Sunday, February 16, 2025

కాశ్మీర పరిక్రమ - ఒక మంచి ధారా వాహిక కార్యక్రమం

(జగద్గురు ఆదిశంకర / జ్యేష్ఠేశ్వర దేవాలయం, శ్రీ నగర్)

SVBC వారు కాశ్మీర పరిక్రమ అనే ధారావాహిక  కార్యక్రమం కొన్ని సంవత్సరాల క్రితం రూపొందించారు. పున: ప్రసారం కూడా జరుగుతోంది. మంచి డాక్యుమెంటరీ దృశ్య రూపకం. 

ఇందులో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం లోని పురాతన హిందూ దేవాలయాలు ,  ఆ ఆలయాల విశిష్టత, చరిత్ర, స్థల పురాణాలు, కాలానుగుణంగా చెందిన మార్పులు,  ప్రస్తుత కాలంలో ఉన్న పరిస్థితుల గురించి ధారావాహిక గా రూపొందించారు. పారుపల్లి రంగనాథ్ గారి నేపథ్య వ్యాఖ్యానం చెప్పే తీరు. ఆయన తెలుగు సంస్కృత భాష ఉచ్ఛారణ, స్పష్టత చాలా బాగున్నాయి.

ముఖ్యంగా కాశ్మీర శైవానికి సనాతన ధర్మంలో ప్రత్యేక స్థానం ఉంది.

కాశ్మీరు సహజ సుందర ప్రదేశం. భారత దేశానికి చూడామణి వంటిది. అక్కడి నదులు, పర్వతాలు, ప్రకృతి శోభ, గుహాలయాలు, మందిరాలు, అచ్చోట పరిఢవిల్లిన  వైదిక సంస్కృతి గురించి అనేక మంది కవులు చరిత్రకారులు అనాదిగా వర్ణిస్తూ వచ్చారు.

ఈ కార్యక్రమం చివరిలో కాశ్మీర దేశం ఔన్నత్యాన్ని వర్ణించే ఒక మధుర గీతం వస్తుంది. (18 వ నిముషం నుంచి)

----------

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

సుర నందనమిది కాశ్మీరంహ

హరి మందిరమిది కాశ్మీరం

హర సుందరీ భాల సింధూరం

తుషార నగవర చుంబితాధరం

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

సీతారామ పదాంబుజ సేవన పూత విమల కాసారం

ఉమా మహేశ్వర ప్రణయ కథాలయ తుంగ ధవళ శిఖరం

సూర్య, ద్రౌపది, వైష్ణో దేవి, అమరనాథ గృహ ప్రాకారం 

జ్వాలా మాల, మహా కాళికా, గౌరీ నిత్య విహారం

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

శ్రీమత్ శంకర బోధితాద్వైత దివ్య తత్వ సారం

మునిగణ కవివర పండిత మండిత అక్షర మణికా హారం

రసమయ ఫలభర తరుతత శోభిత 

నవనవోద్యాన కాంతారం 

సుమ సౌరభ గౌరవ మానిత శీతల

సుఖమయ ధీర సమీరం 

కాశ్మీరం..కాశ్మీరం..కాశ్మీరం

గీత రచన : (డా.) శ్రీ రాణి సదాశివ మూర్తి

సంగీతం :(డా.) శ్రీమతి సరస్వతీ వాసుదేవ్

గానం :(డా.) శ్రీమతి

 ఆర్. ఎన్ ఎస్. శైలేశ్వరి 

-------

ఈ గీతం  దేశ్, భాగేశ్రీ, సింధు భైరవి రాగాలు ఆధారంగా కూర్చబడింది. సాహిత్యం సంగీతం గానం చక్కగా ఉన్నాయి.

( అమరనాథ్ గుహాలయం)
(రఘునాథ్ మందిరం జమ్ము)
(మార్తాండ సూర్య దేవాలయం)

(మాతా వైష్ణోదేవి గుహాలయం)

(శ్రీ ఖీర్ భవానీ మాత మందిరం, శ్రీ నగర్)

కాశ్మీర ప్రదేశం తలపుకు వస్తే ప్రతి హిందువు హృదయంలో ఒక ఉద్వేగం, అనిర్వచనీయ మైన అనుభూతి కలుగుతాయి. అలాగే మత ఆక్రమణలలో చెదిరిపోయిన హిందూ రాజ్యాలు, క్షీణించిన హైందవ సంస్కృతి, దాడులలో ధ్వంసమై మతోన్మాదానికి సాక్షులుగా మిగిలిన శిధిలాలయాలు అంతులేని క్షోభలను అనుభవించి కాశ్మీరం నుంచి కాందిశీకులుగా చెదిరిపోయిన పండితుల దుస్థితి, సుందర పవిత్ర భూ భాగాన్ని కోల్పోయిన భారత దేశ చరిత్ర ముప్పిరిగొంటాయి. మనసులను కలచి వేస్తాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రదేశం లో భూతలంపై ఉన్న అత్యంత సుందర ప్రదేశాలు, హిమ శిఖరాలు, పర్వతాలు, లోయలు, నదీ నదాలు ఉన్నాయి అని తెలుస్తుంది. అలాగే సరస్వతీ మాత శక్తి పీఠం కూడా ఆ ప్రదేశం లో ఉండిపోయింది అన్నవిషయం హిందువులకు ఎంతో ఖేదం కలిగిస్తుంది.

కాశ్మీర్ రాష్ట్రం లో ఉన్న శ్రీనగర్, అనంత్ నాగ్, శేష్ నాగ్, వేరి  నాగ్, బారాముల్ల (వరాహ మూల), అమర్ నాథ్ వంటి  నగరాల ప్రదేశాల పురాతనమైన  పేర్లు కాశ్మీర్ యొక్క భారతీయతకు సనాతన ధర్మానికి అద్దం పడతాయి.


(గిల్గిత్ బాల్టిస్తాన్ లోని రమణీయ ప్రదేశాలు)

(Picture credit. To the respective owners)

మార్తాండ సూర్య దేవాలయం వంటి శిధిలాలయాలు పునర్నిర్మాణం పునరుద్ధరణ జరిగితే అద్భుతంగా ఉంటుంది. స్వదేశం లోనే కాందిశీకులు గా మారిన కాశ్మీర్ పండితులు తిరిగి తమ మాతృభూమికి స్వస్థలాలకు గౌరవంగా , సురక్షితంగా చేరుకున్న రోజు కాశ్మీరం సంతసిస్తుంది. భారతీయుల దుఃఖం శమిస్తుంది.🙏🏻






No comments:

Post a Comment