శ్రీ యల్లం రాజు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదనలు , ఆదిశంకరుల వారి భాష్యం ఆకళింపు చేసుకుంటే ' శాస్త్రజ్ఞులు నిశ్చేష్టులవుతారు, scientists will be baffled' అని.
దక్షిణా మూర్తి స్తోత్రం యొక్క అంతరార్థం గురువు గారు విడమరచి చెబుతుంటే ఆ మాట అక్షరాలా నిజం అనిపిస్తుంది.
మొదటి రెండు శ్లోకాలు సంపూర్ణంగా అవగతం చేసుకుంటే జీవ, జగత్, ఈశ్వరుల విషయం లో కలిగే అనేక సందేహాలకు సమాధానం దొరుకుతుంది.
సృష్టి రహస్యాన్ని రెండు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన జగద్గురువు శ్రీ శంకరాచార్య భగవత్పాదులయితే, ఆ శ్లోకాల అంతర్భావాన్ని అతి స్పష్టంగా వివరించి చెప్పిన సద్గురువు శ్రీ యల్లం రాజు శ్రీనివాసరావు గారు.
-----------
విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని
మాయయా బహిరివోద్భూతం
యథా నిద్రయా ।
యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।।
బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం ।
మాయావీవ విజృంభయత్యపి మాయాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।।
It is bewildering to learn about the fundamental concepts of Space, Time and Matter in the shloka.
దేశం - Space - సత్త్వ గుణాన్ని
కాలం - Time - రజో గుణాన్ని
కలన - Matter - తమో గుణాన్ని
సూచిస్తున్నాయి.
మాయాకల్పిత వైచిత్ర్యచిత్రీకృతం -
అమ్మవారు మాయచే వివిధ ఆకృతులలో, రీతులలో రచించిన త్రిగుణాత్మకమైన జగత్తు. శక్తి తత్త్వం.
అయితే ఈ సృష్టికి మూలం, ఆధారభూతం - అలాగే లయం చేసుకునేది త్రిగుణాతీతం అయిన నిర్వికల్ప స్థితి లోని అయ్యవారు. శివతత్త్వం.
బీజంలో అంకురం అంతర్గతంగా దాగి ఉన్నట్లు జగత్తు ఆత్మ చైతన్యం లో దాగి ఉండి బహిర్గతం అయినట్లు అనిపించి తిరిగి లీనమైపోతుంది.
అద్భుతం . ఒక్క శ్లోకం లో సృష్టి, స్థితి, లయ క్రమాన్ని అద్భుతంగా పొందుపరచడం జరిగింది .
మొదటి శ్లోకం లో దర్పణం, స్వప్నం అనే రెండు దృష్టాంతాల తో జగత్తు స్వరూపాన్ని వివరించడం జరిగింది.
దర్పణం , దృశ్యం, ద్రష్ట, దృష్టి నాలుగు ఒకటే - అవి ఆత్మ స్వరూపం కంటే భిన్నంగా లేవు అని గురువు గారు వివరించిన తీరు అద్భుతం.
స్వప్నం దర్శిస్తున్న సమయం లో అది కేవలం స్వప్నం మాత్రమే అన్న విషయం ఎరుక ఉండదు. మెలకువ కలిగిన తరువాత మాత్రమే తాను చూసినది స్వప్నం అంతేకానీ నిజం కాదు అన్న స్ఫురణ కలుగుతుంది.
అదే విధంగా జాగ్రత్ అవస్థలో చూస్తున్న జగత్తు, కలిగే అనుభూతులు ఆభాస మాత్రమే అన్న సత్యం ఆత్మ స్వరూప జ్ఞానోదయం కలిగిన తరువాత మాత్రమే అనుభవానికి వస్తుంది.
జాగ్రదవస్థ, స్వప్న సమయాల్లో నేను నాది అన్న తలంపు ఉంటుంది. సుషుప్తి లో నేను నాది - ఈ రెండిటి ఎరుక ఉండదు. అవస్థ త్రయానికి అతీతమైన సమాధి లేక తురీయావస్థ లో కేవలం నేను అన్న అద్వైత స్థితి ఉంటుంది అని వివరించారు.
ఇంతకీ జగత్తు ఉందా లేదా ?
అద్వైతం చెప్పే మాట - ఉంది , లేదు. ఆభాసగా ఉంది. వాస్తవంగా లేదు.
కనిపించే జగత్తును మాయగా అవ్యక్తమైన ఆత్మ చైతన్యాన్ని వాస్తవంగా నిరూపించడానికి ఇంత శాస్త్రం, చర్చ, బోధ అవసరమా, ఆ ఎరుక లేకపోయినా జీవన యానం సాగుతూనే ఉంటుంది కదా అన్న ప్రశ్న వస్తుంది.
అయితే సత్య వస్తువు స్వరూపం కోసం చేసే అన్వేషణ లో - to travel from lower truth to higher truth, to establish finality, Advaita is the chosen path of Acharyas and Upanishadic Rishis.
ద్వైతం ప్రతిపాదించే ప్రారంభ వాదాన్ని, విశిష్టాద్వైతం పరిణామ వాదాన్ని దాటిపోయి అంతిమ పరిష్కారం చూపుతుంది అద్వైతం.
గురోస్తు మౌనం వ్యాఖ్యానం
శిష్యాస్తు ఛిన్న సంశయాః
శిష్యుల సందేహాలు పటాపంచలు అయ్యాయి.
దక్షిణామూర్తి మౌనం లోని అంతరార్థం అవగతమవుతుంది.🙏
No comments:
Post a Comment