Sunday, August 28, 2022

ఆధ్యాత్మిక మ్యూజింగ్స్ - తెలిసి రామ చింతన

శ్రవణం, మననం తదుపరి విచారణ చేస్తూ ఉంటే ఆత్మ యొక్క నిజ స్వరూపం పైన కొంత అవగాహన వస్తుంది.

మనిషి చేసే లౌకిక మైన అనేక రకాల పనులన్నిటి వెనుక ఉండే మౌలిక ఉద్దేశ్యం ఏమిటి అని ఆలోచిస్తే 

1) అనంతం గా వ్యాపించాలనే కోరిక 

2) శాశ్వతం గా ఉండాలి అనే కోరిక 

3) ఆనందంగా ఉండాలి అనే కోరిక 

ఈ మూడూ ప్రధానం గా కనిపిస్తున్నాయి.

మనిషి, ఆ మాటకొస్తే ఇతర ప్రాణికోటి కూడా నిరంతరం ఈ మూడు సాధించడానికి తమ తమ పరిమితుల మేరకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

సంతానోత్పత్తి, ధనం, వస్తువులు, ఆస్తులు సంపాదన, వివిధ లౌకిక విద్యలు, ఆహార విహారాదులు, శత్రు మిత్రత్వాలు, పూజ, ప్రార్థన, ఇతర మత కర్మలు.. ఒకటి కాదు అన్ని పనుల వెనుక ఉన్న  చోదక శక్తులు ఈ మూడు మాత్రమే. ఇది ఘంటాపథంగా చెప్పవచ్చు.

ఏ కర్మ అయినా ఇంద్రియాలు, ప్రాణం లేదా మనస్సు ప్రమేయంతో నే చేస్తున్నాము. ఆలోచన చేయడం, ఊపిరి తీయడం, వివిధ శారీరిక కర్మలు అన్నీ కూడా  జ్ఞానం వెలుగులో మాత్రమే సాధ్యపడుతున్నాయి. ఆ జ్ఞాన స్వరూపమే సత్ చిత్ ఆనంద పరమాత్మ గా ప్రతి జీవిలోను స్వత: సిద్ధంగా ఉంది. అది అనంతం, శాశ్వతం, ఆనంద స్వరూపంగా ఉండగా అది  'తెలియక '  బాహ్య ప్రపంచం లో రకరకాల కర్మలు ఆచరిస్తూ అవస్థలు పడుతున్నది ప్రాణికోటి.  ' తెలిసి ' న  మనిషికి ఈ అంతులేని పరుగు నుంచి బయటపడే అవకాశం ఉంది అని ఆచార్యులు చెప్పారు. కానీ పరుగే పరమానందంగా భావించే మనిషి ఆ పరుగు ఆపే ప్రయత్నం కూడా చేయడు. ఈ పరుగు జన్మ జన్మలకు కొనసాగిస్తూ పైకి లేస్తూ కిందికి పడుతూ జీవి నలిగిపోతాడు. 

అయితే ఏనాటికైనా ఏదో ఒక సాధన మార్గం ఎంచుకుని ఈ రంగులరాట్నం దిగిపోయే ప్రయత్నం చేయక తప్పదు.

- ఆత్మ విచారణ, భక్తి, ధ్యానం, యోగం, పరోపకారం, తపస్సు, జపం, యజ్ఞం, సేవ, వైరాగ్యం, దీక్ష,సత్కర్మ, ధర్మాచరణ..  ఏ మార్గంలో అయినా నిజాయితీగా సాధన చేస్తూ ఉంటే ఏదో ఒక నాటికి ' తెలిసి ' ఈ పరుగు ఆపగలుగుతాము అని పెద్దలు చెప్పారు. 

త్యాగరాజ స్వామి  ' తెలిసి రామచింతన చేయవే ఓ మనసా ' అని  అన్నమయ్య 'తెలిసితే మోక్షము తెలియకున్న బంధము ' అని  చెప్పడం వెనుక భావం ఏమిటి?

త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలలో మూర్తి ఆరాధన, ద్వైత భావన, కేవలం ఇష్టదైవ పారమ్యం మాత్రమే కనిపిస్తాయి అనడం సరికాదు. వారు శ్రీరాముని లోను, వేంకటేశ్వరస్వామి లోను సర్వాంతర్యామి అయిన పరమాత్మను అద్వితీయంగా,  దర్శించారు అని భావించాలి.

అసలు సర్వులకు ఉన్న సామాన్య సమస్య  జనన మరణ చక్రం నుంచి బయటపడడం. ఇది సమస్య అని గుర్తించడం ఒక తొలి అడుగు.

సనాతన ధర్మం ఈ సమస్య పరిష్కారానికి విశ్వజనులకు అచరణీయమయిన మార్గం చూపుతుంది.

అయితే సంకుచిత మతాలు తమ దేవుడు, ప్రవక్త లేదా ఆచార్యుడు మాత్రమే సత్యం అంటూ ఇతర మార్గాలలో సాగేవారిని దూషించడం, హింసించడం, బాధించడం వారిపై అకృత్యాలు చేయడం జరుగుతుంది. 

తమ మతం లో ఉన్నవారికి మరణానంతరం స్వర్గ సుఖాలు, తక్కిన వారికి నరకాగ్ని ప్రాప్తి కలుగుతుంది అని ప్రచారం చేయడం, ప్రలోభాల, బలవంతపు మత మార్పిడులు సాగుతున్నాయి. 

ధర్మాచార్యులు, ధార్మిక ప్రవచన కర్తలు సనాతన ధర్మ రక్షణకోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ,

మన దేశంలో ఉన్న లౌకిక  వ్యవస్థ హిందువులకు, సనాతన ధర్మ పరిరక్షణకు అనుకూలంగా లేదు. హిందూ దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనం లో ఉన్నాయి. హైందవ ధర్మ విద్యా సంస్థల ఏర్పాటుకు అవకాశం లేదు. . వామపక్ష, కుహానా లౌకికవాదుల, మత మౌఢ్యుల నియంత్రణ లో ఉన్న పత్రికలు, సినిమాలు, ప్రసార మాధ్యమాలు, పాఠ్యాంశాలు అన్నీ కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.

రాజకీయ నాయకుల అధికార కాంక్ష కారణంగా  హిందువులపై వివక్షాపూరిత ధోరణి, అన్య మత సంతుష్టీకరణ పెరిగిపోతుంది. హిందువులకు, సాధువులకు  రక్షణ కల్పించలేక పోతున్నారు.

హిందువులలో కూడా అనేకులు తమ మనుగడ ప్రమాదం లో ఉంది అన్న సత్యం గుర్తించ లేకున్నారు. 

భారతదేశం హిందువులకు ఉన్న ఏకైక దేశం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ దేశం లో కూడా హైందవ మతం క్షీణించి పోయే ప్రమాదం ఉంది. అది ప్రపంచ మానవాళికి మహా విపత్తు అవుతుంది.  

ప్రపంచంలోని అత్యధిక దేశాల లో మెజారిటీ గా ఉన్న రెండు మతాలు మన దేశం లో మైనారిటీ గా గుర్తించడం సరైనదేనా? 

సమస్త చరాచర సృష్టి ని దైవంగా భావించే మార్గం సనాతన ధర్మం మాత్రమే.

విశ్వ మానవ శ్రేయస్సు కోసం సనాతన ధర్మం పరిరక్షింపబడాలి. 🙏


(ఆదిశంకరుల తత్వ చింతన ను బోధించే సద్గురువుల ప్రవచనాలు, ఇతర సామాజిక మాధ్యమాల్లో ని విషయాల  ఆధారంగా)










Tuesday, August 2, 2022

కవిత్వం made easy - పఠనం made difficult

ఇటీవలి నెలలలో  3-4 లఘు రచనలు వ్రాశాను. ( కొన్ని పంక్తుల సముదాయం అనవచ్చు). 

అవి సాక్షి దినపత్రిక ఆదివారం పుస్తకం లో వచ్చాయి. 

వచన కవితలు అనబడే రచనలు ఈ రోజులలో ఎంతమంది చదువుతారో తెలియదు.

అప్పుడప్పుడు మంచి రచనలు ఆలోచింపజేసే పంక్తులు కనిపిస్తాయి.

సాహిత్యానికి కవిత్వానికి ఒక పుట సాక్షి పత్రికలో కేటాయించారు.

ఎందుకో గానీ ఈనాడు పత్రిక లో సాహిత్యానికి కవిత్వానికి పేజీ లేదు. పుస్తక పరిచయం మాత్రమే ఉంటుంది. 

దాదాపు నలభై ఏళ్ల క్రితం  రెండు మూడు మినీ కవితలు, కొన్ని కార్టూన్లు ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో వచ్చాయి. ఆ సమయం లో భలే థ్రిల్ గా అనిపించింది.  ఇప్పుడు ఆ రచనలు తలుచుకుంటే హాస్యాస్పదం గా అనిపిస్తుంది.

గొప్ప రచనలు కొన్ని చదివాక నేను ఎందుకు వ్రాయకూడదో అర్థమైంది.

ఆ తరువాత ఇక ప్రయత్నించలేదు. అయితే some habits die hard and surface later.  

ఒకటి రెండు ఈ మాట కు పంపాను. అవి ఏమాత్రం బాగాలేవు అని నాకే అనిపించింది. వారు పాపం ఎంతో మృదువుగా అదేమాట చెప్పారు.

ఆ తరువాత కొంచెం సాధన చేసి కొంత ఆద్వైతం, ఆధ్యాత్మికత కలిపి కొన్ని పంక్తులు వ్రాసి సాక్షికి పంపాను. వారు ఎందుకో మరి ప్రచురించారు.

నాకు ఆనందం కంటే ఆశ్చర్యం కలిగింది.

క్రింది రచన సంగీతం, నాదం ఆధారంగా వ్రాశాను. గంభీరంగా ఉండాలి అని కొన్ని సంస్కృత సమాసాలు ఉపయోగించాను. అవి

అసందర్భంగా లేవు అని అనుకుంటున్నాను.

నా రచనల సంగతి అలా ఉంచితే, అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన వాక్యాలు చదవగలిగాను.

కొందరు రచయితల భావుకత, వారి భావ వ్యక్తీకరణ, వారి రచనలలో వస్తు వైవిధ్యం, పద చిత్రాలు  బాగుంటాయి.

తనకు కలిగిన భావనకు అక్షర రూపం ఇవ్వాలి అన్న బలమైన కోరిక రచనకు పురికొల్పుతుంది అనుకుంటాను.

ఏమైనా సంప్రదాయ సాహిత్యం, గొప్ప రచయితల రచనలు కొంత మేరకైనా చదివి అర్థం చేసుకోకుండా రచనలు చేయడం అవివేకమైన పని అని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. Creative art may work as a type of catharsis for artists. Sometimes audience may also feel the same.