Sunday, August 9, 2015

రమేశ్ నాయుడు-దాసం గోపాలకృష్ణ-కొంత చలిమంట-కొంత చలివేందర

తెలుగు సినీగీతాలలో  కవిత్వపు అంశ  ఉన్న  పాటలు తక్కువ అని నాకు అనిపిస్తుంది. గొప్ప భావం, భాషా సౌందర్యం కల పాటలకు కొదువ లేదు కానీ కవిత్వం చాయలు ఉండే పాట కుంకుమ పువ్వు కలిపిన పాలలా పరిమళిస్తుంది. 

దాసం గోపాలకృష్ణ. ఇతను ఎవరో ఎక్కడివాడో తెలియదుగానీ, కొన్ని ఆణిముత్యాలవంటి పాటలు వ్రాశాడు. ముఖ్యంగా దాసం గోపాలకృష్ణ -రమేశ్ నాయుడు  కలయికలో మంచి గీతాలు ఉన్నాయి. (శివరంజని, కళ్యాణి, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పసుపు పారాణి)
1) ఈ పాట ఎత్తుగడలోనే మనసుకు హత్తుకునేలా ఉంది. 
"రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది. ఆవులించి చిరుకెరటం ఒళ్ళు విరుచుకుంటోంది." పాట (పసుపు పారాణి)
చరణాలలోని పదాలు  "జడలోని గులాబీ చలిమంటలు వేస్తోంది  జలతారు జిలుగు పైట చదరంగమాడుతోంది.   జలదరించి పై పెదవి చలివేందర పెడుతోంది."  పాట మొత్తం ఇలాగే విలక్షణంగా మనోహరంగా సాగుతుంది.  
2) జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా (శివరంజని) - రమేశ్ నాయుడు కు మనం జీవితాంతం రుణపడి ఉండే పాట ఇది. ఎంత సందర్భోచితంగా , ఎంత సొగసుగా ఉంది ఈ పాట. 
3) చందమామ వచ్చాడమ్మ  (శివరంజని) -తొంగి తొంగి నిన్ను చూశాడమ్మ - విడిదొసగి విందు చేయి కలువభామ. 

4) గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా   (కల్యాణి)  
5) సువ్వి కస్తూరి రంగా సువ్వి (చిల్లరకొట్టు చిట్టెమ్మ) పాట బాణీ , రచన ఎంత బాగుంది. ఆనంద భైరవి రాగచాయలలో సాగింది.  
6) సుక్కల్లో పెదసుక్క చందమామ -పాట సుశీలగారు పాడిన తీరు, రచన, బాణీ , సంగీతం అన్నీఆకట్టుకుంటాయి. 
దాసం పాటలన్నింటిలో జానపదగీతాల ప్రభావం కనిపిస్తుంది. అతనికి అందంగా  పాట రాసే ఒడుపు తెలుసు. పదుల సంఖ్యలోనే పాటలు వ్రాశాడు. మేఘసందేశం చిత్రపుకాలానికి (1982) ఆటను బ్రతికి ఉంటే తప్పకుండా అందులో పాట వ్రాసిఉండేవాడు. 
కవితాత్మకత అంటే చప్పున గుర్తుకు వచ్చే పాట "నిదురించే తోటలోకి " (ముత్యాలముగ్గు)

శేషేంద్ర ఒక్కపాటే వ్రాసినా ఎన్నటికీ నిలిచి ఉండే పాట వ్రాశాడు. నది దోచుకుపోతున్న నావను ఆపండి.  "ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది"- ఈ మాటలు ఒక్క శేషేంద్ర మట్టుకే వ్రాయగలడు. 

రమేశ్ నాయుడు సంగీతం unobtrusive గా హాయిగా సాగుతుంది. పదాలను పల్లకీలో మోస్తుంది.  సాహిత్యాన్ని పెహేలే ఆప్ అంటుంది. ఆరోజులు ఆ పాటలు . ఈ నాడు ఆ హాయిలేదేమి నేస్తం అనిపిస్తోంది.  Friday, July 17, 2015

సినీ సంగీతాకాశపు చుక్కలలో పెద్ద చుక్క చందమామ- MSV

ఒక సంగీత మేధావి నిండుజీవితం గడిపి ఎందరినో దశాబ్దాలపాటు అలరించి ప్రశాంతంగా నిష్క్రమించాడు. 
m s విశ్వనాథన్. రాజేశ్వర రావు, పెండ్యాల , ఘంటసాల స్థాయికి చెందిన సంగీత దర్శకుడు ఆయన. 
he is a true legend of south indian film music. he set a bench mark for composing and innovation which places him on a pedestal. విశ్వనాథన్-సుశీల-సౌందర రాజన్  - 60 లలో -this trio created everlasting melodies in Tamil. 70 లలో విశ్వనాథన్ కు SPB అనే genius దొరికాడు. 1980 వరకు MSV-SPB-వాణీ జయరాం-జేసుదాసు ల శకం గడిచింది. తరువాత ఇళయరాజా శకం మొదలయ్యింది. 
దాదాపు 700 చిత్రాలు -shows how prolific he has been. 
Offhand, one can reel off a 100 good songs composed by him. Let me revisit  two of his hugely popular songs. 

1) కర్ణన్ చిత్రంలోని 'ఇరవుమ్ నిలవుమ్ ' - (msv-rm , సుశీల-tms )
    తెలుగులో 'నీవు నేను వలచితిమి' (సుశీల-బాలమురళీ). శుద్ధ సారంగ రాగం లోని ఈ పాట లోని మాధుర్యం speaks for itself.

2) అన్బే వా చిత్రంలోని 'రాజావిన్ పార్వై'  - (msv - సుశీల-tms). ఈపాట interlude లో the scale is beautifully changed in western style. 
ఈ పాటలు చూస్తే 1960 లలోనే అరవవాళ్ళు ఎంత చక్కటి రంగుల చిత్రాలు తీశారు గదా అనిపిస్తుంది. 
తెలుగులో కూడా కల్యాణినీ, పరువపు వలపుల సంగీతం, యమునా తీరాన, నన్ను ఎవరో తాకిరి .. ఎన్నో మంచిపాటలు.  
hello my dear wrong number పాటను ధర్మావతి రాగంలో స్వరపరచటం ఆయన ఎంత innovatiవో ఒక మచ్చు తునక. 
రసవిద్య తెలిసిన వారందరూ ఒక్కొక్కరూ తప్పుకుంటున్నారు. 

 

Tuesday, June 9, 2015

నే వెతుకుతున్న నిధి దొరికింది - not quite - కొన్ని సంగీత కబుర్లు

1) రుద్రమదేవి పాటలు విన్నాను.   - ఔనా నీవేనా  నే వెతుకుతున్న నిధి నీవేనా? ఇళయరాజా ఏనాడో  కురిపించిన ఎన్నటికీ వాడని సుమసమూహంలో నుంచి జారిన ఒక  పువ్వులా అనిపించింది. . హరిహరన్, సాధనా సర్గమ్ గొంతులలో  సీతారామశాస్త్రి గీతం.
పాటలో ఆకట్టుకొనే పదాలు. -'మేర మీరిపోయే ఏరయ్యింది వయసు' , 'జింకపిల్ల కళ్ళే ఇలా వేటాడేనా'. 
ఈ పాట బాణీ,సంగీతం, సాహిత్యం, పాడిన తీరు అన్నీ చక్కగా కుదిరాయి. 

తక్కిన పాటలు నాకు అంతగా నచ్చలేదు.   ఎంతో passion ఉన్నవాళ్ళే ఇటువంటి చిత్రాలు తీయగలరు. anushka looks majestic and gorgeous all at once. there is no one like her. Great screen presence.


2) కొన్ని పాత మధురాలను వీణపై చక్కగా వాయించాడు రాజేశ్ వైద్య. మాధుర్యం తొణికిసలాడుతున్నాయి.
 


 
 
Wednesday, April 22, 2015

బాగాయనయ్యా శశివదనా నీ మాయ ఎంతో - కథమేతాం తరామ:చంద్రజ్యోతి రాగం ఒక అరుదైన రాగం. త్యాగరాజ స్వామి రెండు కీర్తనలు మాత్రమే ఈ రాగంలో కూర్చారు. 
 1) బాగాయనయ్యా   ( బాలమురళి )  2) శశివదనా భక్త జనావన శంకర  (os అరుణ్).
అరుణ్ ప్రముఖ కర్ణాటక /భజన సంగీత విద్వాంసుడు. పాటను  ఎంతో అనుభవిస్తూ, లీనమై పాడుతూ, ఆంగిక అభినయంతో, విచిత్రమైన ముఖ కవళికలతో కచ్చేరీని రక్తి కట్టిస్తాడు.  there is never a dull moment when arun performs.

90-91 లో శ్రీ ఏడుకొండలస్వామి అనే చిత్రం వచ్చింది. అందులో సప్త శైల విశాల పన్నగ అనే ఆణిముత్యం లాంటి పాట ఉంది. జన్యరాగం చంద్రజ్యోతిలో ఉందా లేక జనకరాగం పావనిలో ఉందా అని కొంచెం సందేహం.  SPB గొంతులోని పరిణితి, పాడిన విధానం గొప్పగా ఉన్నాయి. సంస్కృత పద భూయిష్టమైన ఈ పాటలో బాలు ఉచ్చారణ impeccable గా ఉంది. 

భక్తులు  జప తప ధ్యానాలు చేసుకునే సమయంలో కొండొకపరి అవాంఛిత  ఆలోచనలు కలగటము, మనసు పాదరసంలా జారిపోవటము కద్దు. త్యాగరాజ స్వామి సామాన్యులు ఎదుర్కొనే ఈ పరిస్థితిని ఊహించి శశివదనా భక్త జనావన  కృతిలో తెచ్చిన పోలిక : -  మునుల యాగాలను అపవిత్ర ద్రవ్యాలతో భంగపరచిన మారీచుని అణచిన  భంగి , పూజా సమయంలో నా మనసున పుట్టే దుష్ట చింతనలను అణచివేయమంటున్నాడు. 

బాగుందయ్యా ,  లోకమంతా  గారడీ చేసి  ఆనందిస్తూ మళ్ళా నాకేమీ తెలియదంటావు. స్వబాంధవులను  చంపనని మారాం చేసిన అర్జునునికి, నీకూ నాకూ ఏమీ అంటుకోదయ్యా అని బురిడీ కొట్టించావు.  బ్రహ్మకైనా అర్థం గాదయ్యా. బాగాయనయ్య నీ మాయలెంతో. 

 


Saturday, March 28, 2015

ఒకపరి అన్నమయ్య ఇంకొకపరి తిరుమలయ్య

పెద తిరుమలయ్య - అన్నమయ్య సుపుత్రుడు- తండ్రి వొరవడిని అందిపుచ్చుకున్న మహా పండితుడు. - తండ్రి శైలిలోనే శ్రీనివాసునిపై అపురూపమైన కీర్తనలు రచియించాడు.
మేలుకో శృంగార రాయ -ఒకపరి కొకపరి వయ్యారమై-గోవిందాశ్రిత గోకులబృంద-వేదములే నీ నివాసమట విమల నారసింహా--రంగరంగ రంగపతి రంగనాథ - ఇవి పెద తిరుమలయ్య రచనలు. 
ఇటీవల తిరుమలయ్య ప్రణీత   'చక్రవాళ మంజరీ' అన్న లఘు ద్విపద కృతి- తితిదే వారి లఘు పుస్తకం  చదివాను. తిరుమల శ్రీనివాసాచార్య వ్యాఖ్యతో. వ్యాఖ్యానం అరటి పండు వొలిచి పెట్టి నట్టుగా అర్థమవుతున్నది. 

కావ్యం సంగ్రహంగా ఉన్నా హృదయం సంగ్రహించేలా ఉన్నది. కొన్ని విశేషాలు. 
సాధారణంగా ద్విపద ఛందస్సు లో - ప్రతి పాదంలోనూ మూడు ఇంద్రగణాలు ఒక సూర్య గణము ఉంటాయి. ప్రాస, యతి ఉండాలి. ప్రాసయతి కూడదు. 
ప్రాస నియమం లేని ద్విపద మంజరీద్విపద అవుతుంది.  మంజరీద్విపదకు ముక్తపదగ్రస్తం అనే లక్షణము (సమాసాంతం లో గానీ , పాదాంతంలో గానీ ఉన్న రెండు అక్షరాలను మాత్రమే గ్రహించి మలి సమాసంగానీపాదంగానీ మొదలవ్వాలి) తోడయితే అది చక్రవాళ మంజరీ కావ్యమవుతుంది. 

వ్యాఖాత మాటల్లోనే... 
" ముక్తపదగ్రస్తముండే  మంజరీద్విపదలు వ్రాయటం కష్టమైన కార్యం. దీనికి విశేషమైన పాండిత్యం, శబ్దాధికారం, రచనా సామర్థ్యం ఉండాలి". 
కావ్య వస్తువు -  శ్రీనివాసునికై పద్మావతీ దేవి విరహము- చెలుల రాయబారము- నీలతోయద సన్నిభుడైన శ్రీనివాసునికి విద్యుల్లేఖా ఇవ భాస్వరా అయినటువంటి పద్మావతికి కళ్యాణము. - తొల్లింటినగర ప్రవేశము. 
చక్రవాళంలోని చక్రకేళులు.. 

శ్రీలలనాధారు జిన్మయాకారుగారుణ్యవర్తి వేంకటగిరిమూర్తి 
మూర్తిత్రయ శరీరు మునిజనోద్ధారుధారుణీసంగు నుత్తమ శోభితాంగు 
నంగుష్ఠ భవసిందు యదులోక బంధు  । బంధురబలశూరు భక్తవిచారు

డైన శ్రీనివాసుని ..

కొనియాడ విని యొక్క కొండుక కొమ్మ । కొమ్మలలో నెలకొన్న పూమొగ్గ 
మ్రొగ్గని మరుదంతి మోహన వాణివాణీశ సంస్తుత వరహావభావ 
భావజుయంత్రంబు పగిది పూబోడి పోడిమిగల మంచి పుత్తడి బొమ్మ
పద్మావతీ దేవి వలచింది. 
పద్యసాహిత్యం గురించి ఏమీ తెలియని పామరుడికైనా ఆసక్తి కలిగే విధంగా ఉన్న ఈ లఘుకృతి  సులభగ్రాహ్యమైన వ్యాఖ్యానం తో నన్ను ఎంతో ఆకట్టుకున్నది. 
తాళ్ళపాక పాకశాసనుడు అన్నమయ్యకు, పెద తిరుమలయ్యకు నమస్సుమాంజలి.