Tuesday, February 28, 2023

తెలుగింటి హారతి నెలకొన్న కీరితి - సురటి

ఆదౌ నాట అంత్యే సురటి అన్న సంగీత సంప్రదాయం తెలుగునాట ఉన్నది.  

కచేరీ తొలి గీతం నాట, హంసధ్వని లేదా సౌరాష్ట్ర రాగాలలో ఉన్న గణపతి ప్రార్థనా గీతాలతో ప్రారంభించి సురటి, మధ్యమావతి లేదా శ్రీ రాగాలలోని మంగళ హారతి గీతములతో ముగించడం జరుగుతుంది.

తప్పనిసరి కాదు కానీ ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగింపు కనిపిస్తుంది.

సురటి రాగం అనగానే తెలుగువారికి సుపరిచితమైన శ్రీ లలితా శివజ్యోతి సర్వ కామదా అన్న గీతం (రహస్యం - పి.లీల - ఘంటసాల) ప్రముఖంగా వినిపిస్తుంది.

తెలుగు మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు చేసి, నోములు నోచుకుని, పేరంటాలు జరిపి హారతి పాటలు పాడుకోవడం సంప్రదాయం.

సురటి రాగం లో కీ. శే. శ్రీరంగం గోపాలరత్నం గారు 

ఇద్దరి తమకము ఇటువలెనే అనే అన్నమయ్య కీర్తన  స్వరపరచి పాడారు.

అలాగే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు అంగనలీరే ఆరతులు అన్న చక్కని అన్నమయ్య కీర్తన స్వరపరచి గానం చేశారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ రచించిన శివనాటకం రూపకం నుంచి ఒక మంగళ నీరాజనం గీతం

(బాలకృష్ణ ప్రసాద్)

------

స్వామికి

సారమైన దివ్యాన్నము షడ్రసయుత భక్షణములు నివేదన చేసి

జాజికాయ, జాపత్రి, యాలకులు, వక్కలాకులతో కూడిన విడెము సమర్పించి

సురటిలో నీరాజనం ఇచ్చిన

త్యాగరాజ స్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తన 

పతికి హారతీరే సీతాపతికి 

పల్లవి :
పతికి హారతీరే….
సీతాపతికి హారతీరే.

అను పల్లవి :

అతి మృదుతర సత్య భాషణునికి
అఖిలాండనాథునికి
సీతాపతికి హారతీరే…..

చరణం :
బంగరు రంగు భుజంగునిపై…
చెలంగుచును మరకతాంగుడు
తెరంగున మెరయు తన అంగనతో
పలుకంగ జూచి ఉప్పొంగుచు
సీతాపతికి హారతీరే

అక్కరతో నిరు ప్రక్కల నిలిచి
తళుక్కని మెరయగ చక్కని మోమున
చుక్కలరాయని మక్కువతో సరి
ముక్కెర కదలగ గ్రక్కున సీతా
పతికి హారతీరే

రాజ విభాకర రాజధరామర
రాజ శుకాజ విరాజులు చూడగా
రాజమానమగు గాజులు ఘల్లన
రాజిత శ్రీత్యాగరాజనుతునికి
పతికి హారతీరే
సీతాపతికి హారతీరే…..

(చివరి చరణం లో రాజ విభాకర రాజధరామరరాజ శుకాజ విరాజులు అన్న సమాసం లో రాజ - చంద్రుడు, విభాకర - సూర్యుడు, రాజధర - శివుడు, అమరరాజ - ఇంద్రుడు, శుక - శుకుడు, అజ - బ్రహ్మ, విరాజ - గరుడుడు - పద విభజన)

🙏

Tuesday, February 21, 2023

మృచ్ఛకటికం

ఆకాశం అద్దుకున్న నీలం

ఆత్మ చుట్టుకున్న చేలం


నిన్నటి లోయలోకి జారిపోతూ 

రేపటి ఊబిలో కూరుకు పోతూ 

ఇప్పటి క్షణం ఆవిరవుతుంది.


ఘటం ఘనంగా పలుకుతుంది

మృత్తిక మౌనంగా ఉంటుంది.


ఎగసి ఎగసి అలసి సొలసి

కడలి ఒడిని అల సేద తీరుతుంది.


అద్దంలో నగరపు తళుకులు

స్వప్నంలో మెరుపుల మరకలు


సప్త వర్ణమయ దీప కాంతిలో

రంగురాళ్ల జిలుగు తెల్లబోతుంది.

 

జ్యోతి వెలుగులో రజ్జువును చూసి

భ్రాంతి సర్పం చల్లగా జారుకుంటుంది.


దేహాభిమానం దగ్ధమైతే

మరణం మహోత్సవం అవుతుంది.


మట్టి బండి లో మహాయాత్ర 

ముగిసి పోతుంది.


(బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి అద్వైత బోధల స్ఫూర్తితో )






Sunday, February 12, 2023

మును తపమేమి జేసెనో - యదుకుల కాంభోజి రాగం - కొన్ని సంగీత ముచ్చట్లు

శ్రీరామ జయ రామ అన్న త్యాగరాజ స్వామి సంప్రదాయ కీర్తన సుమధురం. సుప్రసిద్ధం. సులభ గ్రాహ్యం. అత్యంత మనోహరం. భక్తి భావ భరితం. యదుకుల కాంభోజి రాగ స్వరీకృతం.

ఈ కీర్తన లోని భావ ప్రకటనా రీతి (idiom) తెలుగు వారికి మాత్రమే పూర్తిగా అవగత మవుతుంది అనిపిస్తుంది.   శ్రీమద్రామాయణం లోని హృద్యమైన సన్నివేశాలు  కళ్లముందు ఒక్కసారి కదలాడుతాయి. శుద్ధ సత్వ గుణం అక్షర రూపం దాల్చి ప్రకటితమయిన భావన కలుగుతుంది.  సాహిత్యం చదివినా లేక పాట విన్నా కూడా మాటల్లో చెప్పలేని మధుర భావం ముప్పిరి గొంటుంది. అది అనుభవైక వేద్యం మాత్రమే.

-----------

పల్లవి :

శ్రీరామ జయరామ శృంగార రామ యని చింతింపరాదే ఓ మనసా

చరణం :

1. తళుకు జెక్కుల ముద్దుబెట్ట కౌసల్య మును తపమేమి జేసెనో కౌసల్య

తపమేమి చేసెనో తెలియ

2. దశరథుడు శ్రీరామ రారా యనుచు పిల్వ మును  తపమేమి జేసెనో దశరథుడు 

తపమేమి చేసెనో తెలియ

3. తనివార పరిచర్య జేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో సౌమిత్రి 

తపమేమి చేసెనో తెలియ

4. తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో కౌశికుడు 

తపమేమి చేసెనో తెలియా

5. తాపంబణగి రూపవతియౌట కహల్య తపమేమి చేసెనో అహల్య 

తపమేమి చేసెనో తెలియ.

6. తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి జేసెనో జనకుండు తపమేమి జేసెనో తెలియ

7. దహరంబు కరగ కరము బట్ట జానకి తపమేమి చేసెనో జానకి 

తపమేమి చేసెనో తెలియ

8. త్యాగరాజాప్తాయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో ఆ మౌని 

తపమేమి చేసెనో తెలియ

శ్రీరామ జయరామ శృంగార రామయని చింతింపరాదే ఓ మనసా

------- ప్రముఖ గాయని పంతుల రమ గారు భావయుక్తంగా పాడారు.

-----------

యదుకుల కాంభోజి రాగం లఘు చరణాలలో  మధుర భక్తి భావన ప్రకటనకు మిక్కిలి అనువైన రాగం.

ఈ రాగం లో ఘంటసాల గారు పాడిన అద్భుత భక్తి గీతం శేషాద్రి శిఖరాన 

-----------

శేషాద్రి శిఖరాన, స్థిరముగ వెలసిన

శ్రీ వేంకటేశ్వర ప్రభో పాలయశ్రీవేంకటేశ్వరా

శంఖ చక్రముల చెరియొక్క చేతనుసొంపుగా పట్టితివా ప్రభో శ్రీశా

వరద ముద్రను బూని, యూరువున కేలుంచి

ఒయ్యార మొలికింతువా ప్రభో శ్రీశా

తిరుమోము నందున శ్రీపాదరేణువునా 

తిరునామముంచితివా ప్రభో శ్రీశా

వజ్రాంగి కవచము, వయ్యారముగ దొడిగి తోమాల వైచీతివా, ప్రభో శ్రీశా

ఉరమునా యిరువంక, శ్రీదేవి, భూదేవి

రయ చెన్నెలరింతువా ప్రభో శ్రీశా

పద్మావతీ రమణ పాలింపవే నన్నుపాదాల నెర నమ్మితీ ప్రభో శ్రీశా

-----------

ఘంటసాల గారి అమృత తుల్య గాత్రం లో ఈ పాట తెలుగు వారి ప్రతి ఇంట పలుకుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం కనులముందు ప్రత్యక్ష మవుతుంది.

త్యాగరాజ స్వామి కృతి నుంచి స్ఫూర్తి పొంది నట్లుగా స్వరాభిషేకం అనే   కె. విశ్వ నాథ్ గారి చిత్రం లో 

----------

అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు బిలువ తపమేమి జేసెనొ ఈ రామయ్య 

అగ్రజుడు రాఘవుడు తమ్ముడా యనుచు బిలువ తపమేమి జేసెనో లక్ష్మణుడు

-------------

అన్న మంచి పాట వచ్చింది. కల్యాణి రాగం లో ఈ పాటకు విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు. వేటూరి సాహిత్యం. కె జే. జేసుదాసు, ఎస్పీ బాలు గారు అద్భుతంగా పాడారు.

అలాగే ఈ రాగం లోని భద్రాచల రామదాసు కీర్తన సీతమ్మకు జేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పాట అంటే తెలుగువారికి ఆరో ప్రాణం. బాల మురళి గాత్రం లో ఆ పాట వినడం అంటే అరిటాకులో పండుగ భోజనం చేసినంత ఆనందం. యదుకుల కాంభోజి రాగం తెలుగువారికి స్వంతం అని చెప్పడం అతిశయోక్తి కానేరదు.

🙏🙏🙏


Friday, February 3, 2023

కె. విశ్వనాథ్ గారు - కళా తపస్వి.

మనిషి ఏ వృత్తిలో ఉన్నా ధార్మిక ప్రవృత్తి ఉంటే ఆ  జీవితం ధన్యత పొందుతుంది. విశ్వనాథ్ గారు అందుకు ఒక ప్రబల ఉదాహరణ.

విశ్వనాథ్ గారి చిత్రాల గొప్పదనం గురించి అనేకమంది అనేక సార్లు చెప్పుకుంటూ ఆనంద పడుతుంటారు. మన మనసులపై అంత బలమైన ముద్ర వేశాయి అవి. 

ఆయన చిత్రాల లోని అనేక సన్నివేశాలు, పాత్రలు మన కళ్లముందు సజీవంగా కదలాడుతాయి.

ఆయన తీసిన ప్రతి చిత్రం లోనూ మనం ఆనందపడే సంగీతం , సాహిత్యం, కథ, నటన, తెలుగుదనం, విలువలు, బలమైన సన్నివేశాలు -  తప్పనిసరిగా భాగంగా ఉంటాయి. 

విశ్వనాథ్ గారి చిత్రాలలో ప్రథమ ద్వితీయ స్థానాలలో  శంకరాభరణం, సాగర సంగమం ఉంటాయి అని చెప్పవచ్చు.

శంకరాభరణం చిత్రంలో నిజానికి సోమయాజులు, మంజు భార్గవి గారికి జాతీయ అవార్డు ఇవ్వాలి. అలాగే స్వర్ణ కమలం ఉత్తమ చిత్రం, దర్శకుడికి కూడా ఇవ్వాలి. అయితే అప్పట్లో వామపక్షవాద బికారి చిత్రాలు తీసే వారికే ఎక్కువగా అవార్డులు వచ్చేవి.అలాంటి వాళ్ళు అవార్డు కమిటీ లలో ఉండేవారు.

శంకరాభరణం లో అల్లు రామలింగయ్య గారి పాత్ర ఎంత బాగా వచ్చింది. మంచి నటులకు సరైన గౌరవప్రదమైన పాత్రలు సృష్టించి ఇవ్వడం దర్శకుడి అభిరుచికి సహృదయతకు నిదర్శనం.

కథానాయకుల పాత్రలకే కాక సహాయ నటులకు, హాస్య నటులు, అతి చిన్న పాత్ర పోషించే వారికి కూడా ఒక గౌరవం, సముచిత స్థానం ఇవ్వడం విశ్వనాథ్ గారి చిత్రాలలో గమనించ వచ్చు. 

హీరో పాత్రలను మాత్రమే గొప్ప చేసి హాస్య పాత్ర ధారుల చెంప పగలగొట్టే, అవమానించే సన్నివేశాలు, అసభ్య, అశ్లీల సన్నివేశాలు  ఆయన చిత్రాలలో ఉండవు. ఎందుకంటే ఆయన సహజ ప్రవృత్తి ధార్మిక స్వభావం. ఎదుటి మనిషిని గౌరవించే తత్త్వం. 

సాగర సంగమం చిత్రం లో కమల్ హాసన్, జయప్రద ల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు వారు ఇంట్లో ఫోటో తీసుకునే సన్నివేశం, నాట్య ప్రదర్శన లో కమల్ పేరు చూసుకున్నప్పడు వచ్చే సన్నివేశం - immortal scenes.

అనంతపురం లో రఘువీరా థియేటర్ లో  సాగర సంగమం చిత్రం విడుదల అయిన మొదటి రోజు మొదటి ఆట చూసిన విషయం గుర్తు ఉంది. ఒక స్నేహితుడు లైను లో దూరి టిక్కెట్టు సంపాదించాడు. కమల హాసన్ నట జీవితం లోనే అత్యుత్తమ చిత్రం సాగర సంగమం.

స్వర్ణ కమలం చిత్రం లో ఒక ఘనాపాటి పండితుని ఒక పై అధికారి అవమానించే సన్నివేశం మరచిపోలేము.  ఒక గొప్ప వేద పండితుని పట్ల అధికారి అనుచిత  ప్రవర్తనను చూపే సన్నివేశం. 

ఆయన చివరగా తీసిన కొన్ని చిత్రాలు అంతగా ఆదరణ పొందలేదు. అయితే వాటిలో కూడా కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి.

In my view Vishwanath garu was a master story teller.  Screenplay is his strength. 

ఆయన తీసిన అద్భుత చిత్రాలకు - ఏడిద నాగేశ్వరరావు వంటి అభిరుచి ఉన్న నిర్మాతలు, అద్భుత మయిన నటులు, వేటూరి, జంధ్యాల, సీతారామ శాస్త్రి, సినారె, ఆత్రేయ, కేవి మహదేవన్, రాజేశ్వరరావు గారు, ఇళయరాజా , గొప్ప ఛాయాగ్రాహకులు, గాయకులు - ఈ గొప్ప బృందం సహకారం ఎంతో ఉంది.

ముఖ్యంగా వేటూరి గారు సిరిసిరి మువ్వ, శంకరాభరణం చిత్రాలలో విశ్వ రూపం చూపారు. 

సప్తపది, శంకరాభరణం చిత్రాలలో  జంధ్యాల గారి సంభాషణలు చాలా గొప్పగా ఉంటాయి.

సంగీత సాహిత్య సమలంకృతే, దొరకునా ఇటువంటి సేవ, విరించినై విరచించితిని, ఆడవే మయూరీ, రావమ్మా మహాలక్ష్మీ, మావిచిగురు తినగానే, శివపూజకు చిగురించిన, ...  Immortal claasics.

విశ్వనాథ్ గారి పట్ల చలన చిత్ర పరిశ్రమ లో ఉన్న అందరికీ అపారమైన గౌరవం ఉంది. అది అభినందించదగ్గ విషయం. కళా తపస్వి అన్న పేరు విశ్వనాథ్ గారికి ఎంతైనా సార్థకం.

విశ్వనాథ్ గారి గొప్ప చిత్రాలను కొత్త తరానికి, రాబోయే తరాలకు కూడా అందించే ప్రయత్నం జరగాలి.

Fortunate to have been born in the same era of the legend K Vishwanath garu.🙏


Wednesday, January 25, 2023

మధుర గాయని వాణీ జయరామ్ గారు


వాణీ జయరామ్ గారికి 2023 సం. పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించడం ఆనందం కలిగించింది.

70s 80s లలో వచ్చిన కన్నడం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో ఆమె అనేక అద్భుత గీతాలు పాడారు. 

అనేక భక్తి గీతాలు పాడారు.  ఇప్పటికీ పాడుతున్నారు.

కర్నాటక సంగీతం హిందుస్తానీ సంగీతం రెండింటిలోనూ శిక్షణ పొందారు వాణీ జయరామ్ గారు. ఆమె తొలినాళ్లలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగిని గా పని చేస్తూనే సంగీత రంగంలో కూడా కృషి చేశారు.

1971 సం. లో వచ్చిన గుడ్డీ చిత్రం లోని ' బోలి రే పపిహరా ' వసంత్ దేశాయి సంగీతం లో పాడిన పాట అమిత ప్రాచుర్యం పొందింది. ఆమె భారత రత్న పండిట్ రవిశంకర్ గారి సంగీతం లో వచ్చిన మీరా చిత్రం లో ప్రధాన గాయని గా అద్భుతంగా పాడారు. ఒక దశలో హిందీ చిత్ర రంగం లో ఆమె లతా మంగేష్కర్, ఆశా భోంస్లే గారితో సమానంగా రాణిస్తారు అని భావించిన తరుణం లో కొన్ని కారణాల వల్ల హిందీ రంగం నుంచి దక్షిణాదికి వచ్చేశారు. 

తమిళంలో ఎమ్మెస్ విశ్వనాథన్ , కన్నడం లో ఎం. రంగారావు, విజయ భాస్కర్, రాజన్ నాగేంద్ర , తెలుగులో కే వీ మహదేవన్ గార్లు ఆమెను బాగా ప్రోత్సహించగా అనేక మరపురాని గీతాలు పాడారు. మలయాళం రంగంలో కూడా అనేక గీతాలు పాడారు.

తెలుగు వారికి ఆమె పాడిన ఎన్నెన్నో జన్మల బంధం నీదినాది  (పూజ 1975 - రాజన్ నాగేంద్ర) , పూజలు చేయ పూలు తెచ్చాను, నింగీ నేలా ఒకటాయెలే  పాటలు అంటే చాలా ఇష్టం.

ఈ సినిమా విడుదల అయిన రోజుల్లో సినిమా బండిలో ఎన్నెన్నో జన్మల బంధం పాట వినిపిస్తుంటే ఆ బండి వెనుకే మైమరచిపోయి వింటూ వెళ్లిన విషయం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. A song which is very dear to my heart.

70s 80s లలో అనంతపురం లో ధార్వాడ్ మత్తు గుల్బర్గా , బెంగుళూరు  స్టేషన్లు రేడియో లో  బాగా వచ్చేవి. అద్భుతమైన కన్నడ పాటలు ఎక్కువగా వినే అవకాశం ఉండేది. నిజం చెప్పాలంటే తెలుగు కంటే కన్నడం పాటలు నచ్చేవి. అప్పుడు రాజన్ నాగేంద్ర, ఎం. రంగారావు, విజయ భాస్కర్, ఉపేంద్ర కుమార్, సత్యం గార్ల సంగీతం లో ఎస్పీ బాలు, జానకి, రాజకుమార్ , వాణీ జయరామ్ గార్లు పాడిన పాటలు అద్భుతం గా ఉండేవి. అది ఒక స్వర్ణ యుగం.

కే విశ్వనాథ్ గారి  శంకరాభరణం, స్వాతి కిరణం, శృతి లయలు, స్వర్ణ కమలం  చిత్రాలలో వాణీ జయరామ్ గారు పాడిన పాటలు శాశ్వతం గా నిలిచి ఉంటాయి. శంకరాభరణం 1980, స్వాతి కిరణం 1991 చిత్రాలలోని పాటలకు జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు.  తొలిసారిగా అపూర్వ రాగంగళ్ 1975 చిత్రం లో జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు. 

శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలకు వాణీ జయరామ్ గారు పూర్తి న్యాయం చేయగలరు.

ఏ భాషలో పాడినా మాతృభాష లాగా అనిపించే స్పష్టమైన ఉచ్చారణ, మాధుర్యం, భావుకత తో పాడతారు. సుశీల గారు, జానకి గారు తరువాత వాణీ జయరాం గారు ఆ తరువాత చిత్ర గారు. వీరితో చలన చిత్ర సంగీత స్వర్ణయుగం ముగిసి పోయింది.

కన్నడం లో రాజ్ కుమార్ గారితో కవిరత్న కాళిదాసు చిత్రం లోని పాటలు అద్భుతం గా ఉంటాయి.

సదా కణ్ణలి ప్రణయదా కవితె హాడువే - ఎంత హాయి గొలిపే పాట. బృందావన సారంగ రాగం లో ఎం. రంగా రావు గారి సంగీతంలో రాజకుమార్ వాణీ జయరామ్ గార్లు అద్భుతం గా పాడారు. జయప్రద గారు ఎంత అందం గా ఉన్నారు.

మేఘమే మేగమే పాట (  1981 తమిళ చిత్రం లోనిది) వాణీ జయరామ్  గారు అద్భుతంగా పాడారు. ఇదే పాట తెలుగు చిత్రం మంచు పల్లకీ లో మేఘమా దేహమా - ఎస్ జానకి గారు అంతే గొప్పగా పాడారు. ఈ పాటకు ఒక ప్రసిద్ధ గాయకుడు పాడిన  గజల్ ఆధారం అని తెలుస్తుంది. 

Living legend వాణీ జయరామ్ గారు 🙏🙏🙏

Saturday, January 14, 2023

నాటు నాటు - కీరవాణి గారు - కొన్ని సినీ సంగీత కబుర్లు



నాటు నాటు పాటకు golden globe వచ్చింది. ఆస్కార్ అవార్డు కూడా రావచ్చేమో. వస్తే ఆ పాట చరిత్రలో నిలిచిపోతుంది.

ఇంతకీ నాటు నాటు పాట ఎలా ఉంది ? సాహిత్య, సంగీత పరంగా అంత గొప్ప స్థాయి లో ఉంది అని చెప్పలేము. అయితే పాటను సినిమాలో చిత్రీకరించిన విధానం, NTR, రామ్ చరణ్ ల synchronised dance, పాట కథలో అంతర్భాగమైన తీరు. Overall package leaves an immense impact. The credit should go to the director Rajamouli for conjuring up the magical scene.

This award is a well deserved recognition for the entire body of music created by  కీరవాణి గారు and not just one song.

రహమాన్  జయహో పాట కు ఆస్కార్ అవార్డు అందుకున్నాడు. నిజానికి అదేమీ అంత గొప్ప పాట కాదు. అయితే ఆస్కార్ అవార్డు ఇవ్వదగ్గ పాటలు ఎన్నో ఇదివరకే రహ్మాన్ ఇచ్చి ఉన్నాడు. Oscar was a recognition for his career spanning decades. స్నేహితుడా, రోజా పాటలు, కండుకొండేన్, న్యూ యార్క్ నగరం, కల కల వెన -- these are masterpieces. Each of them deserves an Oscar.

ఇప్పుడు magnum opus movies కు సంగీతం ఇవ్వాలంటే కీరవాణి గారు is the final word. He is ahead of even Rahman in this aspect.  He knows how to score music for larger than life movies. అలాగే భక్తిరస చిత్రాలు.

గొప్ప సంగీత దర్శకులు సైతం కాలానుగుణంగా update కాలేక పోయారు. Even maestro ilayaraja became a pale image of himself after maybe 1995 or so. 

నా ఉద్దేశ్యం లో ఇళయరాజా 1981-89 కాలం లో గొప్ప సంగీతం సమకూర్చాడు. ఆ తరువాత తన సంగీతం లో స్థాయి తగ్గుతూ వచ్చింది. 

Keeravani gave ordinary music for many movies. Still he kept coming up with great music occassionally. He updated and adapted to modern times without compromising melody. His USP. He is probably one of the few sentinels of old school of music.

బాహుబలి సినిమాలో అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. He elevated many movies with his RR.

ఇటీవల బింబిసార చిత్రం లో కూడా ఒక మంచి పాట  ఇచ్చాడు. A beautiful song indeed. One of the best songs in recent times.

కీరవాణి సంగీతం లో నాకు బాగా నచ్చిన కొన్ని పాటలు.

1) రోసా రోసా - రాజహంస చిత్రం.  I like this song for its tune, music beat and picturization.

2) ఒక మనసుతో ఒక మనసుకు ముడి - ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం. కల్యాణి రాగం లో  ఉన్న ఈ పాట అద్భుతం. చంద్రబోస్  సాహిత్యం చాలా బాగుంటుంది. One of my all-time favourites.

3) తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో -  క్రిమినల్ చిత్రం . This may be keeravani garu best song. The humming  was inspired from an English album Euphoria. Still the entire song is his own creation. హిందీ లో కూడా ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది.

4) గోరువంక వాలగానే గోపురానికి - గాండీవం చిత్రం - memorable song with great music, lyrics, singing with ensemble cast. Icing on the cake is Mohanlal. ఈ చిత్రానికి గాండీవం అన్న పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ మెచ్చుకోవాలి.

5) అనుకోకుండా ఒక రోజు - I wanna sing

A peppy song with great tune and lyrics. I was surprised keeravani garu composed this song. 

6) పవిత్ర బంధం - గుంతలకిడి . I would rather not talk about the lyrics or Telugu accent of Asha bhosle in this song. Still this is a beautiful creation of Keeravani garu.

If the subject inspires him, keeravani garu can raise his music by a few notches.

కీరవాణి గారికి పద్మ భూషణ్ అవార్డు రావాలి అని ఆశిస్తాను.🙏





Friday, December 30, 2022

నారాయణ తీర్థులు - శ్రీ కృష్ణ లీలా తరంగిణి


నారాయణ తీర్థుల వారి కృష్ణ లీలా తరంగిణి పుస్తకము (వావిళ్ళ వారి ప్రచురణ) పుస్తక ప్రదర్శన ఉత్సవంలో లభించినది.  ఆంధ్ర తాత్పర్య సహితము. 

త్యాగరాజు - అన్నమయ్య - రామదాసు - నారాయణ తీర్థులు - సదా శివ బ్రహ్మేంద్ర స్వామి - క్షేత్రయ్య ....

ఎంతటి మహనీయులు వారు ? ఎటువంటి గొప్ప అనుభూతి తో, భక్తితో సంగీత సాహిత్య సృష్టి చేశారు. 

వారు మనకు అందించిన అమూల్య సంపదను భక్తితో కాపాడుతూ, కొనసాగిస్తూ వస్తున్న వారి శిష్య ప్రశిష్యులు, రస హృదయులు, మహారాజ పోషకులు - ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.🙏🙏🙏

ఈ పుస్తకము నుంచి కొన్ని విశేషములు.

కృష్ణ భక్తాగ్రేసరులలో నారాయణ తీర్థుల వారిది ఉన్నత స్థానము . మాధవానలుడను వైష్ణవుడు వెనుకటికి బిల్హణుడు గా, లీలా శుకుడు గా, జయదేవుడు గా నవతరించి చివరికి నారాయణ తీర్థులుగ నుదయించి ముక్తి చెందిరి. వీరు కాశీ క్షేత్రము లో గంగా తీరమున బహు కాలము నివసించి బ్రహ్మ విద్యా ప్రచారము గావించిరి. తదుపరి దక్షిణ దేశమును చేరి 1745 వ సంవత్సరములో కావేరీ తీరమునందు ఒక గ్రామమున సిద్ధిపొందిరి. వారు డెబ్బది సంవత్సరములు జీవించిరి అని యూహ చేయబడుచున్నది. 

శ్రీ కృష్ణ లీలా తరంగిణి సంస్కృత భాష లో వ్రాయబడిన సంగీత రూప కావ్యము. భాగవతమున ద్వాదశ స్కంధములు యున్నట్లే ఈ కావ్యమున పన్నెండు తరంగములు కలవు. కృష్ణుని లీలలు తరంగముల వలె సుందర లలిత మృదు మధుర పదముల తో వర్ణింప బడుటచే శ్రీ కృష్ణ లీలా తరంగిణి యను కావ్య నామము ఎంతైన సార్థకము యగుచున్నది.

జయదేవుని గీత గోవిందము శృంగార రస ప్రధానము కాగా కృష్ణ లీలా తరంగిణి కావ్యము భక్తి రస ప్రధానముగా నిర్మించబడినది.

నారాయణ తీర్థులు ఆంధ్రులు. తల్లావజ్ఝల వంశము. వీరి పూర్వాశ్రమ నామము గోవింద శాస్త్రి. గుంటూరు సీమ లోని కాజ గ్రామ వాసులు అని యూహించిరి.

వీరి కృతులలో నారాయణ తీర్థ ముద్రను చూపినారు.

గీత గోవిందము, శ్రీ కృష్ణ కర్ణామృతము, శ్రీ కృష్ణ లీలా తరంగిణి -- ఈ మూడు కావ్యములు కృష్ణ భక్తి సాహిత్యము లో అత్యుత్తమ రచనలు గా ప్రసిద్ధి పొందినవి.

ఈ కావ్యము యొక్క  ప్రథమ తరంగము కృష్ణుని జనన వృత్తాంతము తో ప్రారంభించి కృష్ణుని బాల్యము, లీలలు, గోవర్ధనోద్ధారము, రాస క్రీడ, అక్రూర వృత్తాంతము, కంస వధము, ద్వాదశ తరంగమున రుక్మిణీ కల్యాణముతో పూర్ణమవుతున్నది. కావ్యము అంతయు రమణీయ వర్ణనలతో, అత్యంత మనోహరముగా నిర్మింప బడినది.

ఈ కావ్యము లోని శబ్ద సౌందర్యము , భావ వైచిత్రి, పరమాత్మ తత్త్వ నిరూపణము, భక్తి పారమ్యము లను వర్ణించుట కంటే అనుభూతి చెందుట ఆనంద దాయకముగా తోచును. 

---------

ఒక ప్రసిద్ధ తరంగము. రాగము. ముఖారి. ఆది తాళము.

పల్లవి. 

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

అనుపల్లవి.

కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా

బాలకృష్ణం కలయ సఖి సుందరం

చరణములు.

1. నృత్యంతమిహ ముహురత్యంత మపరిమిత భృత్యానుకూలం  అఖిలసత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

2. ధీరం భవజలధిపారం సకలవేదసారం సమస్తయోగితారం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

3. శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరీ ఖేల సంగం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

4.రామేణ జగదభి రామేణ బలభద్రరామేణ సహావాప్త కామేన సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

5. రాధారుణాధర సుధాపం సచ్చిదానందరూపం జగత్త్రయ భూపం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

6.దామోదరమఖిల కామాకరం         ఘన శ్యామాకృతిమసుర భీమం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

7.అర్థం శిధిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థ పరమపురుషార్థం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

-----------

తాత్పర్యము ఇచ్చిన తీరు :

ఓ చెలీ సుందరాకారుడగు నా బాలకృష్ణుని జూడుము.

సకల లోకములకు గారణ భూతుడైనను, రాక్షసులకు శత్రువగు శ్రీమన్నారాయణుడయ్యును, విషయము లందు ఇచ్ఛ లేని వాడయ్యును, బాలుని వలె నటించు చున్నాడు.

----------

షష్ఠ, సప్తమ, అష్టమ తరంగములలో గోపికలు, కృష్ణుడు, రాధా దేవి  జరిపిన సంభాషణలు, రాసక్రీడ అత్యంత రమణీయంగా కృతుల రూపంలో కూర్చబడినవి. గోపికా బృందమునకు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమును గురించి సగుణ బ్రహ్మ రూపముగా కృష్ణుడు చేసిన యుపదేశములు, యథార్థమును గ్రహించి వారు చేసిన స్తుతులు,   ఈ తరంగములకు ఆంధ్రము నందు ఇచ్చిన తాత్పర్యము, వ్యాఖ్య  ద్వైత అద్వైతముల సమన్వయము, వివిధములుగా కనిపించే ఒకే పరమ సత్యమును అద్భుతంగా  ఆవిష్కరించినది. 

ఆద్యంతమూ శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడే యను నుత్తమాశయము పోషింపబడినది. 

-------

కృష్ణం కలయ సఖి సుందరం, 

నీల మేఘ శరీర, 

ఆలోకయే శ్రీ  బాలకృష్ణం, 

గోవర్ధన గిరిధర గోవింద,

బాల గోపాల కృష్ణ పాహి,

ఏహి ముదం కృష్ణ దేహి,

జయ జయ దుర్గే జితవైరి వర్గే 

---------

ఇత్యాది తరంగములు బహుళ ప్రచారము పొందినవి.

ఈ తరంగములు పాడుకొనుటకే గాక నృత్య రూపకములకు కూడా అనువుగా ఉన్నవి. ఈ గ్రంథమును పరిశీలనాత్మక దృష్టితో చదివి అందలి సారమును గ్రహించవలసి ఉన్నది.

కృష్ణం కలయ సఖి సుందరం - తరంగం

నీల మేఘ శరీర - కూచిపూడి నృత్యం

శ్రీ వేంకటేశ్వర భక్తి ప్రసార వాహిని వారు ప్రతి వారం ఒక కృష్ణ లీలా తరంగమును శిక్షణా పూర్వకమైన కార్యక్రమం ద్వారా ప్రసారం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం.

కృష్ణం వందే జగద్గురుమ్.

వందే పరమానంద మాధవం.

🙏🙏🙏