Sunday, September 21, 2014

mandolin మాంత్రికుడా ఇక శెలవు.



mandolin శ్రీనివాస్  మరణం  సంగీత ప్రేమికులు దిగ్భ్రాంతి చెందే వార్త. కంటతడి పెట్టని అభిమాని లేడు.

mandolin శ్రీనివాస్  పండిత్  రవిశంకర్,  ద్వారం, చిట్టిబాబు, ఎహుది మెనుహిన్, ఎల్. సుబ్రహ్మణ్యం, హరిప్రసాద్ చౌరాసియా...   స్థాయికి చెందిన విశ్వానికే తలమానికమైన సంగీత విద్వాంసుడు.

ఎక్కడి పాలకొల్లు. ఎక్కడి mandolin . ఎవరీ శ్రినివాసు. ఎక్కడికి చేరుకున్నాడు. దాదాపు 35 ఏళ్ళుగా సంగీతాభిమానులను ధన్యులను చేశాడు.

సృష్టికర్త  కొంతమందిలో తన అంశను అధికంగా నింపుతాడు. favourite child of god అనవచ్చు. సంగీత సరస్వతీ దేవత ప్రియ మానస పుత్రుడు.

శరదృతువులో  వెన్నెల జలపాతం ఆ సంగీతం. ఆ సంగీతాన్ని విని ఆనందిచటమే తప్ప వర్ణించే సామర్థ్యం నాకు లేదు.  కచ్చేరీ చేశాడంటే అమృత సాగరం ఆనకట్ట  గేట్లు ఎత్తినట్టే. ఆ సంగీత ఝరి లో ఎంత తడిసినా తనివితీరదు. 


పండిత్  రవిశంకర్, సెమ్మంగుడి, విక్కు వినాయకరాం, లాల్గుడి, కద్రి, ఉమయలపురం శివరామన్.... శ్రీనివాసును అభిమానించే సంగీత దిగ్గజాలు. పద్మా సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు శ్రీనివాస్ జీవితం , సంగీతం అన్నీ fast  track లో జరిగిపోయాయి.

వారి ఆత్మ శాంతికై  ఒక చిరుదీపం - 'తులసీ దళములచే'

జాతస్య మరణం ధ్రువం అని తెలుసు కానీ ధృవం జన్మ మృతస్య అన్న హామీని ఇంత నిర్దయగా  'mandolin శ్రీనివాస్' ను మనకు దూరం చేసిన  ఆ దైవం నిలబెట్టుకోవాలి. నాకు ఆ నమ్మకం ఉంది.

3 comments:

  1. శ్రీనివాస్ గురించి ఒక ఆత్మీయ స్పందన కోసం చూస్తున్నానండీ! మీ పోస్ట్ కనిపించింది. కొన్ని రాతలు చూశాను. అతని కచేరీలు అటెడ్ అయ్యామనో, పర్సనల్ గా తెలుసనో చెప్పుకోడం తప్ప ఒక బాధా వీచిక లేశమైనా కనిపించలేదు.

    మీ పోస్ట్ చివరి లైను చాలా హృద్యంగా ఉంది.

    ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఎదిగి పోయి, అనారోగ్యానికి తల వంచి నిట్ట నిలువునా కూలిన మహా వృక్షం శ్రీనివాస్.

    తెలుగు వాళ్లమైన పాపానికి శ్రీనివాస్ ని తగినంతగా గౌరవించక బుద్ధి చూపించుకున్నాం! యధావిధిగా తమిళులు అక్కున చేర్చుకుని అరుదైన గౌరవాలు కట్టబెట్టారు.

    తమిళుల సంగీతాభిరుచికి, ఆ భక్తికి వేల వేల అభివాదాలు!

    అభిమానులకు తప్ప అంతగా తెలీని సెలబ్రిటీ కావడం చేతనేమో... సోషల్ మీడియాలో కూడా కవితలు వెల్లువెత్తలేదు




    ReplyDelete
    Replies
    1. మీ రన్నదిని నిజం సుజాతగారూ.

      శ్రీనివాస్ అకాలమృతి దిగ్భ్రాంతికరం. ఎంతో చిన్నవయసు పాపం. అతడు తొమ్మిదేళ్ళప్రాయంలో సికింద్రాబాద్‌లో ఏదో స్కూలు ఆవరణలో కచేరి చేస్తే జనం విరగబడి గోడలెక్కి చెట్లేక్కీ చూసారని అప్పట్లో పెద్ద వార్త అయ్యింది.

      శ్రీనివాస్ పలికించింది శాస్త్రీయసంగీతం. మన వాళ్ళకు, ముఖ్యంగా యువతకు సినిమాల్లోని వెఱ్ఱికేకలగోలలోనే సంగీతం కనిపించేరోజులు. సకృత్తుగా కాని యువతలో శాస్త్రీయసంగీతాభిరుచి పూజ్యం.

      ఒకవేళ మరీ‌ abstract art వేసే చిత్రకారుడయ్యుంటే బాపుమృతికి కూడా ఏమంత స్పందనవచ్చేది కాదన్నది పచ్చినిజం. కాని బాపు వేసింది బొమ్మలు - మనుషులు మనుషుల్లాగే కనిపించే బొమ్మలే. అందుచేత వాటిలోని సౌందర్యం మనకు సులభంగా అవగతమౌతుంది - చివరకు నేటి యువతకూ కొంతవరకూ.

      తమిళులు ఆదరిస్తారనే శ్రీనివాస్ చెన్నై వెళ్ళాడన్నది నిజం. మన తెలుగువాళ్ళకు సినిమాయే సకలకళాస్వరూపం. దాని చెల్లెలు టీవీ. నిజానికి శ్రీనివాస్ కాని మంగళంపల్లివారు కాని కచేరీ చేస్తున్నా టిక్కెట్టుముక్క కొని హాజరై ఆదరించే తెలుగన్నలూ తెలుగమ్మలూ తక్కువే.. అదే కార్యక్రమం టివీలో ఉచితంగానే కనిపిస్తున్నా ఏదో దిక్కుమాలిన సినిమాకోసమో సీరియల్ కోసమో అదమపక్షం క్రికెట్ కోసమూ తక్షణం ఛానెల్ మార్చేసుకునే‌ గొప్పసంస్కృతి మనది. వీళ్ళంతా పనికిమాలిన విషయాలు చదువుతూనూ వాటికి లైకులు కొట్టుకుంటూనూ‌కాలక్షేపం చేయటానికే ఉత్సాహం చూపుతారు కాని తమకు తెలియని సంగీతం వినిపించే తమకు తెలియని ఎవరో‌ శ్రీనివాస్ కోసం ఒక్కసారి మనసులో అయ్యో అని బాధపడే వారని అనుకోను.

      Delete
  2. సుజాతగారు: మీ స్పందనకు కృతజ్ఞతలు. ఈ నాలుగు రోజులుగా ఏదో ఒక సమయంలో శ్రీనివాస్ లేని బాధ మనసును కలచివేస్తూనే ఉంది.

    శ్యామలీయం : thank you sir. బాపు గారి గురించి మీరు చెప్పినది అక్షరసత్యం. వారు పరిపూర్ణమైన జీవితం గడిపారు అన్న తృప్తి తో కొంతవరకు వారు లేని నిజాన్ని కొంతవరకు సమాధాన పడ్డాను. కానీ నిండు నూరేళ్ళు బతకాల్సిన శ్రీనివాసు లేడన్న బాధను తట్టుకోవటం కష్టం.

    ReplyDelete