Sunday, April 5, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-4 - దుడుకు గల

సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ:


శ్రీ స్వామివారు ప్రసాదించిన  పంచ రత్నములలో అతి సుందరమైన శైలిలో రచింపబడి   'గౌళ ' రాగం లో స్వరపరచబడిన 'దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా '  కీర్తన శ్రీరామ చంద్రమూర్తికి  స్వామివారు నిర్మింపజేసిన కృతిమణిమంటపము లో  విశిష్ట రత్నఖచిత  స్వర్ణ సింహాసనము వలె విరాజిల్లుతున్నది. 

గౌళ రాగము 15 వ మేళకర్త రాగమైన అతి ప్రసిద్ధమైన , పెద్ద ముత్తైయుదువు రాగాలలో ఒకటైన   'మాయా మాళవ గౌళ'  జన్యము. 

ఆరోహణ లో ఔడవ (ఐదు స్వరాలు) - స రి మ ప ని స

అవరోహణలో షాడవ- వక్ర (వరుస మార్చుకునే  ఆరుస్వరాలు) 

స ని ప మ రి గ మ రి స -  మూర్చన కలిగి ఉన్నది. 

స్వామి వారు - దుడుకు గల , ఎన్నో అవలక్షణాలు, బలహీనతలు  గల,  మనలాంటి మనుష్యుల గురించి శ్రీరామునికి నివేదిస్తున్నారు అని తెలియటం సమంజసంగా ఉంటుంది.  శ్రీ స్వామివారు 'దుడుకు గల' అన్నా అన్నమాచార్యులు  ' పురుషోత్తముడవీవు, పురుషాధముడ నేను' అన్నా అది మనగురించే కాని పరమభక్తులు, దైవంశ సంభూతులైన తమ గురించి కాదు అని భావించవలెనని పండితులు విశద పరిచినారు . 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

పల్లవి - దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో -దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

అనుపల్లవి - కడు దుర్విషయాకృష్టుడై  గడియ గడియకు నిండారు  -దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 1 - శ్రీ వనితా హృత్కుముదాబ్జ! అవాంగ్మానసగోచర!

దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 2 - సకల భూతముల యందు నీవై యుండగ మతి లేక పోయిన - దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 3 - చిరుత ప్రాయముల  నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన 
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 4 - పర ధనముల కొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 5 - తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 6 - తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదేశించి సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 7 - దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవాది దేవ నెరనమ్మితిని గాకను
పదాబ్జ భజనంబు మరచినదుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 8 - చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన

దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 9 - మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక , మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక నరాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

అనుబంధము - సతులకై కొన్నాళ్లాస్తికై  సుతులకై కొన్నాళ్లు 
ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా
----------------------------------
అనుక్షణం దుర్విషయాలకు ఆకర్షితుడవుతూ - 
కుతర్కముతో బాల్య, కౌమార, యౌవన  దశలలో జీవితం వ్యర్థ పరచుకుంటూ  
సుఖ జీవనమొక్కటే పరమావధిగా భావించుచూ-  
లలన (సతులు) అర్భక (సంతతి) సదన (గృహము) సేన (అనుచరులు) అమిత ధనాదులకై పరితపించుచూ - 
బ్రహ్మత్వానికి దూరమై తామసిక జీవనం గడుపుచూ 
శ్రీ రాముని చింతన మరచిపోయిన జనులను  చూసి ఇటువంటి జనులను ఏ దొర కొడుకు బ్రోచునో యని 
స్వామివారు  పొందిన  ఆవేదన ఈ కీర్తనలో కనిపిస్తుంది. 

ఇదే సందర్భంలో రెండు  అన్నమయ్య కృతులు స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. 
-------------------------
పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను
ధరలో నాయందు మంచితన మేది

అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయినదయ అది నీది
నిను నెఱగకుండేటి నీచగుణము నాది
నను నెడయకుండేగుణము నీది

సకలయాచకమే సరుస నాకు బని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను
వెకలివై ననుగాచేవిధము నీది

నేర మింతయును నాది నేరు పింతయును నీది
సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది
-----------------------------------------
ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుజ్ఞనంబును మరచెద తత్త్వ రహస్యము  |
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల |
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||
------------------------------------
మాయకు లోనై దుష్కర్మలను ఆచరించే మనుష్యులనుద్దేశించి భగవద్గీతలో

" మమ మాయా దురత్యయా, 
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే " అని చెప్పారు. 


Malladi Brothers Voice - దుడుకు గల 


రామే చిత్తలయః సదా భవతు మే భో ! రామ ! మాముద్ధర 



1 comment: