Saturday, September 17, 2022

పూర్వి కల్యాణి - ముత్తుస్వామి దీక్షితుల కృతి-మీనాక్షి మే ముదం దేహి



ముత్తుస్వామి దీక్షితులు మధుర మీనాక్షి అమ్మవారిని ఉద్దేశ్యించి కూర్చిన కృతులలో పూర్వి కల్యాణి రాగం లోని

' మీనాక్షి మే ముదం దేహి ' కృతి ప్రముఖమైనది. దీక్షితుల వారు గొప్ప కృతి కర్త, సంస్కృత పండితులు, దేవీ ఉపాసకులు, బహు భాషావేత్త మరియు గొప్ప వైణికులు. వారి కృతులు అధిక భాగం గమక ప్రధానంగా వీణా వాదన కు అనుకూలంగా ఉంటాయి. 

వారు రచించిన ప్రతి కృతిలో ఉపాసనా బలం, అక్షర రమ్యత, శబ్ద సౌందర్యం, భావ సాంద్రత, సంస్కృత  భాషా ప్రావీణ్యం ద్యోతకమవుతుంటాయి. గొప్ప గాయకుల గాత్రంలో ఆ కృతులను విన్నప్పుడు  భక్తి భావన అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతి ముప్పిరిగొని రసికుల హృదయాలను పరవశింప జేస్తాయి. అప్రయత్నంగా ధ్యాన స్థితిని కలుగజేస్తాయి.

పూర్వి కల్యాణి రాగం ప్రాచీన మైన గంభీరమైన రాగం. ఆధ్యాత్మిక, భక్తి, ధ్యాన ఉపాసన భావనలు కలుగజేస్తుంది. 

గమనాశ్రమ అన్న ప్రతిమధ్యమ మేళకర్త రాగ జన్యము.

దీక్షితుల వారి మేళకర్త పద్ధతిలో ఈ రాగం ' గమక క్రియ '  అని పిలువబడుతున్నది. 

మీనాక్షి మే ముదం - (శ్రీమతి ఎం. ఎస్. సుబ్బలక్ష్మి గారి గాత్రం) రాగం  పూర్వి కల్యాణి /గమక క్రియ - తాళం ఆది
------------------------
పల్లవి


మీనాక్షి మే ముదం దేహి
మేచకాంగి రాజ మాతంగి

అనుపల్లవి


మాన మాతృ మేయే మాయే

మరకత ఛాయే శివ జాయే


మీనలోచని పాశమోచని
మానిని కదంబ వనవాసిని

చరణం


మధురా పురి నిలయే మణి వలయే
మలయ ధ్వజ పాండ్య రాజ తనయే
విధు విడంబన వదనే విజయే
వీణాగాన దశ గమకక్రియే

మధు మద మోదిత హృదయే, సదయే
మహా దేవ సుందరేశ ప్రియే
మధు ముర రిపు సోదరి శాతోదరి
విధి గురు గుహ వశంకరి శంకరి

-----------------------

కీర్తన లోని పదాల నడక  హాయిగా కర్ణ పేయంగా సాగుతుంది. చదివినా విన్నా ఒక అనిర్వచనీయ మైన అనుభూతి కలుగుతుంది.

మీనలోచని పాశ మోచని - ఈదృశమైన పదాలు ఆ అమ్మవారే దీక్షితుల వారి నోట పలికించి ఉంటుంది అనిపిస్తుంది.

శ్రీ లలితా సహస్ర నామావళి లోని మాయా, పాశమోచని, కదంబవన వాసిని, విజయ, శాతోదరి నామాలు ఈ కృతిలో ఉన్నాయి. అలాగే ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూపా అన్న నామానికి అనురూపంగా మాన మాతృ మేయా అన్న నామం వ్రాసినట్లు తోస్తుంది.

వీణా వాదన లో ప్రముఖంగా వినిపించే కంపిత, ఆందోళిత, స్ఫురిత ఇత్యాది దశ గమకాలు మరియు గమకక్రియ రాగం స్ఫురించేలా ఈ కృతిలో ' దశ గమక క్రియే ' అన్న నామం కనిపిస్తుంది.

దీక్షితుల వారు ఎనిమిది విభక్తులలో కూడా కీర్తనలు రచించారు. ఈ కృతి సంబోధనా ప్రథమా విభక్తి లో కూర్చబడినది. 

దీక్షితుల వారు అనేక ఆలయాలు సందర్శించి ఆయా ఆలయాలలో వెలసిన అధిష్టాన దేవతా మూర్తుల పై కీర్తనలు రచించి గానం చేశారు.

ఈ కృతి గురించి దీక్షితుల వారి జీవితంలో  ఒక ఘటన చెప్పబడినది. 1835 సంవత్సరం అక్టోబర్ 21 దీపావళి నాడు వారి శిష్యులు ' మీనాక్షి మే ముదం దేహి ' కృతిలో అనుపల్లవి ' మీనలోచని  పాశ మోచని ' అని గానం చేస్తుండగా దీక్షితుల వారు తనువు చాలించినట్లుగా చెప్పడం జరిగింది.🙏





No comments:

Post a Comment