ఈ మారు పుస్తక ప్రదర్శనకు రెండు సార్లు వెళ్ళాను. స్టాళ్లు బాగా ఏర్పాటు చేశారు.
మంచి నీరు, కుర్చీలు కూడా సౌకర్యం చేశారు
NTR స్టేడియం (తెలంగాణ కళాభారతి మైదానం) ప్రాంగణం ఇలాంటి ప్రదర్శనలకు , కోటి దీపోత్సవం వంటి వేడుకలకు అనువుగా ఉంటున్నది.
గతంలో కొన్న పుస్తకాలు చాలా ఉన్నాయి.
Self improvement కంటే shelf improvement జరిగింది. చదవడం పైన ఆసక్తి తగ్గింది. అందుకే కొత్తవి కొనడం తగ్గిపోయింది.
ఒక వేదిక పై యథా ప్రకారం కొంతమంది వామ పక్ష అభ్యుదయ, దళిత, ముస్లిం, స్త్రీ వాద రచయితలు తమ పుస్తకాలు ఆవిష్కరించడం తమ ధోరణిలో ప్రసంగించడం చూశాను. కొంతమందికి హిందూ సంస్కృతి సంప్రదాయాలు, హిందూ ధర్మం పట్ల విపరీత అభిప్రాయాలు విముఖత ఉంటాయి. ఈ పుస్తక ప్రదర్శన వేదికను వీరు బాగా ఉపయోగించు కున్నారు. ఈ పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు యాకూబ్ అనే రచయిత అని తెలిసింది.
అయితే స్టాళ్లు చూస్తే తెలుగు సాహిత్యం, హిందూ ఆధ్యాత్మిక స్టాళ్లు, సంప్రదాయ సాహిత్యం, సంస్కృత పుస్తకాల స్టాళ్లు దగ్గర జనం బాగా ఉన్నారు. కొంటున్నారు.
అంబేద్కర్ సాహిత్యం, బుద్ధుడి రచనలు స్టాల్సు ఈ సారి కనిపించాయి.
ఒక మతం వారు ఉచితంగా పుస్తకం ఇస్తున్నారు. ఆసక్తి లేక తీసుకోలేదు.
కవితా సంకలనాలు , మహిళా రచయితల స్టాలు కనిపించాయి. ఏదో చెప్పాలి అనే ఆవేశం. తన భావాలు అందరికీ తెలియాలి అనే తపన రచయితలకు సహజంగా ఉంటుంది. పుస్తకం అచ్చులో చూసుకుంటే అదొక తృప్తి.
బాహ్య ప్రపంచం లో నైనా లేదా అంతరంగం లో నైనా చిత్ర విచిత్రమైన కల్పనలు చేయడం, పాత నవ్వారు మంచాలపై ఉన్నా కొత్త బంగారు లోకాల గురించి కలలు కనడం మనిషికి సహజ లక్షణం. ఆ కలలకు అక్షర రూపం ఇచ్చే నేర్పు రచయితకు ఉంటే చదివి ఆనందించే ఓర్పు పాఠకులకు ఉండాలి.
ప్రస్తుతం సమాజంలో మొబైల్ వాడకం ఎక్కువ అవడం వల్ల కొంతమేరకు attention span తగ్గిపోయింది. పుస్తకం ఆమూలాగ్రం చదివే కుదురు లేకుండా పోతుంది. వార్తా పత్రికలు కూడా హెడ్ లైన్స్ చదివి లోపల ఉన్నది మరీ ఆసక్తి గా ఉంటేనే చదువుతాము.
ఎక్కువ పుస్తకాలు కొని చదవలేక పోవడం కన్నా బాగా ఆసక్తి ఉన్న అంశాలపై వ్రాసిన పుస్తకాలు కొని శ్రద్ధగా చదవడం మంచిదేమో.
ఉత్తమ గ్రంథాలు చదవడం, ఆకళింపు చేసుకోవడం, అందులో మంచి విషయాలు మననం చేసుకోవడం, నిజ జీవితంలో అనుభవానికి తెచ్చుకోవడం బాగుంటుంది.this is serious reading స్వాధ్యయం క్రిందికి వస్తుంది.
కొన్ని పుస్తకాలు సరదా కాలక్షేపం కోసం, మానసికోల్లాసం కోసం చదవడం కూడా మంచిదే. అయితే ఒక దశకు వచ్చాక నవల్సు వంటివి చదివే ఆసక్తి పోతుంది.
ఇష్టం ఉన్నా లేకున్నా పాఠ్య పుస్తకాలు చదవటం అందరికీ తప్పదు.
చందమామ, బాలమిత్ర బొమ్మరిల్లు కథలు ఒక దశ
యండమూరి మల్లాది యద్దనపూడి నవల్సు ఒక దశ
బుచ్చి బాబు, గోపీ చంద్, తిలక్.. రచనలు ఒక దశ
ఆధ్యాత్మిక బుక్స్ ఒక దశ
పురాణాలు బుక్స్ ఒక దశ
ప్రవచనాలు వినడం ఒక దశ
ఆసక్తి తగిపోవడం / లేక పోవడం ఒక దశ
Light reading time pass reading చేయడం ఎప్పుడూ ఉంటుంది
అసలు పుస్తకాలే చదవనివారు కూడా ఉంటారు
ఎక్కువగా పుస్తకాలు చదివే వారు ఉంటారు
ఇలా సాగుతుంటుంది.
ఒక స్టాలు కార్టూనిస్టులు తీసుకున్నారు. అందులో సరసి కార్టూన్లు పుస్తకాలు రెండు తీసుకున్నాను. అడిగితే ఆయన పుస్తకాలపై సంతకం చేసి ఇచ్చారు.
ఋగ్వేదం మంత్రాల స్వాధ్యాయం, శతక పద్యాలు పై రెండు పుస్తకాలు తీసుకున్నాను. పూర్తిగా చదివే ప్రయత్నం చేయాలి.
పుస్తక పఠనాభిలాష పెరిగినట్లే కనిపిస్తుంది. ఆంగ్ల సాహిత్యం స్టాళ్లు, పాత పుస్తకాల స్టాళ్లు వద్ద కూడా బాగా జనం ఉన్నారు.
నా కూడా ఉన్న మిత్రుడు ఒకరు గురవారెడ్డి రచించిన గురవాయణం రెండు పుస్తకాలు కొన్నారు. మంచి క్వాలిటీ తో అచ్చు వేశారు. ఆయన లో ఉన్న హాస్య ప్రియత్వం, zest for life ఈ పుస్తకాలలో కనిపిస్తుంది.
public spaces అంతగా లేని హైదరాబాదులో పుస్తక ప్రదర్శనకు వెళ్ళడం ఒక ఆటవిడుపు లాగా ప్రజలకు అనిపిస్తుంది.
పుస్తకం మస్తక భూషణం అని తెలంగాణా ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి చెప్పారు.
చాలా పుస్తకాలు చూస్తే అవి ఎంత పరిశోధన చేసి వ్రాశారో అని ఒకసారి ఎంత మంది చదువుతారు అని మరొకసారి సందేహం వస్తుంది.
ఏది ఏమైనా పుస్తకం లో కొన్ని పేజీలైనా ప్రతి రోజూ చదవడం మంచి అలవాటు.
నేనొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం, నా మార్గం అని చెప్పే గురువులవి కూడా ప్రత్యేక స్టాళ్లు ఉన్నాయి. అవి రెండు పుస్తకాలు కొంతకాలం క్రితం తీసుకున్నాను. అయితే అంతగా నచ్చలేదు. అయినా అన్ని పుస్తకాలు వ్రాయడం గొప్ప విషయమే.
వారిని అనుసరించే శిష్యులు అవి చదివి ఉంటారా అని అనుమానం. చదవలేదు లేదా నచ్చలేదు అంటే ధిక్కారమున్ సైతునా అని గురువు గారికి కోపం రావచ్చు.
వారి వారి మానసిక స్థితిని, ఆసక్తిని బట్టి పుస్తకాలు చదివే తీరు, అభిరుచి లో మార్పు వస్తుంటుంది.
చక్కటి పుస్తక ప్రదర్శన ఉత్సవం ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులు.
బాగుంది. మీకు కనిపించిన ఆసక్తికరమైన కొత్త పుస్తకాల వివరాలు కూడా చెప్పండి.
ReplyDelete