Friday, November 17, 2023

బహుదారి రాగం కృతులు - కొన్ని సంగీత విశేషాలు.

కొన్ని రాగాలకు ఒక్క కృతి ద్వారా ప్రాచుర్యం వస్తుంది. ఆయా రాగాల ప్రస్తావన వచ్చినప్పుడు ప్రసిద్ధమైన కీర్తనలు ప్రథమంగా తలపుకు వస్తాయి.

Eg. బ్రోవ భారమా - బహుదారి రాగం.

రఘువంశ సుధాంబుధి - కదన కుతూహల రాగం

వందనము రఘు నందన - శహన రాగం

బంటు రీతి కొలువు - హంస నాద రాగం

బహుదారి రాగంలో బ్రోవ భారమా అన్న త్యాగరాజ స్వామి కృతి బహుళ ప్రాచుర్యం పొందినది.

బహుదారి రాగం హరికాంభోజి రాగ జన్యము. షాడవ- ఔడవ రాగము. అనగా ఆరోహణలో ఆరు స్వరములు, అవరోహణలో ఐదు స్వరములు కలిగి ఉండును. రిషభము ఉండదు. 


పోలికలు ఉంటూనే విలక్షణమైన రూపం, స్వభావం కలిగి ఉండే ఏకోదరుల లాగా బహుదారి, నాగస్వరాళి, గంభీర నాట, తిలాంగ్ రాగాలకు కొంత సామ్యం ఉంటుంది. అయితే దేనికదే తమదైన ముద్ర, నడక, సొగసు కలిగి ఉంటాయి.


ఎన్. రమణి గారి వేణుగానం లో బ్రోవ భారమా కృతి. మధురంగా, రాగం ఆస్వాదించే విధంగా ఉంది.

----------

బ్రోవ భారమా రఘురామ !


భువనమెల్ల నీవై యుండ నన్నొకని 

బ్రోవ భారమా


శ్రీవాసుదేవ! అండకోట్లు 

కుక్షిని యుంచుకొనలేదా 


కలశాంబుధిలో దయతో నమరులకు 

గోపికలకై కొండలెత్తలేదా కరుణాసాగర 


త్యాగరాజుని బ్రోవ భారమా రఘురామ

-----------

భువనమెల్ల తానై యుండి,

చతుర్దశ భువనాలను కుక్షిలో నిలుపుకున్న, క్షీర సాగర మథనంలో దేవతల కోసం కూర్మ రూపం దాల్చి మందర పర్వతాన్ని మోసిన, గోపికలను, గోపకులాన్ని, గోవులను కుంభ వృష్టి నుంచి రక్షించుటకై గోవర్ధన గిరిని అలవోకగా చిటికెన వ్రేలుపై నిలిపిన స్వామికి నన్నొకని బ్రోవ భారమా అని ఈ కృతిలో త్యాగరాజ స్వామి భావన కనిపిస్తుంది.

----------

బహుదారి రాగం లో ఉన్న ఒక మంచి గీతం తారస పడినది.


శ్రీ యనమండ్ర శ్రీనివాస శర్మ గారు శ్రీ ఆది శంకరాచార్యుల వారిపై రచించి, స్వరపరచి గానం చేసిన సంస్కృత గీతం. 


జయ జయ శంకర హర భయమీశ్వర అన్న ఈ కృతి చాలా బాగా వచ్చింది. పాట సాహిత్యం అద్భుతం. 


న కర్మణా న ప్రజయా ధనేన

త్యాగేనైకే అమృతత్వమానశు:


అన్న కైవల్యోపనిషత్తు లోని సన్యాస సూక్తం లోని భావాన్ని ఈ కృతిలో అందంగా పొందుపరచారు.


శ్రీనివాస శర్మ గారు కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు,వేద పండితులు ,సంస్కృత సాహితీ వేత్త , వాగ్గేయకారులు, సనాతన ధర్మ ప్రవచన కర్త,  బహుముఖ ప్రజ్ఞాశాలి అని వారి యూట్యూబ్ చానెల్ లో ఉన్న అనేక వీడియోల ద్వారా అవగతం అవుతుంది. 

--------

ఇరబేకు హరిదాసర సంగ - పురందర దాసు కీర్తన - బహుదారి రాగం - గానం రంజని గాయత్రి sisters . Pleasant rendition.

-----------

పక్క వాయిద్యాలు తగినంత మేరకు వినిపించినప్పుడు శ్రోతలకు మరింత ఆనందం కలుగుతుంది. ప్రధాన సంగీత కారుని పక్కవాయిద్యం అనుగమించాలి కానీ అధిగమించ కూడదు. ఇది ప్రధాన మైన అంశం.


Setting the audio volume for the main artist and supporting instrumentalists plays a very important role in the concert. Sometimes we see the main artist voice getting drowned in the din of the accompanying instruments. This mars the experience of listeners. Auditorium with good acoustic quality, sound system, and experienced artistes with perfect understanding will enhance the experience of listeners.







 


 





Sunday, November 5, 2023

మహావాక్య విచారణ - శ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి ప్రవచనం. - కొన్ని ఆలోచనలు

అద్వైతం అంటే super science. అది science లకే science అని శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు తరచుగా చెబుతారు. 

అద్వైత తత్వ సిద్ధాంతంలో నాలుగు  మహావాక్యాలు ఆ వాక్యాలపై విచారణ ప్రధానమైన అంశంగా చెప్పారు.


నాలుగు వేదాల అంతర్గతం గా ఉన్న ఉపనిషత్తుల నుండి ఒక్కొక్క గొప్ప వాక్యం స్వీకరించి మహావాక్యాలుగా అద్వైత ఆచార్యులు నిర్ణయించారు. అవి


1) ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయ ఉపనిషత్తు - ఋగ్వేదం


2) అయం ఆత్మా బ్రహ్మ - మాండూక్యోపనిషత్తు - అధర్వణ వేదం.


3) తత్ త్వం అసి - ఛాందోగ్య ఉపనిషత్ - సామవేదం


4) అహం బ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు - యజుర్వేదం  


మహావాక్య విచారణ అనే అంశం పై శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి ప్రవచనాలు అందుబాటు లో ఉన్నాయి. ఈ ప్రవచనం శ్రవణం చేస్తే ఆది శంకరాచార్యులు  శ్రీ యల్లంరాజు గారి ద్వారా స్వయంగా బోధ చేస్తున్నారు అన్న అనుభూతి కలుగుతుంది.


పై నాలుగు వాక్యాలను మహావాక్యాలు అని ఎందుకు అంటారు అన్న విషయం వివరణ మొదలుకొని మహావాక్య విచారణ ఎందుకు చేయాలి, విచారణ విధానం, మహావాక్యాలు జీవుడికి ఉన్న సమస్యను ఎలా పరిష్కరిస్తాయి అనే విషయాలను ఆమూలాగ్రం విశదీకరించి వివరించే విలువైన ప్రవచనాలు. 


ఈ ప్రవచనాలు వినగలగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.


ముఖ్యంగా ' తత్ త్వం అసి ' కంటే  ఛాందోగ్య ఉపనిషత్ లోని 'సర్వం ఖలు ఇదం బ్రహ్మ ' అన్న వాక్యాన్ని మహావాక్యం గా పరిగణించడం మరింత సముచితంగా ఉంటుంది అని ఆయన వివరించిన తీరు ఆయన లోతైన పరిశీలన, మూల పరిశోధన కు ప్రబల నిదర్శనంగా నిలుస్తుంది.


ఇందులో మొదటి వాక్యం బ్రహ్మ స్వరూపమునకు, చివరి వాక్యం ఆత్మ స్వరూప సిద్ధికి  మధ్యలో ఉన్న రెండు వాక్యాలు సాధన పరంగా చెప్పబడ్డాయి.


ప్రజ్ఞానం బ్రహ్మ అన్న వాక్యం బ్రహ్మ స్వరూపాన్ని నిర్వచిస్తే, అహం బ్రహ్మాస్మి అన్న వాక్యం సిద్ధిని సూచిస్తుంది. 


అయం ఆత్మా బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ అన్న వాక్యాలు వరుసగా జీవ జగత్తులను పరిష్కరించే సాధనను చూపుతున్నాయి.


స్వరూపం - సాధన - సిద్ధి 


ఈ విధంగా నాలుగు మహావాక్యాలు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం, ఆ స్వరూపాన్ని అందుకోవడానికి చేయవలసిన సాధన, సాధన ద్వారా అంతిమంగా పొందవలసిన సిద్ధిని సమగ్రంగా ఆవిష్కరిస్తున్నాయి.


యల్లంరాజు గారు క్లిష్టమైన విషయాలను వివరించడానికి స్వీకరించే ఉదాహరణలు, ప్రతీకలు దైనందిన జీవితం లో అందరికి అనుభవం లో ఉండే అతి సాధారణ విషయాలే. ఆయన ప్రసంగం తో పాటు ప్రయాణించ గలిగితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఒక థ్రిల్ వంటి అనుభూతి కలుగుతుంది. బోధించే విషయం పైన సమగ్రమైన, లోతైన అవగాహన, పరిజ్ఞానం ఉండటం ఒకటయితే, ఆ విషయాన్ని సుబోధకంగా, మనోరంజకంగా, హృదయంలో  నాటుకునేటట్టు వివరించడం మరొక ప్రజ్ఞ. ప్రవచనంలో ఉద్దేశ్యించిన అంశం యొక్క ప్రాధాన్యం ఎక్కడా సడలకుండా, ఉపాఖ్యానాలు అవసరమైనంత మేరకే చెబుతూ సాగే యల్లంరాజు గారి ప్రవచన శైలి అనితరసాధ్యం. ఆయన ఒక ప్రణాళిక తో ప్రవచనం నిర్మించే తీరు అద్వితీయం. అద్వైత సిద్ధాంతం బోధనతో ఆగిపోక సాధన యొక్క ప్రాముఖ్యం వివరిస్తూ సాగుతుంది. ఆయన వాక్కులో ఉండే ధాటి, శక్తి చూస్తే అమ్మవారు స్వయంగా ఆయన నోటి ద్వారా పలికించారు అనిపిస్తుంది.


ఆయన  దృష్టి ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అనేక శాస్త్ర గ్రంథాల వాచ్యార్థం కన్న లక్ష్యార్థం పైన. భాగవతం, రామాయణం, భారతం, ఉపనిషత్తులు .. ఇలా ఏ గ్రంథమైనా ఆ ఋషులకు, మహా కవులకు ఉన్న అద్వైత దృష్టి, వారు ఏ  లక్ష్యంతో ఆయా గ్రంథాలను నిర్మించారో అన్న విషయం యల్లంరాజు గారి వివరణలో మనకు తేటతెల్లం అవుతుంది.


ఈ ప్రవచనాలను రికార్డు చేసి అందరికి అందుబాటులో ఉంచిన శ్రీ యల్లం రాజు గారి  ప్రత్యక్ష శిష్యులకు కృతజ్ఞతలు.


అనేక జన్మల పరంపర లో పోగుపడిన వాసనలను, కరడు కట్టిన సంస్కారాలను వదిలించుకోవడానికి సామాన్యులకు కర్మ, జ్ఞానం అనే రెండు సాధనాల అవసరం ఉంటుంది అని చెబుతారు. మానవుని లక్ష్యమైన మోక్ష సాధన కోసం జీవితాంతం నిత్య, నైమిత్తిక కర్మలు ఆచరించడం, జప తప, స్వాధ్యాయ ధ్యానాదులచే చిత్త శుద్ధి సాధించడం, శ్రవణ మనన నిదిధ్యాసనల ద్వారా సత్ స్వరూప జ్ఞానం పొందటం కోసం ఆజన్మాంతం ప్రయత్నం  కొనసాగవలసి ఉంటుంది అని చెప్పారు.🙏