Thursday, April 11, 2024

రేవతి రాగం - భో! శంభో ! గీతం - musical musings

రేవతి రాగం 70s నుంచి బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది.

సంగీత వాగ్గేయకార త్రిమూర్తులు ఈ రాగం లో కృతులు నిర్మించ లేదు అని తెలుస్తుంది.


స రి మ ప ని  

అన్న ఐదు స్వరాలు కలిగిన ఔడవ రాగం.

మధ్యమావతి రాగం లో చతుశ్రుతి రిషభం ఉండగా రేవతి రాగం లో శుద్ధ రిషభం ఉంటుంది.


ఈ రాగంలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడిన నానాటి బ్రతుకు నాటకము అన్నమయ్య కీర్తన ప్రజలకు చేరువ అయ్యింది.


సినీ గీతాలలో విరివిగా వినిపించింది రేవతి రాగం.


ఓ బంగరు రంగుల చిలకా, మానస వీణ మధుగీతం, ఝుమ్మంది నాదం, ఉదయ కిరణ రేఖలో, నా గొంతు శ్రుతి లోనా, అభినవ శశి రేఖవో, మ్రోగింది డమరుకం... పాటలు ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా శ్రీ రామదాసు చిత్రం లోని ఏ మూర్తి పాట రేవతి రాగం లో ఉన్న అద్భుత గీతం అని చెప్పవచ్చు.


వేదమంత్రాలు వీణ పై పలికించడానికి రేవతి రాగం అనువుగా ఉంటుంది అని చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, లలితా సహస్ర నామం.. ఈ రాగ ఛాయ లలో పాడిన స్తోత్రాలు సహస్రనామాలు వినసొంపుగా ఉంటాయి. భక్తి భావనలు  కలుగుతాయి. 


శ్రీనివాసా గోవిందా శ్రీ వెంకటేశా గోవిందా అని రేవతి రాగంలో పారుపల్లి రంగనాథ్ గారు పాడిన గోవిందనామాలు బహుళ ప్రాచుర్యం పొందాయి


అనేక ఉపాధులలో ఒకే అంతర్యామి ఉన్నట్లుగా అనేక గీతాలకు ఒకే రాగం ఆధారంగా ఉంటుంది.



ఆర్ష విద్యా గురుకుల స్థాపకులు, అద్వైత వేదాంత ఆచార్యులు పూజ్య స్వామీజీ దయానంద సరస్వతి గారు రేవతి రాగంలో

భో !  శంభో!   శివ శంభో ! స్వయంభో ! 

అన్న ఒక అద్భుతమైన గీతం రచించారు.  ఈ గీతాన్ని ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు కీ . శే. మహారాజపురం సంతానం గారు సంగీత సభలలో విరివిగా పాడుతూ ప్రాచుర్యం లోకి తెచ్చారు.


పల్లవి.


భో శంభో శివ శంభో స్వయంభో


అనుపల్లవి.


గంగాధర శంకర కరుణాకర

మామవ భవసాగర తారక


భో శంభో శివ శంభో స్వయంభో

భో శంభో శివ శంభో స్వయంభో


చరణం 1.


నిర్గుణ పరబ్రహ్మ స్వరూప

గమాగమ భూత ప్రపంచరహిత

నిజగుహ నిహిత నితాంత అనంత

ఆనంద అతిశయ అక్షయలింగ


చరణం 2.


ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం

తోం తోం తిమికిట తరికిట కిటతోం

ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం

తోం తోం తిమికిట తరికిట కిటతోం


మతంగ మునివర వందిత ఈశా

సర్వ దిగంబర వేష్టితవేష

నిత్య నిరంజన నిత్యనటేశ

ఈశ సభేశ సర్వేశ


భో శంభో శివ శంభో స్వయంభో

భో శంభో శివ శంభో స్వయంభో

గంగాధర శంకర కరుణాకర

మామవ భవసాగర తారక



సాహిత్యం అర్థం:


పల్లవి:  ఓ శంభో, శుభకరుడిగా స్వయంభువుగా  వెలసిన  పరమశివా  


అనుపల్లవి: గంగాధర! శంకర! కరుణాకర!

భవసాగరం దాటించి ( మమ్ము ) రక్షించుము.


చరణం 1: 

నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన నీవు (శంభో)

భూత భవిష్యత్ వర్తమాన కాలములలో  మార్పు చెందే జగత్తుకు అతీతుడైన వాడవు

 

శాశ్వతమైన హిమాలయ పర్వత గుహలో  అనంతమైన ఆనందంతో  శాశ్వతంగా నిలిచి ఉండే అక్షయలింగ స్వరూపుడవు.

(హృదయ కుహరం లో ఆత్మ జ్యోతి స్వరూపుడవై  నిరంతరం వెలుగుతూ వెలసి ఉంటావు)


చరణం 2: ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం, తోం తోం తిరికిట తరికిట కిటతోం .


మునులలో ముఖ్యుడైన మతంగ మునిచే స్తుతించబడిన ఓ ఈశ్వర!


ఆకాశమును వస్త్రంగా చుట్టూ ధరించి, ఎల్లప్పుడూ దోషం లేకుండా అవిరామంగా నాట్యం చేసే నటరాజ స్వామి వైన నీవు సభలకు అధిపతివి మరియు సర్వ లోకాలకు చక్రవర్తివి.


(గీతం యొక్క అర్థ వివరణ భావం అంజలి సుధీర్ గారి బ్లాగు ఆధారంగా)


చిదంబర నటరాజ స్వామి వారి పై వ్రాసిన ఈ  గీతం కూచిపూడి , భరతనాట్యం శాస్త్రీయ నృత్య కళాకారులు తరచుగా ప్రదర్శిస్తారు. చాలా అద్భుతం గా ఉంటుంది. ఒక అలౌకిక అనుభూతి కలిగిస్తుంది.


చిదంబర నటరాజ స్వామి చిత్ సభ, కనక సభ, నృత్త సభ, దేవ సభ, రాజ సభలనే పంచ సభలకు అధిపతి - సభేశుడు.


పూజ్య స్వామీజీ వారి పూర్వాశ్రమ నామం నటరాజన్. ఆ విధంగా ఈ గీతం ఎంతో సముచితంగా అనిపిస్తుంది.


అనేకమంది కళాకారులు ఈ గీతం ఆలపించారు. అందులో ఉన్ని కృష్ణన్ గారు పాడిన గీతం చాలా బాగుంది. విన్న ప్రతి సారి ఒక దివ్యానుభూతి కలుగ జేస్తూ ధ్యాన స్థితి లోకి తీసుకు వెళుతుంది.


Bho shambho in Trichur brothers voice


సమీప గతకాలంలో రేవతి రాగం లో రెండు కీర్తనలు ఆకట్టుకున్నాయి.


హేమచంద్ర పాడిన ధర్మాధర్మము లాలా దైవములాలా అన్న అన్నమాచార్య కృతి చాలా బాగుంది. చక్కగా పాడాడు. సంగీతం బాగుంది.


అలాగే నీవొక్కడవే సర్వాధారము ఈ కీర్తన కూడా చాలా బాగా స్వరపరిచారు. గాయకుడు చక్కగా పాడాడు.


ఓం నమః శివాయ 🙏