(2017 లో దేశాల వారీగా జనాభా సూచించే చిత్రం )
Yes. we did it. ప్రపంచ జనాభాలో మనమే నంబర్ వన్.
1947 లో మన జనాభా 34 కోట్లు. 1990 లో 87 కోట్లు. 2023 లో 142.8 కోట్లకు చేరుకుంది.
ఈ విషయం లో మనం చైనా ను అధిగమించాము. చైనా ఈ విషయం జీర్ణించుకోలేక పోతున్నది.
జనచైనా అని మురిసిపోయే వామపక్ష వాదులు చింతాక్రాంతులైనారు.
మన దేశ వైశాల్యం, వనరుల లభ్యత ప్రకారం 30-35 కోట్ల జనాభా ఉంటే బాగుంటుంది అని ఒక అంచనా.
110 కోట్లు అధికంగా ఉన్నాము. అయినా ఓకే. సర్దుకుపోతున్నాము.
ప్రపంచ వైశాల్యం లో 2.4 % ఉన్న భారత దేశం, ప్రపంచ జనాభాలో దాదాపు 18 % కలిగిఉంది.
ఒక విధంగా అధిక జనాభాయే భారతీయ సంస్కృతి వేల ఏళ్లుగా మనగలగడానికి కారణం అనిపిస్తుంది. అయితే ఒక స్థాయిని మించి పెరగటం సమస్యగా మారుతుంది.
యువతీ యువకులు పెళ్లి చేసుకునే వయసు పెరిగింది. అలాగే ఒకరు లేక ఇద్దరు పిల్లలు చాలు అనుకుంటున్నారు. అయితే కొన్ని రాష్ట్రాలు, గ్రామీణ ప్రాంతాలలో, కొన్ని వర్గాల వారిలో సంతాన ఉత్పత్తి జాతీయ సగటు కంటే అధికంగా ఉంది.
2050 నాటికి భారత దేశ జనాభా స్థిరీకరణ జరిగి తగ్గుముఖం పడుతుంది అని అంచనా. అయితే అప్పుడు వృద్ధుల సంఖ్య శాతం పెరిగే అవకాశం ఉంది. జపాన్, చైనా వంటి దేశాలు ఈ సమస్య ఇప్పటికే ఎదుర్కొంటున్నాయి.
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని గురజాడ అన్న మాటలను సీరియస్ గా తీసుకున్నాము.
నదులు కలుషితం అయ్యాయి. అడవులు కుంచించుకు పోయాయి. కార్బన్ ఉద్గారాలు పెరిగాయి. నగరీకరణ శరవేగంగా జరుగుతోంది.
అతి ముఖ్యమైన విషయం. ఇంత జనాభాకు ఆహార ధాన్యాలు, త్రాగు నీరు అందించడం ఎలా ? మన దేశం లో వ్యవసాయ యోగ్య భూమి అధికం గా ఉండటం వల్ల , నదులు, వర్షపాతం తగినంత గా ఉండటం వల్ల, కొంత మేరకు జలాశయాలు నిర్మించుకోవడం వల్ల ఆహార భద్రత సాధించ గలిగాము.
అయితే వ్యవసాయం భారంగా మారిన పరిస్థితిలో, వ్యవసాయ భూములను అభివృద్ధి పేరుతో ఉపయోగించడం వల్ల ప్రమాదం ఉంది. వ్యవసాయ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
వేలాది ఎకరాల సారవంతమైన భూములు సేకరించి కొత్త నగరాలు నిర్మించబూనడం సరికాదు.
తిండి గింజలు దొరకని నాడు ఆకాశ హర్మ్యాలు, పరిశ్రమలు ఎన్ని ఉన్నా లాభం లేదు.
వేల ఏళ్ల చరిత్ర కలిగిన భారత దేశం జనసంఖ్య లో ప్రథమ స్థానం పొందడం గొప్ప విషయం.
No comments:
Post a Comment