అద్వైతం అంటే super science. అది science లకే science అని శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు తరచుగా చెబుతారు.
అద్వైత తత్వ సిద్ధాంతంలో నాలుగు మహావాక్యాలు ఆ వాక్యాలపై విచారణ ప్రధానమైన అంశంగా చెప్పారు.
నాలుగు వేదాల అంతర్గతం గా ఉన్న ఉపనిషత్తుల నుండి ఒక్కొక్క గొప్ప వాక్యం స్వీకరించి మహావాక్యాలుగా అద్వైత ఆచార్యులు నిర్ణయించారు. అవి
1) ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయ ఉపనిషత్తు - ఋగ్వేదం
2) అయం ఆత్మా బ్రహ్మ - మాండూక్యోపనిషత్తు - అధర్వణ వేదం.
3) తత్ త్వం అసి - ఛాందోగ్య ఉపనిషత్ - సామవేదం
4) అహం బ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు - యజుర్వేదం
మహావాక్య విచారణ అనే అంశం పై శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి ప్రవచనాలు అందుబాటు లో ఉన్నాయి. ఈ ప్రవచనం శ్రవణం చేస్తే ఆది శంకరాచార్యులు శ్రీ యల్లంరాజు గారి ద్వారా స్వయంగా బోధ చేస్తున్నారు అన్న అనుభూతి కలుగుతుంది.
పై నాలుగు వాక్యాలను మహావాక్యాలు అని ఎందుకు అంటారు అన్న విషయం వివరణ మొదలుకొని మహావాక్య విచారణ ఎందుకు చేయాలి, విచారణ విధానం, మహావాక్యాలు జీవుడికి ఉన్న సమస్యను ఎలా పరిష్కరిస్తాయి అనే విషయాలను ఆమూలాగ్రం విశదీకరించి వివరించే విలువైన ప్రవచనాలు.
ఈ ప్రవచనాలు వినగలగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
ముఖ్యంగా ' తత్ త్వం అసి ' కంటే ఛాందోగ్య ఉపనిషత్ లోని 'సర్వం ఖలు ఇదం బ్రహ్మ ' అన్న వాక్యాన్ని మహావాక్యం గా పరిగణించడం మరింత సముచితంగా ఉంటుంది అని ఆయన వివరించిన తీరు ఆయన లోతైన పరిశీలన, మూల పరిశోధన కు ప్రబల నిదర్శనంగా నిలుస్తుంది.
ఇందులో మొదటి వాక్యం బ్రహ్మ స్వరూపమునకు, చివరి వాక్యం ఆత్మ స్వరూప సిద్ధికి మధ్యలో ఉన్న రెండు వాక్యాలు సాధన పరంగా చెప్పబడ్డాయి.
ప్రజ్ఞానం బ్రహ్మ అన్న వాక్యం బ్రహ్మ స్వరూపాన్ని నిర్వచిస్తే, అహం బ్రహ్మాస్మి అన్న వాక్యం సిద్ధిని సూచిస్తుంది.
అయం ఆత్మా బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ అన్న వాక్యాలు వరుసగా జీవ జగత్తులను పరిష్కరించే సాధనను చూపుతున్నాయి.
స్వరూపం - సాధన - సిద్ధి
ఈ విధంగా నాలుగు మహావాక్యాలు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం, ఆ స్వరూపాన్ని అందుకోవడానికి చేయవలసిన సాధన, సాధన ద్వారా అంతిమంగా పొందవలసిన సిద్ధిని సమగ్రంగా ఆవిష్కరిస్తున్నాయి.
యల్లంరాజు గారు క్లిష్టమైన విషయాలను వివరించడానికి స్వీకరించే ఉదాహరణలు, ప్రతీకలు దైనందిన జీవితం లో అందరికి అనుభవం లో ఉండే అతి సాధారణ విషయాలే. ఆయన ప్రసంగం తో పాటు ప్రయాణించ గలిగితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఒక థ్రిల్ వంటి అనుభూతి కలుగుతుంది. బోధించే విషయం పైన సమగ్రమైన, లోతైన అవగాహన, పరిజ్ఞానం ఉండటం ఒకటయితే, ఆ విషయాన్ని సుబోధకంగా, మనోరంజకంగా, హృదయంలో నాటుకునేటట్టు వివరించడం మరొక ప్రజ్ఞ. ప్రవచనంలో ఉద్దేశ్యించిన అంశం యొక్క ప్రాధాన్యం ఎక్కడా సడలకుండా, ఉపాఖ్యానాలు అవసరమైనంత మేరకే చెబుతూ సాగే యల్లంరాజు గారి ప్రవచన శైలి అనితరసాధ్యం. ఆయన ఒక ప్రణాళిక తో ప్రవచనం నిర్మించే తీరు అద్వితీయం. అద్వైత సిద్ధాంతం బోధనతో ఆగిపోక సాధన యొక్క ప్రాముఖ్యం వివరిస్తూ సాగుతుంది. ఆయన వాక్కులో ఉండే ధాటి, శక్తి చూస్తే అమ్మవారు స్వయంగా ఆయన నోటి ద్వారా పలికించారు అనిపిస్తుంది.
ఆయన దృష్టి ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అనేక శాస్త్ర గ్రంథాల వాచ్యార్థం కన్న లక్ష్యార్థం పైన. భాగవతం, రామాయణం, భారతం, ఉపనిషత్తులు .. ఇలా ఏ గ్రంథమైనా ఆ ఋషులకు, మహా కవులకు ఉన్న అద్వైత దృష్టి, వారు ఏ లక్ష్యంతో ఆయా గ్రంథాలను నిర్మించారో అన్న విషయం యల్లంరాజు గారి వివరణలో మనకు తేటతెల్లం అవుతుంది.
ఈ ప్రవచనాలను రికార్డు చేసి అందరికి అందుబాటులో ఉంచిన శ్రీ యల్లం రాజు గారి ప్రత్యక్ష శిష్యులకు కృతజ్ఞతలు.
అనేక జన్మల పరంపర లో పోగుపడిన వాసనలను, కరడు కట్టిన సంస్కారాలను వదిలించుకోవడానికి సామాన్యులకు కర్మ, జ్ఞానం అనే రెండు సాధనాల అవసరం ఉంటుంది అని చెబుతారు. మానవుని లక్ష్యమైన మోక్ష సాధన కోసం జీవితాంతం నిత్య, నైమిత్తిక కర్మలు ఆచరించడం, జప తప, స్వాధ్యాయ ధ్యానాదులచే చిత్త శుద్ధి సాధించడం, శ్రవణ మనన నిదిధ్యాసనల ద్వారా సత్ స్వరూప జ్ఞానం పొందటం కోసం ఆజన్మాంతం ప్రయత్నం కొనసాగవలసి ఉంటుంది అని చెప్పారు.🙏
బావుంది
ReplyDeleteవిలువైన సమాచారం
ధన్యోస్మి