Thursday, February 14, 2013

కన కన రుచిరా ప్రహ్లాద కనక కశిపు కథ

హిరణ్యకశిపుని పాత్రకు కొంచెం హాస్యం కొంచెం మానవత్వం జోడిస్తే ఎలా ఉంటుందో అన్న ఊహతో ఈ క్రింది ఘట్టాలను  వ్రాయటం జరిగింది. ఎక్కడా కథౌచిత్య భంగం లేకుండా జాగ్రత్త పడ్డాను.

హిరణ్య కశిపుడు  చండామార్కుల  సంభాషణ:

హిరణ్య కశిపుడు (హి. క.) : చండామార్కుల వారూ: మీరు మన రక్ష: కుల చరిత్రలు మా అన్నగారి పోరాటపటిమ , రాకాసి పాటలు, పజ్యాలు నేర్పమంటే నారాయణ మంత్రం నేర్పటంలో మీ ఉద్దేశ్యం సెలవిస్తారా? కులగురువులని మీకు మన్నన చేసినందుకు ఇదా ఫలితం?


 గురువు గార్లు: ప్రభూ! మా ప్రయత్నలోపం ఇంచుకమాత్రంలేదు. పరిపరివిధముల రక్కసి పురాణాలు టక్కు టమార విద్యలు గరపడానికి ప్రయత్నం చేశాము. ప్రహ్లాదుడు మాకు సహకరించటం లేదు. పైపెచ్చు తోటి రాక్షసబాలలకు హరికథలు చెప్పుచూ పాటలు పాడుచు పాడు చేయుచున్నాడు. ఇతనికి చదువు చెప్పటం మాకు ఎంతమాత్రమూ వీలుపడదు. కావాలంటే తోటి పిల్లలను అడగండి

(హి. క.) : ఏమిరా బాలలు గురువుగారు చెప్పినమాటనిజమేనా ఏదీ హిరణ్యాక్ష స్తోత్రం ఒకమారు పాడండి

రాక్షస బాలలు: చీ అదేమీ బాగులేదు మాకు ప్రహ్లాదుడు నేర్పిన విష్ణుమూర్తి భజనలే నచ్చాయి. అవే పాడుతాము.
 అని ఒక మంచి సంకీర్తన పాడారు.
 (హి. క.) : పాట మాధుర్యాన ప్రాణాలు కరిగెనే అంటూ మైమరచిపోయి అంతలోనే తేరుకుని.

(హి. క.) : అయ్యో దేవుడా ఏమిటీ వైపరీత్యం.

ప్రహ్లాదుడు: తండ్రీ చూచితిరా! మీరుకూడా దైవస్మరణ చేసితిరి. అందరికీ ఆ హరే శరణాగతి

(హి. క.) : చీ. మీకోతిమూక నా బుద్ధినికూడా చెరుపుతున్నారు. గురువుగారు! వీళ్ళకి తగిన శాస్తి చేయవలసి ఉన్నది. ఇవ్వాల్టికి పిల్ల వెధవలందరికీ పండ్లు ఫలములు, మిఠాయిలకు మారుగా కాకరకాయలు, ముల్లంగి, వెల్లుల్లి, గన్నేరు  పప్పు పెట్టించండి. అలాగే వీరికి బంగాళదుంప , కంద, అరటి, చామ వేపుడుకూరలు అన్నీ నిషేధించి కేవలం ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ కూరలే వండించండి.  మాట విన్నవారికి పళ్ళరసాలు, విననివారికి కషాయాలు త్రాగించండి.

మరునాడు:

గురువులు : ప్రభు  మీరు చెప్పినట్టే చేశాము. పిల్లలు ఈ  ఆహారాలను తట్టుకోలేక పోతున్నారండి.
(హి. క.) :అయ్యో హిరణ్యాక్ష : ఏదో కోపంలో అలా పురమాయించాము. పాపం పిల్లలకు సరైన తిండి లేకపోతే ఎలా. అన్నీ పెట్టండి. మళ్ళి మళ్ళీ చెప్పి పిల్లలను దారిలోకి తెచ్చుకోవాలి. మేమేమీ పాషాణ పాక ప్రభువులం గాదు

 హిరణ్యకశిపుడు  రాక్షస భటులతో:                                                                                                                                                      

(హి. క.) : (ప్రహ్లాదుడు ఇక మారడని నిశ్చయించుకుని) వీడు మన మలయజవనం వంటి మన రాక్షసకులంలో తప్పబుట్టాడు. వీనిని పలువిధములుగా హింసించి చంపివేయండి.

రాక్షస భటులు: చిత్తం ప్రభూ.

(హి. క.) : ఏవిటి చిత్తం. నా శ్రాద్ధం. పోయినసారి ఇలాగే వెళ్లి ప్రహ్లాదుని పదిలంగా తీసుకువచ్చారు. ఈ తడవ విఫలమయ్యారో మీ గుడ్లు పెరికి వేస్తాను.

హిరణ్య కశిపుడు లీలావతుల సంభాషణ:


(హి. క.) : (బాధతో) అయ్యో దేవీ. మన ముద్దుల కుమారుణ్ణి ఏనుగులతో తొక్కించి బండరాళ్ళతో మోదించి, చంపించమని నేనే పురమాయించాను. ఏమి నా దురవస్థ.

లీలావతి : స్వామీ! మీకు మనస్సులో పిల్లవాడి పైన ఎంతో ప్రేమ ఉన్నా ఈ లాగున అఘాయిత్యం ఎందుకు చేస్తున్నారో బోధపడదు.

(హి. క.) : నేను దుష్టుడినీ, రాక్షసుడినీ అన్నమాట మరచిపోవద్దు. నా స్వభావ సహజంగా ప్రవర్తించవలసి ఉన్నది.

లీ : ఒకరు చెబితే వినేవారు కారు మీరు.

(హి. క.) : జగజ్జేతను. నేను ఎవ్వరి మాటా వినను. అందరూ నా మాట వినాలి అదంతే. హరి నా ఎదుటనిలచి శరణుకోరితే కరుణించగలవాడను.

లీ : ఏమి ఈ కనీ వినీ ఎరుగని మూర్ఖత్వం.

(హి. క.) :   నారదుడు ఇంతపని చేస్తాడనుకోలేదు గర్భములో ఉండగానే మన ప్రహ్లి కి హరిభక్తి నూరి పోశాడు. ఏనాటి నుంచో వెతుకుతున్నాను. మన ప్రహ్లాదుడు చెప్పే హరి నా ముందుకు రాడేమి. అతనికి నేనంటే చచ్చేంత భయం.

లీ : మీకు పోయేకాలం వచ్చినప్పుడు తప్పక మీకు హరి కనిపిస్తాడు.

(హి. క.) :ఏమిటి దేవి? నీవు కూడా విపరీత ప్రసంగం చేయుచున్నావు ?

లీ :మరి నా బిడ్డను చంపబూనిన మిమ్ములను నేను ఎలా మన్నించగలను.

(హి. క.) : (మనసులో) అయ్యో ! ఆ హరి దర్శనంకోసం నేను ఎంత తపించిపోతున్నానో, ఎంత త్వరగా వైకుంఠం చేరవలసి ఉన్నదో వీళ్ళకు ఒక్కనాటికీ బోధపడదు

కనక కశిపు ప్రహ్లాద సంభాషణ:


(హి. క.) :నాయనా ప్రహ్లాదా! ఏమైనా కొంచెం హరిపిచ్చి వదిలిందా?

ప్రహ్లాదుడు : లేదు తండ్రీ. మరికాస్త పెరిగింది.


(హి. క.) : పిచ్చి తండ్రీ! అతను మనకు కులశత్రువురా. నా ఎదుటికి రమ్మను. ఇట్టే వైకుంఠం పంపించి వేస్తాను.

ప్ర: అక్కడ ఇక్కడ వెదకుటేల ? హరి సర్వాంతర్యామి.

(హి. క.) : ఆలాగేం. అయితే ఈ స్తంభములో ఉన్నాడా నీ హరి. లేదంటే నిన్ను నా చేతులతోనే నీ హరివద్దకు పంపిస్తాను.

స్వగతం లో : (వీనికి హరిపిచ్చితో మతి చెడింది. ముందు స్తంభం పగులగొట్టి ఆనేకు వీనిపని పడతాను )

ప్ర: నిస్సందేహంగా ఉన్నాడు.

(హి. క.) : స్వగతంలో -(వీని ఆత్మ విశ్వాసం చూస్తే భయం వేస్తోంది.హరి బయటికి వచ్చే సూచనలు నాకు పోయే  సూచనలు ఉన్నాయి. నాకు మూడినట్టే తోస్తుంది. అయినా బాధ లేదు).

బయటికి:' ఏడిరా నీ హరి. ఎందైనా కలడేమో కానీ ఇందు మాత్రం లేడు' అంటూ స్తంభాన్ని గదతో పగలగొట్టాడు.

కదిరి నృసింహుడు కంబమునా వెడలె అన్నట్టుగా నరసింహస్వామి ఆ స్థంభ మధ్యంలోనుంచి ఆవిర్భవించాడు.

(హి. క.) : అయ్యో ప్రహ్లాదా! ఈ నరసింహము భీతి గొలుపుచున్నది నన్ను రక్షించు నాయనా.


ప్ర: తండ్రీ, ఇప్పుడైనా మించిపోయినది లేదు. హరిని శరణు వేడండి

(హి. క.) : ఎంతమాత్రం వీలుపడదు నేను దుష్టుడినీ రాక్షసుడినిన్నీ. ఆ ప్రకారం నడచుకోవలసి ఉంది.
ఈ మారువేషము దాల్చిన నరహరిని ఎదుర్కొంటాను

ప్ర: వినాశకాలే విపరీత బుద్ధి:

(హి. క.) : నేనిక్కడ విష్ణుమూర్తి తో కలబడుతుంటే ఏమిటా కుదురులేని మాటలు.

(హి. క.) : వచ్చావా స్వామీ. కోరినన్ను ఏలినట్టి కుల దైవమా. వైకుంఠ వియోగము భరింపలేకున్నాను. త్వరగా నాకు ముక్తిని ప్రసాదించు తండ్రీ. నీకు నాకూ ముఖారికీ భైరవి ఉన్నంత అంతరాన్ని కూడా భరింపలేకున్నాను.

 

2 comments:

  1. మీ ప్రయత్నం ఆసక్తికరం.

    అయితే ఇలా పురాణ కథల పాత్రల స్వభావాలు మార్చటంలో సమస్య ఉంది. ముగింపు మార్చలేము కాబట్టి, పాత్ర స్వభావంలో అపసవ్యత రాక తప్పదు.

    ‘నేను దుష్టుడినీ, రాక్షసుడినీ అన్నమాట మరచిపోవద్దు. నా స్వభావ సహజంగా ప్రవర్తించవలసి ఉన్నది’ అనీ; ‘నేను దుష్టుడినీ రాక్షసుడినిన్నీ. ఆ ప్రకారం నడచుకోవలసి ఉంది’ అనీ అంటారా ఎవరైనా?

    స్వభావాన్ని బట్టి ఒక వ్యక్తిది దుష్టత్వం/ సాధుతత్వం అంటాం; అంతే కానీ దుష్టత్వం/ సాధుతత్వం ముందు పుట్టి దాని ప్రకారం వ్యక్తులు నడుచుకోరు!

    రాక్షసులు చెడ్డవారని హిరణ్య కశిపుడే భావించివుంటే, తన అన్న కీర్తిగానాలూ, హిరణ్యాక్ష స్తోత్రాలూ పిల్లలతో చేయించడు కదా?

    >> నీకు నాకూ ముఖారికీ భైరవి ఉన్నంత అంతరాన్ని కూడా భరింపలేకున్నాను.>> typical Anupallavi style :)

    ReplyDelete
  2. వేణు గారు: వ్యాఖ్యకు నెనర్లు. హిరణ్యకశిపుడికి split personality ఉంటె ఎలా ఉంటుందో అని హాస్యంకోసం వ్రాసినదే తప్ప nothing serious about it.

    ReplyDelete