Saturday, March 28, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-2 - ఎందరో మహానుభావులు

సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ: 





స్వామి వారు మనకు ప్రసాదించిన అతి మధురమైన అమిత ప్రాచుర్యం పొందిన  పంచరత్న కృతి - ఎందరో మహానుభావులు అందరికీ వందనములు (శ్రీ రాగం, ఆది తాళం)

స్వామి వారు రామ చంద్రునితో పాటుగా రామ భక్తులను కూడా ప్రస్తుతించడం, భక్తులు ఆనందంతో గానం చేయడాన్ని చూసి పరమానందం పొందడం కొన్ని కీర్తనలలో చూడ వచ్చు. (హరిదాసులు వెడలె ). ఈ కీర్తన పూర్తిగా హరి భక్తులను కీర్తిస్తున్నది.  

' ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ' అన్న పాట ఎత్తుగడ లోనే హృదయం ఉప్పొంగిపోతుంది.

అనుపల్లవిలో చందురు వర్ణుని అని శ్రీరాముని వర్ణించారు. స్వామి నీల మేఘ శ్యాముడు  కానీ ఇక్కడ వర్ణుని అంటే చల్లని వెండి చందమామ  వంటి ఆహ్లాదకరమైన ప్రకాశం కలవాడు అనే అర్థం కావచ్చును. పాఠ అంతరం లో చందురు  వదనుని అని కూడా కనిపిస్తుంది.  

శ్రీ రాగం 22వ మేళకర్త రాగమైన  ఖరహరప్రియ జన్యము. రాగం మూర్చన లోని 

ఆరోహణలో  ఔడవ (ఐదు స్వరాలు) - "స రి మ ప ని స "

అవరోహణ లో  వక్ర సంపూర్ణ రాగం -
 " స ని ప (ద ని ప) మ రి గ రి స "

వరోహణ లోని   'రి గ రి స ' , 'ప ద ని ప మ' వరుసలు ఈ రాగానికి ఎనలేని సొగసును మాధుర్యాన్ని కలుగజేస్తాయి. 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

ప: ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

అ .ప. : చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

చ. 1: సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

చ 2. మానసవన చర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారెందరో మహానుభావులు

చ 3. సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు

చ 4.  పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు

చ 5. హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు

చ 6. హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు

చ 7. పరమ భాగవత మౌనివర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనకకశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

చ 8. నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము ఈవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు

చ 9. భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది షణ్మతముల  గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన
వారెందరో మహానుభావులు

అనుబంధము:  ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

విశేషఅంశాలు : 

మానస వనచర సంచారము నిలిపి  - మనస్సు అనే కోతి నిలకడలేమిని కట్టడి చేసి . 

స్వాంతమను - మనస్సు అను 

కమలభవ సుఖము - బ్రహ్మానందము  

ఒక్కొక్క చరణం విస్తరించుకుంటూ చివరి చరణం లో ఒక crescendo కు చేరుకోవడం ,చివరికి  అనుబంధం తో ముక్తాయించడం మనసును పరవశింపజేస్తుంది. 

ఎందరో మహానుభావులు కీర్తన ఎందరో మహా గాయకులు పాడినా సంగీత సామ్రాట్ బాలమురళి గాత్రంలో వినడం ఒక మధురానుభూతి కలిగిస్తుంది. 

స్వ. నాగయ్య గారు జీవం పోసిన త్యాగయ్య చిత్రం లోని 

అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచిన అన్నమాచార్య గీతం ' ఓ పవనాత్మజ ఓ ఘనుడా' లో ' పాద సరోరుహ' అన్న పదం దగ్గర ' ప ద ని ప మ ' అన్న శ్రీరాగం ముద్ర స్పష్టంగా తెలుస్తుంది.

శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి. 




6 comments:

  1. GKK గారు,
    మంచి పోస్ట్ వ్రాశారు 👏. థాంక్స్.

    అజరామరమైన కీర్తనా"రత్నం". హేమాహేమీలు నాగయ్య గారు, మంగళంపల్లి వారు అద్భుతంగా పాడిన కీర్తన 🙏.

    మీకు తెలుసుగా ... మరొక సంగీత విద్వాంసుడు, "త్యాగరాజ ఆరాధన"లో గానం చేసిన కళాకారుడు, 1970 1980ల దశకాల్లో "హిగ్గిన్స్ భాగవతార్" గా ప్రసిద్ధి చెందిన అమెరికన్ జాన్ హిగ్గిన్స్ (Jon Higgins) కూడా ఈ కీర్తన చక్కగా పాడారు 🙏. మీ ఈ టపా సందర్భంగా ఓ సారి వారిని కూడా తలుచుకుందాం. వారి పాటకు లింక్ ఈ క్రింద.

    "ఎందరో మహానుభావులు" by హిగ్గిన్స్ "భాగవతార్"

    ReplyDelete
  2. హిగ్గిన్స్ భాగవతార్ గారి పాట లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు sir. చాలా బాగా శృతి బద్ధంగా పాడారు.ఒక పాశ్చాత్య దేశస్థుడు కచేరీ స్థాయిలో పాడడం అంటే ఎంత కృషి చేసి ఉంటారో. మహానుభావులు. 70 80 లలో తరచుగా ఆకాశవాణి లో జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గారి కచేరీలు ప్రసారం చేసే వారు.

    Thank you sir🙏

    ReplyDelete
  3. బహు చక్కని కీర్తనకు చక్కటి వివరణ. Thank you.

    ReplyDelete
    Replies
    1. Thank you Jai Garu. ఈ టపాలో వ్రాసిన విషయాలు అన్నీ చదివి, విని సేకరించినవి. వాటికి నా అభిప్రాయం కలిపాను అంతే అని మనవి

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. బాగుంది. త్యాగరాజస్వామి వారు చందురువర్ణుని అని వ్రాసారని నమ్మటం కష్టం. బహుశః చందురువదనుని అని అసలుపాఠం కావచ్చును. ఈవిషయంలో పరిశోధించవలసిన అవసరం ఉన్నది.

    ReplyDelete