Sunday, May 10, 2026

అది నుంచి అంతం దాకా

ప్రశ్న - సృష్టి క్రమాన్ని నీకు అర్థమైన రీతి లో వివరింపుము. 

సమాధానం --

ప్రతి బుద్ధి జీవికి తన అవగాహన లేదా సామర్థ్యం మేరకు సృష్టి పైన లేదా సృష్టి కర్త పైన ఒక అభిప్రాయం లేదా నమ్మకం ఉంటుంది. అది కాలం గడిచే కొద్దీ జీవిత అనుభవాల వల్ల లేదా ఇతరత్రా సాధనల వల్లనో fine-tune అవుతుంది లేదా మారుతూ ఉంటుంది. మరణించే సమయానికి ఏ మేరకు పరిపక్వత వచ్చిందో అది కొనసాగింపుగా తదుపరి జన్మ వస్తుంది. పై లోకాలకు పురోగమనం లేదా క్రిందిలోకాలకు అది తిరోగమనం కూడా కావచ్చు. సనాతన ధర్మం లో జన్మించిన వారికి సాధారణంగా ఇలాంటి విశ్వాసం ఉంటుంది.

ఇవన్నీ నా స్వంత ప్రతిపాదనలు కావు. నా తెలివికి ఇంతవరకు అర్థమైన విషయాలు అంటే సరిపోతుంది. జీవితం ముగిసే నాటికి ఈ అభిప్రాయాల్లో మార్పులు రావచ్చు. 

---

ఒక వ్యక్తి లేదా సమూహం లేదా దేశం దగ్గర అపారమైన లేక ఎంతో కొంత వనరులు, శక్తి ఉన్నాయి అనుకుంటే అవి ఊరకే ఉండలేవు. తమ తమ శక్త్యనుసారం మంచో చెడో ఏదో ఒక పని చేయడం ప్రారంభిస్తాయి. సహజం గానే ఇతర వ్యక్తి, సమూహం లేదా దేశం పైన ఆ ప్రభావం ఉంటుంది. అయితే వీటి శక్తి ఎంత ఉన్నా చివరికి పరిమితం, స్వార్థ పూరితంగా ఉంటుంది. ప్రపంచంలో ఇది ప్రతి జీవికి అనుభవంలో ఉన్న విషయమే.


భూమిపై ఉన్న అల్ప శక్తులే ఇంత ప్రభావం చూపుతుంటే...

నిజానికి సృష్టికి పూర్వం ఏమి జరిగింది.

అన్నిటి కన్నా పెద్దదైన అపరిమితం అనంతం అయిన బృహత్ శక్తి - అంటే బ్రహ్మ చైతన్యం మరి ఊరకే ఉంటుందా ? 

ఆ చైతన్యం లో ఒక కదలిక వచ్చింది.

చిత్ర విచిత్రాలుగా శాఖోప శాఖలుగా, కోటానుకోట్లుగా అనంత విశ్వాన్ని అందులో పంచభూతాలను ఆదిగా, నక్షత్ర గ్రహ తతులను, ఒకానొక భూమి అనే గ్రహంలో 84 లక్షల రకాల జీవ రాశులను సృష్టి చేసింది. లేదా అద్వైత భాషలో తానే అలా విభిన్న రూపాలలో పరిఛ్చిన్నమై కనిపించింది అని అనుకుందాము. అనంత విశ్వం లో జీవరాసులు ఉన్న ఇలాంటి గ్రహాలు ఎన్ని సృష్టి జరిగాయో అందులో జీవులు ఎలా ప్రవర్తిస్తున్నారు మనకు తెలియదు.


సృష్టికర్త చేసిన అలాంటి ఒకానొక విశ్వం లో ఇసుక రేణువు వంటి భూమిపైన జన్మించిన మానవుడికి విశ్వ చైతన్య శక్తి అతి సూక్ష్మ స్థాయి లో కట్ట బెట్టింది. 


అక్కడ మొదలు అయింది. ఇక చైతన్య శక్తి ఎంతో కొంత స్థాయిలో ఉన్న జీవరాసులు ఇక బిజీ గా మారిపోయాయి. వాటిలో బుద్ధి అనే faculty అదనంగా ఇవ్వడంతో ఇక మానవుడు విశేషంగా పనులు మొదలు పెట్టాడు. 


మానవుడు అనాదికాలం నుంచి ఇప్పటిదాకా నిర్విరామంగా ఏవో పనులు చేస్తూనే ఉన్నాడు. భూమి మీద లేదా అందిన మేరకు విశ్వంలో ఉన్న వనరులు ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవాలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఎంతైనా ఆ తానులో ముక్కే కనుక చాలా విషయాలలో ఎంతో కొంత విజయం సాధించాడు. తోటి జీవ రాశులను ఉపయోగించు కున్నాడు, హింస పెట్టాడు, ప్రేమగా చూసుకున్నాడు, ఉదాసీనంగా ఉన్నాడు. కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. 


భౌతిక ప్రపంచంలో జీవ యాత్ర సాగిస్తూనే మనోమయ ప్రపంచం కూడా సృష్టి చేసుకున్నాడు. 


ఎంత చేస్తున్నా ఏదో అసంతృప్తి. ఇంకా ఏదో చెయ్యాలి అనే తపన. 


ఉదర పోషణార్థం ఉద్యోగంతో పాటు

కళలు, క్రీడలు, దేవుడు (ళ్ళు), ఆరాధనా పద్ధతులు, సాహిత్యం, సంగీతం, సమాజ సేవ...ఇలా అసంఖ్యాకమైన కార్య కలాపాలలో నిమగ్నమై ఉంటాడు. తన వారు అనుకుంటే ఎంతో కొంత మంచి చేస్తాడు. పరాయి వాడు అంటే బాధించేందుకు వెనుకాడడు.


విశ్వ చైతన్య శక్తి దృష్టిలో మానవుడి వంటి సూక్ష్మ జీవులు అజ్ఞానంతో చేసే పనులు చూసి ' ఇచ్చిన అమూల్యమైన శక్తి ని సద్వినియోగం చేసుకోండిరా ' అని అంతర్వాణి రూపం లో సృష్టి కర్త చెబుతుంటాడు. వినీ విన్నట్టుగా మనిషి తన పని తాను చేస్తుంటాడు. పరిస్థితి చేయి జారినప్పుడు, దుష్ట స్వభావులు పెరిగినప్పుడు - సృష్టి కర్త తానే స్వయం గా అవతరించి వస్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు.  కొన్ని సందర్భాలలో సద్గురువులను పంపిస్తాడు. అప్పుడు జనం కొంత కాలం బాగుంటారు. తరువాత మళ్ళీ అదే అజ్ఞానం లో మునిగి తేలుతుంటారు.


కర్మలను అనుసరించి మానవుడు క్రింది లేదా పై లోకాలకు ప్రయాణం చేస్తుంటాడు. క్షీణే పుణ్యే మళ్ళీ భూమి మీదకు వచ్చి పడతాడు. 


యుగాలు గడిచిపోయాయి. మనిషి ఆలోచనలలో ప్రవర్తనలో పెద్దగా మార్పు రావడం లేదు. ఎవరో కొంతమంది బహూనామ్ జన్మనామ్ అంతే - తమ సాధనల ఫలితంగా ఈ సృష్టిచక్రం వ్యవహారం అర్థం చేసికొని మోక్షం పొందుతారు. తక్కిన వారు అవిద్యాసుఖాన్ని అజ్ఞానమే ఆనందంగా అనుభవిస్తుంటారు. 

చూసి చూసి సృష్టి కర్తకు చివరకు విసుగు వస్తుంది. 

ఇంక చాలు అనిపిస్తుంది. ' మీరు మారర్రా ' అని సృష్టి మొత్తాన్ని తనలో లయం చేసుకుంటాడు. 

ఒక్కసారి ఆయన తన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం లోకి వెళ్ళిపోతాడు.

కొయ్య బొమ్మలు మాయమై పోయి కొయ్య మిగిలిపోతుంది.

మరలా ఆయనకు లేదా ఆ అఖండ చైతన్య శక్తికి సంకల్పం కలిగి దలిక వచ్చే వరకు తురీయ స్థితి లో ఉంటాడు.(ఉంటుంది)








Saturday, March 21, 2026

చారుకేశి రాగం లో రెండు మధుర గీతాలు

 రెండు మంచి పాటలు విందాము.

1) సెందూర పాండిక్కొరు - (సెందూర పాండి చిత్రం 1993 - సంగీతం దేవా - SPB చిత్ర.)

పాట సూపర్ గా ఉంది. శాస్త్రీయ రాగం ఆధారంగా మంచి melody + rhythm ఉంది. దేవా సంగీతం + SPB చిత్ర గానం + విజయకాంత్ గౌతమి నృత్యాలు + చిత్రీకరణ అన్నీ చక్కగా కుదిరాయి. Violins and Flute bits are very impressive.


2) మయంగినేన్ సొల్ల తయంగినేన్ -( నానే రాజా నానే మంతిరి 1985 - ఇళయరాజా - p సుశీల జయచంద్రన్ )

కెప్టెన్ విజయకాంత్ రాధిక జీవిత ఈ పాటలో నటించారు.

మంచి పాట. సుశీల జయచంద్రన్ గారు కలిసి పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్లు . 

ఇదే పాట బాణీ అనేక సంవత్సరాల తరువాత తెలుగులో ప్రతిదినం నీ దర్శనం అన్న పాటలో వినిపించింది.

అప్పుడప్పుడు ఇలాంటి మంచి పాటలు వినడం బాగుంటుంది కదా. 




Saturday, February 14, 2026

గౌరి మనోహరి రాగం ఆధారంగా ఒక మధుర గీతం


ఒక్కసారి పాత ఫోటో ఆల్బమ్ బయటికి తీసి తుడిచి అందులోని ఫోటోలు చూస్తే కలిగే అనుభూతి బాగుంటుంది.

అలాగే కొన్ని classic పాటలు గుర్తు చేసుకుని చాలా రోజుల తరువాత వింటే కలిగే ఆనందం కూడా బాగుంటుంది.

నేను బాగా అభిమానించే రాగం గౌరిమనోహరి. ఈ రాగం లో కొన్ని మంచి సినీ గీతాలు ఉన్నాయి. 

ఈ అంశం పైన నేను గతంలో (2010)  వ్రాసిన బ్లాగ్ పోస్టు ఇది.

ఈ రాగం ఆధారంగా ఉన్న కొన్ని తెలుగు పాటలు.

--------

కన్నుల దాగిన అనురాగం - రంగుల రాట్నం

వెన్నెల్లో గోదారి అందం - సితార

ఒక వైపు ఉర్రూతలూపు కవనాలు  చరణం - శిలలపై శిల్పాలు చెక్కినారు పాటలో - మంచి మనసులు

నీ జిలుగు పైట నీడ లోన - పూల రంగడు

పరువపు వలపుల సంగీతం, ఎవరో రావాలి పాటలు కూడా చాలా బాగుంటాయి.

--------

గౌరి  మనోహరి రాగం లో మరొక మధురగీతం (తమిళం) ఉంది.

కణ్ణా వరువాయా మీరా కేట్కిరాళ్ - మనదిల్ ఉరుది వేండుమ్ -  1987 ఇళయరాజా, జేసుదాసు, చిత్ర. - కె బాలచందర్.

Beautiful song. సంగీతం, గాయకులు, పాట చిత్రీకరణ, నటులు, సాహిత్యం,దర్శకత్వం, ఛాయాగ్రహణం,  అన్నీ చక్కగా కుదిరాయి.  జేసుదాస్, చిత్ర గారు అద్భుతంగా పాడారు. సుహాసిని, శ్రీధర్ అభినయం నాట్యం, చిత్రీకరించిన ప్రదేశం ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి. శ్రీధర్ గారు శాస్త్రీయ నృత్య కళాకారుడు కావడం వల్ల ఈ పాటకు మరింత అందం చేకూరింది. విశ్వనాథ్ గారి శైలిలో ఉన్న చిత్రీకరణ చాలా బాగుంది.

స్వర్ణకారుడు బంగారం ఉపయోగించి అందమైన ఆభరణం చేసినట్టు గౌరిమనోహరి రాగం ఆధారంగా ఇళయరాజా ఒక అద్భుతమైన గీతం అందించాడు. ఆయన సంగీతం ఇచ్చిన అత్యుత్తమ గీతాలలో ఈ పాట నిలిచి ఉంటుంది. (Picture courtesy to the respective owners)


Tuesday, January 13, 2026

కీరవాణి lyrics + ఇళయరాజా సంగీతం - ఒక మధుర గీతం

గత ఏడాది షష్టి పూర్తి అనే సినిమాకు ఇళయరాజా సంగీతం అందించాడు. అందులో ,ఏదో ఏ జన్మ లోదో ఈ పరిచయం ' అనే పాట బాగుంది. We could see glimpses of vintage Ilayaraja in this song. 

సంగీత దర్శకుడు కీరవాణి ఈ పాటకు సాహిత్యం అందించాడు. ఈ పాటలో కొన్ని పదాలు మంచి భావుకత కలిగి ఉన్నాయి.

-----

తెరలు తెరలుగా తెరుచుకున్న తూరుపు ద్వారం

పొరలు పొరలుగా కరుగుతున్న నిశి భారం

------

అనన్య భట్ అనే గాయని ఈ పాట బాగా పాడింది.

కళ్యాణ వసంతం రాగం ఛాయలో ఈ గీతం ఉన్నట్టు అనిపిస్తుంది.