పత్రికలలో, సామాజిక మాధ్యమాల్లో హిందువులపై, సనాతన ధర్మం పై పనికట్టుకుని విషం చిమ్ముతున్న కొందరు వింత మనుషులు ఉన్నారు. తెలుగు బ్లాగుల్లో కూడా కవి, విమర్శకుడు పేరుతో ఇటువంటి ధోరణితో రచనలు చేస్తున్న ఒక మేధావి ఉన్నారు.
కొందరి జీవితాలు అకారణ ద్వేషం, అసహనం, అసూయ లతో నిండి ఉంటాయి. వీరిదొక విచిత్ర రీతి. విపరీత ధోరణి. తెలివైన వారై ఉంటారు. డిగ్రీలు సంపాదిస్తారు. వ్యవస్థలలోని సౌకర్యాలు, సదుపాయాలు పూర్తిగా ఉపయోగించుకుంటారు. సంతోషం. జీవితం లో చక్కగా స్థిరపడతారు. కానీ ఆనందంగా ఉండలేరు. తమకు తాము మానసిక పంజరాలు సృష్టించుకుంటారు. సమాజంలోఎవరో అన్యాయం చేశారు అని భావిస్తూ ఏ మాత్రం సంబంధం లేని వారిని బాధ్యులుగా చేసి వారిని ద్వేషించడం, దూషించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు.
మనువాదం బ్రాహ్మణ వాదం అంటూ నిరంతరం జపం చేస్తుంటారు. అనవసర వివాదం వితండ వాదం చేస్తుంటారు. నిజానికి బ్రాహ్మణులకు, GC హిందువులకు ప్రస్తుతం సమాజంలో ప్రతికూలత ఉంది. అయితే బైటికి చెప్పుకునే పరిస్థితి లేదు.
విచలిత మేధావులు తమ స్వీయ సంస్కృతిని , స్వధర్మాన్ని, మహనీయులను నిరాకరిస్తారు, కించపరుస్తారు. తమ శక్తి యుక్తులను వృధా చేసుకుంటారు.
సనాతన ధర్మం పట్ల తీవ్ర వ్యతిరేక భావనలతో మనుగడ సాగిస్తూ ఉంటారు.
హిందువులు బుద్ధుడిని మహనీయుడుగా అంగీకరిస్తారు. గౌరవిస్తారు. అదే విధంగా ఇతర బౌద్ధ దేశాలలోని బౌద్ధ మతస్థులు, వారి మతాచార్యులు కూడా భారత దేశం పట్ల, హిందూ మతం పట్ల మన దేవతల పట్ల ఆరాధన భావం, సద్భావన కలిగి ఉండడం గౌరవంగా మెలగటం మనం చూడవచ్చు. అయితే భారత దేశంలో ఉండే కొంతమంది కుహనా మేధావులు మాత్రం పేరుకు బౌద్ధుల మని చెప్పుకుంటూ హిందూ మతం పట్ల, సనాతన ధర్మం పట్ల, హిందూ మత ధర్మాచర్యుల పట్ల ద్వేష భావనతో దుష్ప్రచారం, దూషణల పర్వం సాగిస్తుంటారు. వీరు ఏమి సాధించాలనుకుంటున్నారో బోధ పడదు. మన భాగ్యం కొద్దీ దొరికారు వీరు.
ఆది శంకరులు అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసి గాసట బీసట గా విక్షేపం చెందుతున్న హిందూమతాన్ని పునరుజ్జీవనం చేశారు. ఆయన తన అపారమైన సిద్ధాంత బలంతో, అన్య మతాచార్యులతో వాదించి వారిని ఒప్పించి, వారి అజ్ఞాన వాదనలను తిప్పికొట్టి సనాతన ధర్మం సర్వ మానవాళికి అత్యంత శ్రేయోదాయకం అని నిరూపించారు. ధర్మం, ఆచారం, సిద్ధాంతం, మేధస్సు, దైవ బలం ఇవి శంకరాచార్యుల సాధానాలు.
దౌర్జన్యం, హింస ఆక్రమణ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు సనాతన ధర్మంలో ఆస్కారం, అవసరం లేదు. సనాతన ధర్మం సాగించేది విజయయాత్ర. సంకుచిత మతాలు చేసేది దండయాత్ర.
శంకరుల విజయం మరొకరి ఓటమి అనే సంకుచిత దృష్టి పనికిరాదు. సత్యానికి ధర్మానికి లభించిన విజయంగా భావించాలి.
అలాగే బౌద్ధారామాల స్థానం లో ఆలయాలు నిర్మించారు అని వీరు అసత్య ప్రచారం చేస్తారు. ఇది కేవలం వామపక్ష ఇస్లామిక్ కుహనా చరిత్ర కారుల వక్ర సిద్ధాంతం మాత్రమే అని ధార్మిక చరిత్ర కారులు నిర్ద్వంద్వంగా నిరూపించారు
బౌద్ధంలోని లేక ఇతర మతాలలో ఉన్న మంచి విషయాలను హిందువులు నిరాకరించరు. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, చాతుర్వర్ణవ్యవస్థ హిందూ మతం లో అంతర్భాగం. ఈ మేధావులు నుడివే వివక్ష సనాతన ధర్మం లో లేదు. వర్ణ వైవిధ్యం తప్ప వర్ణ వివక్ష హిందూమతం ప్రతిపాదించ లేదు. దేశ కాల పరిస్థితులను అనుసరించి తగిన మార్పులు చేసుకుంటూ హిందూ సమాజం ఎదిగింది. ప్రతి సమాజం లోనూ లోటు పాట్లు, వ్యత్యాసాలు, అపోహలు ఉంటాయి. ఈ లోపాలను చక్కదిద్దుతూ శంకరాచార్యుల వంటి ధర్మచార్యులు సమాజాన్ని సరైన మార్గంలో నడిపించారు
ఆది శంకరుల వారిని కించపరిచే ప్రయత్నం ఈ కుహనా మేధావుల అజ్ఞానం అవివేకాన్ని సూచిస్తుంది. అద్వైతం అర్థం చేసుకోవాలంటే ఒక మానసిక స్థాయి, open mind ఉండాలి. సంకుచిత మనస్కులకు అద్వైతం అర్థం కావడం అసాధ్యం. శంకరుల భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్ర వాజ్మయం మన దేశం మానవాళి కి అందించిన అమూల్యమైన కానుకలు. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదను అర్థం చేసుకుని మన జీవితాలను చక్కదిద్దుకోవాలనే ఆలోచన ఉండదు.
ఈ స్వయం ప్రకటిత మేధావులకు సనాతన ధర్మం పట్ల విశ్వాసం లేకపోతే పోవచ్చు. అది వారిష్టం. అయితే సనాతన ధర్మం పాటించే వారిని , ధర్మాచార్యులను దూషించడం ఆమోదయోగ్యం కాదు.
వారు శిరోధార్యం గా భావించే రాజ్యాంగం కూడా అన్ని మతాలు అనుసరించే వారికి వారి వారి ధర్మాన్ని ఆచరించే అధికారం ఇచ్చింది. ఏ హిందువైనా ఇలా అన్య మతాచార్యులు మహనీయులను అగౌరవ పరచడం లేదు కదా.
మన దేశంలో వికృత మనస్కులైన మేధావుల వల్ల భావ కాలుష్యం, సమాజం లో వివిధ వర్గాల మధ్య మనస్పర్ధలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. వీరు అమాయకులైన సామాన్య ప్రజల మనసులను కలుషితం చేస్తారు. బౌద్ధమతం పరిఢవిల్లిన గాంధార దేశం (ఆఫ్ఘన్) లోని బమియన్ పెద్ద బుద్ధ విగ్రహాలను 2001 సం. లో ధ్వంసం చేసిన ఇస్లామిక్ మతోన్మాదులు గురించి వీరు నోరు మెదపరు. బుద్ధుడిని భగవానుడు అని ఆరాధించే హిందువులపై ఆక్రోశిస్తారు. ఇదేమి మానసిక వైపరీత్యమో అర్థం కాదు.
కేవలం హిందూ మతం పై విష ప్రచారం చేయడం వీరికి చేతనవుతుంది. అసలు ప్రమాదం ఎవరినుంచి రానుందో గ్రహించకుండా మాతృ స్థానంలో ఉన్న సనాతన ధర్మాన్ని నిందించడం, నిరాకరించడం ఆత్మ హత్యా సదృశం అని తెలుసుకోలేకున్నారు. హిందూ మతం ఇచ్చే రక్షణ లేని నాడు వీరికి ఈ దేశంలో నిలువనీడ కూడా ఉండదు అని గ్రహించలేక పోతున్నారు. ఇస్లామిక్ దేశాలలో హింసకు గురై మాతృదేశానికి కాందిశీకులుగా వచ్చిన వస్తున్న శిక్కులు, బౌద్ధలను ఆదరించే దేశం భారతదేశం. స్వంతవారిగా స్వీకరించే ధర్మం సనాతన ధర్మం. అలాంటి సహృదయత ఉన్న హిందువులపై ఈ ఆందోళన జీవులు ఇంత ద్వేషపూరిత భావన చూపటం దురదృష్ట కరం.
హిందూ మతం పై సనాతన ధర్మ మతాచార్యుల పై దుష్ప్రచారం చేస్తున్న ఈ నిరర్థక మేధావుల చర్యలను హిందువులు అంగీకరించరు. తగిన సమాధానం చెబుతారు.
ఈ భూమి పై ఉద్భవించిన బౌద్ధ, జైన, శిక్కు మతాలు సనాతన ధర్మం నుంచి జనించిన శాఖలే. అయితే వేదములు, ప్రస్థాన త్రయం, అష్టాదశ పురాణాలు, రామాయణ భారతాలు పరమ ప్రమాణం. ఈ శాస్త్రాలు సమగ్రం, పరిపూర్ణం. అందున్న సత్యం మరెందు వెదకిన దొరకదు. ఈ విషయం బోధపడితే ఈ ఆందోళన జీవుల శశభిషలు ఉపశమిస్తాయి.
బుద్ధుడి బోధనలు కూడా సనాతన ధర్మంలో ఒక పార్శ్వం గా చూడాలి. ఆయన ప్రతిపాదించిన విషయాలలో మంచిని స్వీకరించడంలో అభ్యంతరం లేదు. బుద్ధ భగవానుడు ఇటువంటి వారికి సదవగాహన, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దృష్టి, సహనం, శాంతి, స్నేహ భావం కలగజేయాలని కోరుకుందాము.
ఆదిశంకరుల ఆత్మను, బోధను పరిపూర్ణంగా ఆవిష్కరించారు కీ. శే. యల్లంరాజు శ్రీనివాస రావు గారు. ఆయన రచించిన జగద్గురు మహోపదేశం పుస్తకం లింక్ ఇక్కడ ఇస్తున్నాను. ఈ పుస్తకం సద్భావన తో చదివితే అనేక సందేహాలకు అపోహలకు సమాధానం దొరుకుతుంది. అయితే ఆందోళన జీవులకు prejudiced minds కు ఆ సత్సంకల్పం కలుగుతుందా ? ఏ జన్మకైనా కలగాలని ఆశించుదాము.🙏🏻