Wednesday, January 25, 2023

మధుర గాయని వాణీ జయరామ్ గారు


వాణీ జయరామ్ గారికి 2023 సం. పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించడం ఆనందం కలిగించింది.

70s 80s లలో వచ్చిన కన్నడం, తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో ఆమె అనేక అద్భుత గీతాలు పాడారు. 

అనేక భక్తి గీతాలు పాడారు.  ఇప్పటికీ పాడుతున్నారు.

కర్నాటక సంగీతం హిందుస్తానీ సంగీతం రెండింటిలోనూ శిక్షణ పొందారు వాణీ జయరామ్ గారు. ఆమె తొలినాళ్లలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగిని గా పని చేస్తూనే సంగీత రంగంలో కూడా కృషి చేశారు.

1971 సం. లో వచ్చిన గుడ్డీ చిత్రం లోని ' బోలి రే పపిహరా ' వసంత్ దేశాయి సంగీతం లో పాడిన పాట అమిత ప్రాచుర్యం పొందింది. ఆమె భారత రత్న పండిట్ రవిశంకర్ గారి సంగీతం లో వచ్చిన మీరా చిత్రం లో ప్రధాన గాయని గా అద్భుతంగా పాడారు. ఒక దశలో హిందీ చిత్ర రంగం లో ఆమె లతా మంగేష్కర్, ఆశా భోంస్లే గారితో సమానంగా రాణిస్తారు అని భావించిన తరుణం లో కొన్ని కారణాల వల్ల హిందీ రంగం నుంచి దక్షిణాదికి వచ్చేశారు. 

తమిళంలో ఎమ్మెస్ విశ్వనాథన్ , కన్నడం లో ఎం. రంగారావు, విజయ భాస్కర్, రాజన్ నాగేంద్ర , తెలుగులో కే వీ మహదేవన్ గార్లు ఆమెను బాగా ప్రోత్సహించగా అనేక మరపురాని గీతాలు పాడారు. మలయాళం రంగంలో కూడా అనేక గీతాలు పాడారు.

తెలుగు వారికి ఆమె పాడిన ఎన్నెన్నో జన్మల బంధం నీదినాది  (పూజ 1975 - రాజన్ నాగేంద్ర) , పూజలు చేయ పూలు తెచ్చాను, నింగీ నేలా ఒకటాయెలే  పాటలు అంటే చాలా ఇష్టం.

ఈ సినిమా విడుదల అయిన రోజుల్లో సినిమా బండిలో ఎన్నెన్నో జన్మల బంధం పాట వినిపిస్తుంటే ఆ బండి వెనుకే మైమరచిపోయి వింటూ వెళ్లిన విషయం నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. A song which is very dear to my heart.

70s 80s లలో అనంతపురం లో ధార్వాడ్ మత్తు గుల్బర్గా , బెంగుళూరు  స్టేషన్లు రేడియో లో  బాగా వచ్చేవి. అద్భుతమైన కన్నడ పాటలు ఎక్కువగా వినే అవకాశం ఉండేది. నిజం చెప్పాలంటే తెలుగు కంటే కన్నడం పాటలు నచ్చేవి. అప్పుడు రాజన్ నాగేంద్ర, ఎం. రంగారావు, విజయ భాస్కర్, ఉపేంద్ర కుమార్, సత్యం గార్ల సంగీతం లో ఎస్పీ బాలు, జానకి, రాజకుమార్ , వాణీ జయరామ్ గార్లు పాడిన పాటలు అద్భుతం గా ఉండేవి. అది ఒక స్వర్ణ యుగం.

కే విశ్వనాథ్ గారి  శంకరాభరణం, స్వాతి కిరణం, శృతి లయలు, స్వర్ణ కమలం  చిత్రాలలో వాణీ జయరామ్ గారు పాడిన పాటలు శాశ్వతం గా నిలిచి ఉంటాయి. శంకరాభరణం 1980, స్వాతి కిరణం 1991 చిత్రాలలోని పాటలకు జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు.  తొలిసారిగా అపూర్వ రాగంగళ్ 1975 చిత్రం లో జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు. 

శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలకు వాణీ జయరామ్ గారు పూర్తి న్యాయం చేయగలరు.

ఏ భాషలో పాడినా మాతృభాష లాగా అనిపించే స్పష్టమైన ఉచ్చారణ, మాధుర్యం, భావుకత తో పాడతారు. సుశీల గారు, జానకి గారు తరువాత వాణీ జయరాం గారు ఆ తరువాత చిత్ర గారు. వీరితో చలన చిత్ర సంగీత స్వర్ణయుగం ముగిసి పోయింది.

కన్నడం లో రాజ్ కుమార్ గారితో కవిరత్న కాళిదాసు చిత్రం లోని పాటలు అద్భుతం గా ఉంటాయి.

సదా కణ్ణలి ప్రణయదా కవితె హాడువే - ఎంత హాయి గొలిపే పాట. బృందావన సారంగ రాగం లో ఎం. రంగా రావు గారి సంగీతంలో రాజకుమార్ వాణీ జయరామ్ గార్లు అద్భుతం గా పాడారు. జయప్రద గారు ఎంత అందం గా ఉన్నారు.

మేఘమే మేగమే పాట (  1981 తమిళ చిత్రం లోనిది) వాణీ జయరామ్  గారు అద్భుతంగా పాడారు. ఇదే పాట తెలుగు చిత్రం మంచు పల్లకీ లో మేఘమా దేహమా - ఎస్ జానకి గారు అంతే గొప్పగా పాడారు. ఈ పాటకు ఒక ప్రసిద్ధ గాయకుడు పాడిన  గజల్ ఆధారం అని తెలుస్తుంది. 

Living legend వాణీ జయరామ్ గారు 🙏🙏🙏

3 comments:

 1. చాల బాగా చెప్పారు సర్.వాణీ జయరాం గరికి శాస్త్రీయ సంగీతం మీద ఉన్న పట్టు అమోఘం.
  90స్ లో కొత్త సంగీత దర్శకులు ఎందుకో ఆవిడ గొంతును అంత వాడుకోలేదు.
  ఆవిడ పాడిన పాటలన్నీ మధురాలే.
  విధి చేయు వింతలన్నీ నాకు చాలా ఇష్టమైన పాట.మరోచరిత్ర చిత్రం లోని పాటలన్నీ అజరమరాలే.

  ReplyDelete
  Replies
  1. నిజం శశి గారు. విధి చేయు వింతలన్నీ పాట ఒక క్లాసిక్. మరో చరిత్ర సినిమాలో పాటలు అన్నీ బాగుంటాయి.

   Delete
 2. విశ్వనాథ్ గారు కన్ను మూసిన రెండు రోజుల లోనే వాణి జయరాం గారి ఆకస్మిక మరణ వార్త వినవలసి రావడం బాధాకరం. ఓం శాంతి.🙏

  ReplyDelete