presence.


2) కొన్ని పాత మధురాలను వీణపై చక్కగా వాయించాడు రాజేశ్ వైద్య. మాధుర్యం తొణికిసలాడుతున్నాయి.
 


 
 








Wednesday, April 22, 2015

బాగాయనయ్యా శశివదనా నీ మాయ ఎంతో - కథమేతాం తరామ:



చంద్రజ్యోతి రాగం ఒక అరుదైన రాగం. త్యాగరాజ స్వామి రెండు కీర్తనలు మాత్రమే ఈ రాగంలో కూర్చారు. 
 1) బాగాయనయ్యా   ( బాలమురళి )  2) శశివదనా భక్త జనావన శంకర  (os అరుణ్).
అరుణ్ ప్రముఖ కర్ణాటక /భజన సంగీత విద్వాంసుడు. పాటను  ఎంతో అనుభవిస్తూ, లీనమై పాడుతూ, ఆంగిక అభినయంతో, విచిత్రమైన ముఖ కవళికలతో కచ్చేరీని రక్తి కట్టిస్తాడు.  there is never a dull moment when arun performs.

90-91 లో శ్రీ ఏడుకొండలస్వామి అనే చిత్రం వచ్చింది. అందులో సప్త శైల విశాల పన్నగ అనే ఆణిముత్యం లాంటి పాట ఉంది. జన్యరాగం చంద్రజ్యోతిలో ఉందా లేక జనకరాగం పావనిలో ఉందా అని కొంచెం సందేహం.  SPB గొంతులోని పరిణితి, పాడిన విధానం గొప్పగా ఉన్నాయి. సంస్కృత పద భూయిష్టమైన ఈ పాటలో బాలు ఉచ్చారణ impeccable గా ఉంది. 

భక్తులు  జప తప ధ్యానాలు చేసుకునే సమయంలో కొండొకపరి అవాంఛిత  ఆలోచనలు కలగటము, మనసు పాదరసంలా జారిపోవటము కద్దు. త్యాగరాజ స్వామి సామాన్యులు ఎదుర్కొనే ఈ పరిస్థితిని ఊహించి శశివదనా భక్త జనావన  కృతిలో తెచ్చిన పోలిక : -  మునుల యాగాలను అపవిత్ర ద్రవ్యాలతో భంగపరచిన మారీచుని అణచిన  భంగి , పూజా సమయంలో నా మనసున పుట్టే దుష్ట చింతనలను అణచివేయమంటున్నాడు. 

బాగుందయ్యా ,  లోకమంతా  గారడీ చేసి  ఆనందిస్తూ మళ్ళా నాకేమీ తెలియదంటావు. స్వబాంధవులను  చంపనని మారాం చేసిన అర్జునునికి, నీకూ నాకూ ఏమీ అంటుకోదయ్యా అని బురిడీ కొట్టించావు.  బ్రహ్మకైనా అర్థం గాదయ్యా. బాగాయనయ్య నీ మాయలెంతో. 

 


Saturday, March 28, 2015

ఒకపరి అన్నమయ్య ఇంకొకపరి తిరుమలయ్య

పెద తిరుమలయ్య - అన్నమయ్య సుపుత్రుడు- తండ్రి వొరవడిని అందిపుచ్చుకున్న మహా పండితుడు. - తండ్రి శైలిలోనే శ్రీనివాసునిపై అపురూపమైన కీర్తనలు రచియించాడు.
మేలుకో శృంగార రాయ -ఒకపరి కొకపరి వయ్యారమై-గోవిందాశ్రిత గోకులబృంద-వేదములే నీ నివాసమట విమల నారసింహా--రంగరంగ రంగపతి రంగనాథ - ఇవి పెద తిరుమలయ్య రచనలు. 
ఇటీవల తిరుమలయ్య ప్రణీత   'చక్రవాళ మంజరీ' అన్న లఘు ద్విపద కృతి- తితిదే వారి లఘు పుస్తకం  చదివాను. తిరుమల శ్రీనివాసాచార్య వ్యాఖ్యతో. వ్యాఖ్యానం అరటి పండు వొలిచి పెట్టి నట్టుగా అర్థమవుతున్నది. 

కావ్యం సంగ్రహంగా ఉన్నా హృదయం సంగ్రహించేలా ఉన్నది. కొన్ని విశేషాలు. 
సాధారణంగా ద్విపద ఛందస్సు లో - ప్రతి పాదంలోనూ మూడు ఇంద్రగణాలు ఒక సూర్య గణము ఉంటాయి. ప్రాస, యతి ఉండాలి. ప్రాసయతి కూడదు. 
ప్రాస నియమం లేని ద్విపద మంజరీద్విపద అవుతుంది.  మంజరీద్విపదకు ముక్తపదగ్రస్తం అనే లక్షణము (సమాసాంతం లో గానీ , పాదాంతంలో గానీ ఉన్న రెండు అక్షరాలను మాత్రమే గ్రహించి మలి సమాసంగానీపాదంగానీ మొదలవ్వాలి) తోడయితే అది చక్రవాళ మంజరీ కావ్యమవుతుంది. 

వ్యాఖాత మాటల్లోనే... 
" ముక్తపదగ్రస్తముండే  మంజరీద్విపదలు వ్రాయటం కష్టమైన కార్యం. దీనికి విశేషమైన పాండిత్యం, శబ్దాధికారం, రచనా సామర్థ్యం ఉండాలి". 
కావ్య వస్తువు -  శ్రీనివాసునికై పద్మావతీ దేవి విరహము- చెలుల రాయబారము- నీలతోయద సన్నిభుడైన శ్రీనివాసునికి విద్యుల్లేఖా ఇవ భాస్వరా అయినటువంటి పద్మావతికి కళ్యాణము. - తొల్లింటినగర ప్రవేశము. 
చక్రవాళంలోని చక్రకేళులు.. 

శ్రీలలనాధారు జిన్మయాకారుగారుణ్యవర్తి వేంకటగిరిమూర్తి 
మూర్తిత్రయ శరీరు మునిజనోద్ధారుధారుణీసంగు నుత్తమ శోభితాంగు 
నంగుష్ఠ భవసిందు యదులోక బంధు  । బంధురబలశూరు భక్తవిచారు

డైన శ్రీనివాసుని ..

కొనియాడ విని యొక్క కొండుక కొమ్మ । కొమ్మలలో నెలకొన్న పూమొగ్గ 
మ్రొగ్గని మరుదంతి మోహన వాణివాణీశ సంస్తుత వరహావభావ 
భావజుయంత్రంబు పగిది పూబోడి పోడిమిగల మంచి పుత్తడి బొమ్మ
పద్మావతీ దేవి వలచింది. 
పద్యసాహిత్యం గురించి ఏమీ తెలియని పామరుడికైనా ఆసక్తి కలిగే విధంగా ఉన్న ఈ లఘుకృతి  సులభగ్రాహ్యమైన వ్యాఖ్యానం తో నన్ను ఎంతో ఆకట్టుకున్నది. 
తాళ్ళపాక పాకశాసనుడు అన్నమయ్యకు, పెద తిరుమలయ్యకు నమస్సుమాంజలి.  












Wednesday, October 1, 2014

సంగీత కళానిధి పాట - సంగీత శాస్త్ర 'మేలుప్రతినిధి' మాట



తెలుగునాట కర్ణాట సంగీతపు  పెద్దదిక్కు అయిన నేదునూరి - సంగీత నాట్యశాస్త్ర పండిత వర్యుడైన పప్పు వేణుగోపాలరావు గార్లు కలసి అన్నమయ్య - రామదాసు ల పాటలను వివరిస్తున్న lecture-demo దృశ్యకం
 ఆకట్టుకుంటుంది. 
ఈ ఉదాహరణ సహిత ఉపన్యాసంలో  ఆసక్తి కలిగించిన అంశాలు కొన్ని. 

1)  కర్ణాటక సంగీతపు nobel prize గా భావించే సంగీత కళా నిధి పురస్కారం అందుకున్న తెలుగు వారి సంఖ్య పది లోపే. అది నేదునూరి గారు 1991 లో అందుకున్నారు.  పై ఉపన్యాసంలోవారి మాటల్లోనే..  ఆయనకు సంగీత కళా నిధి propose చేసినది సెమ్మంగూడి గారు. second చేసినవారు m.s. సుబ్బలక్ష్మిగారు.  ఈ ఒక్క సంగతి చాలు నేదునూరి విద్వత్తు ఎంత గొప్పదో తెలియటానికి. 

తెలుగువారిలో నేదునూరిగారి తరువాత సంగీతకళానిధి అందుకోగల ఒకే ఒక ఆశాదీపం mandolin శ్రీనివాస్ మనలని  వదలి వెళ్లిపోయాడు. కనుచూపు మేరలో ఇంకెవరూ లేరు.  

(వారికి ఇంతదాకా పద్మ పురస్కారం ఇవ్వకపోవటం బాధాకరం. ఈ ఏడాది వారికి 'పద్మ విభూషణ్' ఇస్తేనే ఇంతకాలం నిర్లక్ష్యించిన పాపానికి నిష్కృతి.) 

2)  త్యాగరాజస్వామి వారి 12 కీర్తనలకు కూడా నేదునూరిగారు స్వరకల్పన చేశారని తెలియవచ్చింది. ఈ మహత్కార్యానికి తగినవారు వారే 

3) అన్నమయ్య గీతాలను  కీర్తన స్థాయిలో స్వరపరచి  పరిపూర్ణతను చేకూర్చారు పరమ సంప్రదాయవాది నేదునూరి గారు. . పలుకుతేనెల తల్లి, ముద్దుగారే యశోద, పొలతి జవ్వనము, నానాటి బ్రతుకు నాటకము, పురుషోత్తముడవీవు, భావములోనా బాహ్యమునందున.. ఈ అన్నమయ్య గీతాలకు శాశ్వతత్వాన్ని చేకూర్చారు నేదునూరి గారు.  

4) పప్పు వేణుగోపాల్ గారు ఒక encyclopaedia అని చెప్పవచ్చు.  క్లిష్టమైన అంశాలను audience స్థాయికి తగ్గట్టుగా వివరించటం ఆయన ప్రత్యేకత. ఒకేవ్యక్తిలో  సంస్కృత, తెలుగు భాషా పాండిత్యం, నాట్య శాస్త్రం, సంగీత శాస్త్రం ఇన్ని విద్యలు ఉండటం తెలుగువారికే గర్వకారణం. నేదునూరి గారి నుంచి అద్భుతమైన విశేషాలను పూవునుంచి భ్రమరం  మధువును లాగిన విధాన చక్కగా రాబట్టారు. 

5) నేదునూరి గారు అంత చక్కగా ఆంగ్లంలో మాట్లాడుతారని  తెలిసింది.  

 పై ఉపన్యాసం ఆద్యంతం ఆసక్తికరంగా  educative గా ఉన్నది.  audience లో కొద్దిమందే కనిపించారు. 

ఇటువంటి దృశ్యకాలు youtube ద్వారా  ఎంతోమందికి చేరాలి. 
నాకు ఎంతో ఆనందాన్ని, తృప్తిని కలిగించిన video ఇది.  






Sunday, September 21, 2014

mandolin మాంత్రికుడా ఇక శెలవు.



mandolin శ్రీనివాస్  మరణం  సంగీత ప్రేమికులు దిగ్భ్రాంతి చెందే వార్త. కంటతడి పెట్టని అభిమాని లేడు.

mandolin శ్రీనివాస్  పండిత్  రవిశంకర్,  ద్వారం, చిట్టిబాబు, ఎహుది మెనుహిన్, ఎల్. సుబ్రహ్మణ్యం, హరిప్రసాద్ చౌరాసియా...   స్థాయికి చెందిన విశ్వానికే తలమానికమైన సంగీత విద్వాంసుడు.

ఎక్కడి పాలకొల్లు. ఎక్కడి mandolin . ఎవరీ శ్రినివాసు. ఎక్కడికి చేరుకున్నాడు. దాదాపు 35 ఏళ్ళుగా సంగీతాభిమానులను ధన్యులను చేశాడు.

సృష్టికర్త  కొంతమందిలో తన అంశను అధికంగా నింపుతాడు. favourite child of god అనవచ్చు. సంగీత సరస్వతీ దేవత ప్రియ మానస పుత్రుడు.

శరదృతువులో  వెన్నెల జలపాతం ఆ సంగీతం. ఆ సంగీతాన్ని విని ఆనందిచటమే తప్ప వర్ణించే సామర్థ్యం నాకు లేదు.  కచ్చేరీ చేశాడంటే అమృత సాగరం ఆనకట్ట  గేట్లు ఎత్తినట్టే. ఆ సంగీత ఝరి లో ఎంత తడిసినా తనివితీరదు. 


పండిత్  రవిశంకర్, సెమ్మంగుడి, విక్కు వినాయకరాం, లాల్గుడి, కద్రి, ఉమయలపురం శివరామన్.... శ్రీనివాసును అభిమానించే సంగీత దిగ్గజాలు. పద్మా సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు శ్రీనివాస్ జీవితం , సంగీతం అన్నీ fast  track లో జరిగిపోయాయి.

వారి ఆత్మ శాంతికై  ఒక చిరుదీపం - 'తులసీ దళములచే'

జాతస్య మరణం ధ్రువం అని తెలుసు కానీ ధృవం జన్మ మృతస్య అన్న హామీని ఇంత నిర్దయగా  'mandolin శ్రీనివాస్' ను మనకు దూరం చేసిన  ఆ దైవం నిలబెట్టుకోవాలి. నాకు ఆ నమ్మకం ఉంది.

Monday, August 18, 2014

a genius goes by the name of s. రాజేశ్వరరావు

S . రాజేశ్వరరావు గారు  ఒక పరిపూర్ణమైన సినీ సంగీత దర్శకుడు. వారిని ఆత్మీయంగా బ్లాజ్ముఖంగా స్మరించుకోవాలి అనిపించింది. ఇప్పుడు వస్తున్న garbage cine music నుంచి ఉపశమనంగా ఉంటుంది.

మేధావి. సినీ సంగీతానికి ఎంతమేరకు అవసరమో అంతవరకే శాస్త్రీయ సంగీతాన్ని వాడటం తెలిసిన వారు. విభిన్న శైలులను adapt చేసుకోవటంలో ఆయన దిట్ట.

పసుపు, సున్నం కలయికతో కుంకుమ వర్ణం ఏర్పడినట్టు కొంచెం కర్నాటకం కొంచెం హిందుస్తానీ , కొంత లలిత శాస్త్రీయం కలిపి సినీ సంగీతానికి సరిపడే ఒక హాయైన శైలిని సృష్టించాడు.

SRR - PS కలయికలో వచ్చిన వీణ పాటలు అజరామరాలు. ఆయన బాణీలు వింటుంటే music made simple అనిపిస్తాయి. కానీ పాడినవాళ్ళకు తెలుస్తుంది అవి అంత వీజీ కాదని. .

ఉదా: 1) 'పాడెద నీ నామమే గోపాల ' (అమాయకురాలు-పి.సుశీల). పాట ఎత్తుగడలోనే srr ముద్ర ప్రబలంగా వినిపిస్తుంది.

2) మదిలో వీణలు మ్రోగే. (ఆత్మీయులు- పి.సుశీల)

చంద్రలేఖ, మల్లీశ్వరి, మిస్సమ్మ, మాయాబజార్, భక్త ప్రహ్లాద, భక్త జయదేవ, భీష్మ, పూజా ఫలం  -- SRR గొప్ప సంగీతం అందించిన చిత్రాలలోకొన్ని.  భీమ్ పలాస్ , మోహన కళ్యాణి రాగాలు ఆయనకు ఇష్టమని పిస్తుంది. పాటలో రెండు చరణాలు ఉంటే విభిన్నంగా బాణీలు కట్టడం ఆయన శైలి.

పూలరంగడు చిత్రంలోని 'చిగురులు వేసిన కలలన్నీ' పాట నాకు ఎంటో ఇష్టమైన  పాట.

మిస్సమ్మ లోని ఆరభి రాగంలోని  'బృందావనమది అందరిదీ' పాట ఎన్నటికీ మరువలేము.

పూజాఫలం లోని 'నిన్నలేని అందమేదో', ' పగలే వెన్నెల' పాటలు తెలుగువారికి వారు ఇచ్చిన ఎన్నడూ ఇంకిపోని మంచినీటి చెలమలు. 

వారి ప్రవేటు గీతాలు కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన nasal voice తో పాడటం విలక్షణంగా ఉంటుంది.

SRR , పెండ్యాల , సుశీల , ఘంటసాల - అది ఒక స్వర్ణ యుగం. వారి సంగీతం తెలుగువారి అమూల్యమైన సంపద.

పాతవన్నీ మంచివి. కొత్తవన్నీ చెత్తవి అన్నది నా ఉద్దేశ్యం కాదుకానీ DSP & taman లు ఇచ్చే సంగీతపు కొరడాదెబ్బలకు SRR గంధం పూతలు అవసరమే. 

Thursday, July 17, 2014

గహనా మనసో గతి: అధునా హిందోళమే శరణాగతి.

మనసు చేసే మాయలు అన్నీ ఇన్నీ కావు.  ఉన్నతంగా కొన్ని సార్లు , నీచంగా అనేక మార్లు, ఎక్కువభాగం మామూలుగా ప్రవర్తిస్తుంది.
ఒకపరి శిష్టాన్నములు  ఒకపరి దుష్టాన్నములు  కోరుతుంది.

మంచి సంగీతం  వినటం మనసును  higher plane లో ఉంచుతుంది.

(preachy preachy అవుతోంది. lemme shift  gears  )


GBK గారు  అన్నమయ్య పదాలను జనరంజకంగా బాణీలు కట్టడంలో ఎంతో కృషి చేశారు వారు హిందోళంలో కట్టిన ఈ పాట వింటే మైమరచి పోవటం ఖాయం.' నారాయణ నీ నామమే గతి ఇక '..

ఒక శ్రోత ఇలా వ్యాఖ్యానించారు '  ప్రాణం పోయినా పరవాలేదు ఈ పాట విన్నాక' .  అని.
అంత గొప్పగా ఉంది ఈపాట బాణీ , ప్రసాద్ గారు పాడిన తీరు.
పాటలో అట్టే ఆకట్టుకునే మాటలు  'పైపై ముందట భవజలధి దాపు వెనుక  చింతా జలధి చాపలము నడుమ సంసార జలధి'

హిందోళమే అమృతతుల్యంగా ఉంటుంది. ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి.

సముద్రపు అలలు, నిండు చందమామ , చంటిపిల్లల నవ్వులు,  ఎంత చూసినా తనివితీరదు, విసుగు పుట్టదు.
ఈ పాట కూడా ఆ కోవ లోనిదే.

అలాగే 'మునుల తపమునదె మూలభూతి యదె'  పాట కూడా చాలా బాగుంది. ముఖ్యంగా  చరణాల ప్రారంభంలో ఉన్న మాధుర్యం మనసుకు హత్తుకుంటుంది.

మనసు మాట వినదు కాని పాట  వింటుంది. మనసు గతి ఇంతే.

అధునా