Thursday, March 26, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-1 - సాధించెనే


సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు నాకు అత్యంత ప్రీతి పాత్రమైనవి. 

ఎన్నాళ్లూరకే యుండి ఇప్పుడు అభిమాన పూర్వకం గా ఈ కీర్తనలపైన కొన్ని మాటలు  వ్రాయ సంకల్పించాను. 

ఒక సాధారణ  అభిమానిగా మాత్రమే తప్ప  విపుల భాష్యం చెప్పేటంత పరిజ్ఞానం నాకు లేదు. 

శ్రీ త్యాగరాజ స్వామి వాగ్గేయకారునిగా విశ్వరూపం చూపించిన అద్భుత గీతాలు ఈ పంచరత్న కృతులు. 

తెలుగునాట ప్రతి ఇంటా ,  ప్రతి నోటా ఈ పంచరత్న కృతులు పలికే / చేరువ అయ్యే  రోజు రావాలని నా అభిమతం. 

తొలిగా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన 'సాధించెనే' గీతం.  (రాగం - ఆరభి, తాళం - ఆది) . 

ఆరభి, సామ, శుద్ధ సావేరి రాగాలు అప్ప చెల్లెళ్లు. అప్ప గారైన  ఆరభి అతి మధురమైన రాగం. ఈ మూడు రాగాలు అర్ధనారీశ్వర స్వరూపమైన శంకరాభరణం రాగం ముద్దు బిడ్డలు. 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

పల్లవి : సాధించెనే ఓ మనసా !

అనుపల్లవి :  బోధించిన సన్మార్గవచనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా

(1) దేవకీ వసుదేవుల నేగించినటు - (సాధించెనే)


(2) రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు -
     (సాధించెనే)

(3) గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
     (సాధించెనే)

(4) సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు                 
      సకలాధారుడు - (సాధించెనే)

(5) వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
      పరమాత్ముడదియు గాక యశోద తనయుడంచు
      ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
      (సాధించెనే)

(6)  పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ
      మనఘుడీ కలి బాధలు దీర్చు వాడనుచునే   
      హృదంబుజమున జూచు చుండగ      (సాధించెనే)

(7)  హరే! రామచంద్ర! రఘుకులేశ ! మృదు సుభాష! శేష     
       శయన ! పర నారీ సోదరాజ ! (సోదర + అజ) 
       విరాజ తురగరాజ !రాజనుత ! 
       నిరామయాపఘన ! సరసీరుహ దళాక్ష! యనుచు 
       వేడుకొన్ననన్ను తా బ్రోవకను (సాధించెనే)

(8)  శ్రీ వేంకటేశ! సుప్రకాశ! సర్వోన్నత !సజ్జన మానస     
      నికేతన ! కనకాంబరధర ! లసన్మకుట కుండల విరాజిత! 
      హరే ! యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు 
      మానవేంద్రుడైన రామచంద్రుడు (సాధించెనే)

అనుబంధము : సమయానికి తగు మాటలాడెనే
      సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ గొనెనే
      అలుగ వద్దననే విముఖులతో జేరబోకుమనెనే
      వెత గలిగిన తాళుకొమ్మనెనే దమశమాది 
      సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు
      చెంత రాకనే 

       సాధించెనే  ఓ మనసా సాధించెనే

కొన్ని విశేషాలు : 

మహాగాయకులు ఈ కీర్తన  పాడడంలో కొంత వైవిధ్యము కనబడుతున్నది . వారి వారి సంప్రదాయం అనుసరించి  ప్రతి చరణం / చిట్ట స్వరం  ముగిసిన తదుపరి 'సమయానికి తగు మాటలాడెనే' అని గానీ 'సాధించెనే' అని గానీ పాడడం జరుగుతున్నది.  రెండు పద్ధతులు కూడా ఆమోదయోగ్యమూ అనుసరణీయము అని పెద్దలు నిర్ణయించారు . 

త్యాగరాజ స్వామి ప్రతి కీర్తనలోనూ చరణాలతో పల్లవికి అనుబంధం, భావ సమన్వయం ఎంతో  అందంగా కుదరడం వారి ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు.  

దేవకీ వసుదేవుల నేగించినటు - సాధించెనే 

దేవకీ వసుదేవులు బాల్యంలో కృష్ణుడి లీలలను చూడలేక పోయినందుకు దు:ఖితులైనారు. అదే తీరుగా  నన్ను కూడా సాధిస్తున్నాడు

సొక్కజేయుచును - పరవశింపజేస్తూ 

నిరామయాపఘన! - ఏ దోషమూ అనారోగ్యము లేని శరీరము కలవాడా. 

కీర్తన సంస్కృత , తెలుగు  పడికట్టు పదాల మేలు కలయికగా సాగుతూ అద్భుత శబ్ద సౌందర్యం తో ఆకట్టుకుంటుంది. ప్రతి పదంలో  స్వామి వారి భక్తి అణువణువునా ద్యోతక మవుతుంది. 

అనుబంధంలో  అలుగ వద్దననే విముఖులతో జేరబోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మనెనే అని చెప్పడం ఆత్మీయంగా అనిపిస్తుంది. 

శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతుల ఆలాపనలో సంగీత స్వయంభువు మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారిది benchmark. 


శ్రీ సద్గురు త్యాగరాజ స్వామినే నమ:4 comments:

 1. On a side note,
  Seetaramayya gari manvaralu movie lo ee keerthanani sandorbhachitam ga vadaru.
  Especially "Samayaniki tagu" part was used effectively and yes Pancharatna keerthanalu Balamurali gari gonthulo vinadam anirvachaneeyamaina anubhootini kaligistundi.

  ReplyDelete
 2. అవును శశి గారు. ' సమయానికి తగు మాటలాడెనే' సందర్భోచితంగా వాడడం ఆ దర్శకుడి అభిరుచికి నిదర్శనం. Thank you.

  ReplyDelete
 3. మీ విశ్లేషణ బాగుందండి.

  ReplyDelete