Sunday, August 9, 2015

రమేశ్ నాయుడు-దాసం గోపాలకృష్ణ-కొంత చలిమంట-కొంత చలివేందర

తెలుగు సినీగీతాలలో  కవిత్వపు అంశ  ఉన్న  పాటలు తక్కువ అని నాకు అనిపిస్తుంది. గొప్ప భావం, భాషా సౌందర్యం కల పాటలకు కొదువ లేదు కానీ కవిత్వం చాయలు ఉండే పాట కుంకుమ పువ్వు కలిపిన పాలలా పరిమళిస్తుంది. 

దాసం గోపాలకృష్ణ. ఇతను ఎవరో ఎక్కడివాడో తెలియదుగానీ, కొన్ని ఆణిముత్యాలవంటి పాటలు వ్రాశాడు. ముఖ్యంగా దాసం గోపాలకృష్ణ -రమేశ్ నాయుడు  కలయికలో మంచి గీతాలు ఉన్నాయి. (శివరంజని, కళ్యాణి, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పసుపు పారాణి)
1) ఈ పాట ఎత్తుగడలోనే మనసుకు హత్తుకునేలా ఉంది. 
"రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది. ఆవులించి చిరుకెరటం ఒళ్ళు విరుచుకుంటోంది." పాట (పసుపు పారాణి)
చరణాలలోని పదాలు  "జడలోని గులాబీ చలిమంటలు వేస్తోంది  జలతారు జిలుగు పైట చదరంగమాడుతోంది.   జలదరించి పై పెదవి చలివేందర పెడుతోంది."  పాట మొత్తం ఇలాగే విలక్షణంగా మనోహరంగా సాగుతుంది.  
2) జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా (శివరంజని) - రమేశ్ నాయుడు కు మనం జీవితాంతం రుణపడి ఉండే పాట ఇది. ఎంత సందర్భోచితంగా , ఎంత సొగసుగా ఉంది ఈ పాట. 
3) చందమామ వచ్చాడమ్మ  (శివరంజని) -తొంగి తొంగి నిన్ను చూశాడమ్మ - విడిదొసగి విందు చేయి కలువభామ. 

4) గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా   (కల్యాణి)  
5) సువ్వి కస్తూరి రంగా సువ్వి (చిల్లరకొట్టు చిట్టెమ్మ) పాట బాణీ , రచన ఎంత బాగుంది. ఆనంద భైరవి రాగచాయలలో సాగింది.  
6) సుక్కల్లో పెదసుక్క చందమామ -పాట సుశీలగారు పాడిన తీరు, రచన, బాణీ , సంగీతం అన్నీఆకట్టుకుంటాయి. 
దాసం పాటలన్నింటిలో జానపదగీతాల ప్రభావం కనిపిస్తుంది. అతనికి అందంగా  పాట రాసే ఒడుపు తెలుసు. పదుల సంఖ్యలోనే పాటలు వ్రాశాడు. మేఘసందేశం చిత్రపుకాలానికి (1982) ఆటను బ్రతికి ఉంటే తప్పకుండా అందులో పాట వ్రాసిఉండేవాడు. 
కవితాత్మకత అంటే చప్పున గుర్తుకు వచ్చే పాట "నిదురించే తోటలోకి " (ముత్యాలముగ్గు)

శేషేంద్ర ఒక్కపాటే వ్రాసినా ఎన్నటికీ నిలిచి ఉండే పాట వ్రాశాడు. నది దోచుకుపోతున్న నావను ఆపండి.  "ఆకురాలు అడవికి ఒక ఆమని దయచేసింది"- ఈ మాటలు ఒక్క శేషేంద్ర మట్టుకే వ్రాయగలడు. 

రమేశ్ నాయుడు సంగీతం unobtrusive గా హాయిగా సాగుతుంది. పదాలను పల్లకీలో మోస్తుంది.  సాహిత్యాన్ని పెహేలే ఆప్ అంటుంది. ఆరోజులు ఆ పాటలు . ఈ నాడు ఆ హాయిలేదేమి నేస్తం అనిపిస్తోంది.  







5 comments:

  1. నిజమే ఆ హాయీ లేదు,ఆ మానసికోల్లాసమూ లేదు మనసు కుమైమరుపును
    కలిగించే సుతిమెత్తని సంగీతం,ఆ వెంటనే మస్తిష్కపు పొరలలో చక్కిలిగింతలు పెట్టే
    లేవడి పదాలూ ఇప్పుడెక్కడవీ. "లేజారే లేత జవానీ"లాంటి సంకర జాతి పదాలు తప్ప

    ReplyDelete
  2. మంచి పాటలను గుర్తు చేశారు.
    రమేశ్ నాయుడు అంటేనే అచ్చ తెలుగు మధుర సంగీతం! మామూలుగా కనిపించే పదాలు కూడా ఆయన స్వరస్పర్శతో జీవం పోసుకుంటాయి.

    ReplyDelete
  3. thank you వేణు గారు, సాంబ మూర్తి గారు, రఘు గారు

    ReplyDelete