Friday, April 17, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-5- కన కన రుచిరా కనకవసన! నిన్ను


సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ:  


శ్రీ స్వామివారు  అనుగ్రహించిన   'కన కన రుచిరా కనకవసన నిను'  కీర్తన తో    పంచ రత్నములపై వ్రాసిన వ్యాస పంచకం పూర్ణమవుతున్నది. 

ఇవి అభిమాన పూర్వకంగా విషయ సేకరణ చేసి వ్రాసిన పరిచయ వ్యాసాలు కానీ లోతైన  విశ్లేషణాత్మక వ్యాసాలు కావు. 

ఈ ఘనరాగ కృతి 39 వ మేళకర్త రాగమైన ఝాలవరాళి జన్యము ' వరాళి.' రాగములో స్వరపరచ  బడినది. 

కనకమయ చేలుడైన  శ్రీరామ చంద్రునిఎంత చూసినా తనివి తీరని రూపము అని స్వామివారు కీర్తించడం ఈ కృతిలో కనబడుతుంది. 

కీ ర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 
-----------------------------------------------------
పల్లవి : కన కన రుచిరా కనక వసన ! నిన్ను

అనుపల్లవి : దిన దినమును మనసున చనువున నిన్ను-
కన కన రుచిర కనక వసన నిన్ను

చ. 1: పాలుగారు మోమున శ్రీయపార మహిమ తనరు నిన్ను-
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 2కళకళమను ముఖకళ గలిగిన సీత
కులుకుచు నోరకన్నులను జూచే నిన్ను-
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 3బాలార్కాభ సుచేల! మణిమయ మాలాలంకృత కంధర !
సరసిజాక్ష ! వరకపోల! సురుచిర కిరీటధర !
సంతతంబు మనసారగ -
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 4: సాపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి 
సుఖియింపగ లేదా యటు -
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 5 : మృగమదలలామ శుభనిటల! వర జటాయు మోక్ష ఫలద! పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప 
సీత తెలిసి వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను -
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 6 : సుఖాస్పద! విముఖాంబుధర పవన !
విదేహ మానస విహారాప్త సురభూజ! మానిత గుణాంక! చిదానంద! ఖగ తురంగ! ధృత రథాఙ్గ!  పరమ దయాకర! కరుణారస వరుణాలయ! భయాపహర! శ్రీ రఘుపతే! -
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 7 : కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొనువాడు సాక్షి; రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి; మరియు నారద పరాశర శుక శౌనక పురందర 
నగజాధరాజ (నగజాధర + అజ)  ముఖ్యులు సాక్షి గాద సుందరేశ ! సుఖ కలశాంబుధి వాసా ! శ్రితులకే - 
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 8: సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత!
ముఖజిత కుముదహిత! వరద! నిన్ను -
కన కన రుచిరా కనక వసన నిన్ను

కన కన రుచిరా
-------------------------------------------------------------------
  • బాలార్కాభ సుచేల - ఉద్యద్భాను వర్ణముతో ప్రకాశిస్తున్న మంచి  వస్త్రములు ధరించిన వాడు. 
  • సాపత్ని మాతయౌ సురుచి..  - సవతి తల్లి పరుషవాక్కులను భరించ లేని ధ్రువుడు 
  • విముఖాంబుధర పవన - శత్రువులు అనే మేఘములను చెదరగొట్టే పవనము వంటి వాడు.  
  • విదేహ మానస విహారాప్త - . విదేహ రాజు జనక మహారాజు మనసున విహరించు వాడు
  • ధృత రథాఙ్గ - రథాఙ్గము అనగా చక్రము ధరించినవాడు.
  • పురందర - నారదుడు.  
  • ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొనువాడు - హనుమంతుడు 
-----------------------------------------------------------

ఈ రాగములో  బాలమురళి గారు పాడిన  భద్రాచల రామదాసు కృతి  అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి '  సుప్రసిద్ధమైనది. 

త్యాగరాజ స్వామి వారి మరొక వరాళి రాగ కృతి 
'యేటి జన్మమిది'  (వోలేటి గారి గాత్రములో)
---------------------------------------------------
ప. ఏటి జన్మమిది హా ఓ రామ

అ. ఏటి జన్మమిది ఎందుకు కలిగెను
ఎంతని సైరింతు హా ఓ రామ (ఏటి)

చ1. సాటి లేని మార కోటి లావణ్యుని
మాటి మాటికి జూచి మాటలాడని తన(కేటి)

చ2. సారెకు ముత్యాల హారయురము పాలు
కారు మోమును కన్నులార జూడని తన(కేటి)

చ3. ఇంగితమెరిగిన సంగీత లోలుని
పొంగుచు తనివార కౌగిలించని తన(కేటి)

చ4. సాగర శయనుని త్యాగరాజ నుతుని
వేగమే జూడక వేగెను హృదయము (ఏటి)
-------------------------------------------------------

మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్దియే,
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.  

శ్రీ  కారుణ్యసముద్రాయ లోకానుగ్రహకారిణే
సాకేతాధిపభక్తాయ త్యాగరాజాయ మంగళం

No comments:

Post a Comment