Saturday, January 15, 2022

ఆధ్యాత్మిక అద్వైత మ్యూజింగ్స్

జలం వినా అలకు విడిగా అస్తిత్వం ఉందా? 

మట్టి లేకుండా కుండ ఉండగలదా?

బంగారం లేని కంటె ఎక్కడ ఉంది ?

ఆత్మ లేని దేహం ఉన్నట్టా లేనట్టా ?

ఆత్మ జ్యోతి వెలుగు లేనప్పుడు అసలు జగం ఉందా? 

పై ఉదాహరణలు కేవలం ప్రతీకాత్మకంగా చెప్పబడుతున్నాయి. అంతేకాని చైతన్య బ్రహ్మము వివరించ బడేది కాదు అని చెప్పారు.

ఏ వెలుగు లేకపోతే  జగం మాయమై పోతుందో,  ఏ ఇతర వస్తువులకు అస్తిత్వం లేకుండా పోతుందో ఆ వెలుగు లేక చైతన్యం మాత్రమే సత్యం అవుతుంది. 

తక్కిన నామ రూపాత్మక జగత్తు నామరూపాలు లేకుండా పోతుంది.  ఆ విధంగా స్వయం ప్రతిపత్తి లేని పాంచ భౌతిక మైన జగత్తు మిథ్య గా చెప్పబడుతున్నది. ఉండీ లేనిదే అవుతున్నది. భౌతికంగా కనిపించదని కాదు. చైతన్య శక్తి లేకుండా జగత్తుకు స్వయంగా ఉనికి లేదు అని అద్వైత ఆచార్యులు చెబుతున్నారు.

-------------------------

Interviewer: “Do you think that consciousness can be explained in terms of matter and its laws?”

Max Planck: “No. I regard consciousness as fundamental. I regard matter as derivative from consciousness. We cannot get behind consciousness."

The Observer, 25 January 1931

--------------------------

భౌతిక శాస్త్రజ్ఞులు పాంచ భౌతిక  పదార్థాల స్వరూపం పైన తీవ్రంగా పరిశోధనలు చేసి పరమాణువు లోపలి రహస్యాలని తెలుసుకుంటున్నారు. 

చరాచర జగత్తు లోని ప్రతి పదార్థం పరమాణు స్థాయి లో చైతన్య శక్తి గా ఉన్నది అని వారి పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

Quantum physics describes the subatomic world as one that cannot be depicted in diagrams -- particles are not dots in space, but are more like "dancing points of energy."

అందువల్ల ప్రతి పదార్థం లోని నిజ స్వరూపం చైతన్య శక్తి మాత్రమే అవుతున్నది. ఆ చైతన్య శక్తి చరాచర జగత్తులో నామ రూపాత్మకం గా భాసిస్తున్నది. ఉన్నది ఒకటే సత్య వస్తువు. అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త బ్రహ్మము లేక చైతన్య శక్తి మాత్రమే అని చెప్పబడుతుంది.

భౌతిక శాస్త్రవేత్తలు బాహ్య జగత్తును శోధించి కనుగొన్న విషయం ఋషులు అంతర్ముఖ పరిశోధన చేసి ఉపనిషత్తుల రూపం లో అందించారు అని గురువులు చెబుతున్నారు.

బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అన్న వాక్యం సామాన్యమైనది కాదు. Advaita is the science behind sciences. 

అద్వైతం జగత్తును నిరాకరించదు. జీవుడు, జగత్తు, దేవుడు, బంధము, మోక్షము ఈ ఐదింటికి సహేతుకమైన, ఆచరణాత్మక మైన సమాధానం చెబుతుంది.🙏