16-6-2024 ఆదివారం సాక్షి ఫన్ డే లో కవితల పేజీలో నేను వ్రాసిన ఒక రచన అచ్చయింది.
--------------
జేబులో బొమ్మ
చీకటిని స్పష్టంగా చూడగల చూపు
అంతటా ఉన్న ఆకాశం కోసం వెతుకుతుంది.
వెనక వెలిగే జ్యోతి
ముందున్న తెరపై బొమ్మను చూపిస్తుంది.
కలలో ఆడిన బొమ్మ
మెలకువలో కరిగిపోతుంది.
ఎగసిపడిన అల
సాగరంలో కలిసిపోతుంది.
జాగ్రత్ స్వప్నాలలో ఆడుకునే అజ్ఞానం
సుషుప్తిలో బ్రేక్ తీసుకుంటుంది.
అజన్మాంతం మూడుముక్కలాట
సాగుతూ ఉంటుంది
ఘటం లోకి ఆకాశం ఆకాశం లోనికి ఘటం
నిరంతరంగా దూరుతుంటాయి.
అద్దంలో తన పగటి వేషం చూసి
ఆత్మ నవ్వుకుంటుంది.
ఆర్టిస్టు బహుముఖంగా
సైంటిస్టు బహిర్ముఖుడై వెతికే సత్యం
చివరికి జేబులో బొమ్మై దొరుకుతుంది.
----------------
ఈ రచనలో భావాలు శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి అద్వైత ప్రవచనాల స్ఫూర్తితో వ్రాసినవి. గురువుగారు వివరించే తీరు , తీసుకునే ఉదాహరణలు అద్భుతం.
ముఖ్యంగా బాహ్య ప్రపంచంలో సత్యం కోసం అన్వేషకులుగా అనేక మార్గాలలో ప్రయత్నం చేస్తున్నాము.
కళాకారుడు నాదంలో, నాట్యంలో, చిత్రలేఖనంలో ఇంకా ఏదో ఒక కళ ద్వారా వెతుకుతుంటాడు.
భాషా పండితుడు, భావుకుడు సాహిత్యంలో కృషి చేస్తూ ఉంటాడు.
శాస్త్రవేత్త ఇంకో వైపు నుంచి చేసే అన్వేషణ పరమాణువు నుంచి విశాల విశ్వం దాకా సాగుతుంది.
భక్తులు, యజ్ఞ కర్మలు, సమాజసేవ చేసేవారు, యోగ సాధకులు, కర్మిష్టులు వారి ప్రయత్నం వారు చేస్తున్నారు.
వీరికి భిన్నంగా తాత్వికులు, ఋషులు అంతర్ముఖులై సత్యాన్వేషణ సాగిస్తారు.
వారి వారి సాధనలకు అనుగుణంగా పాక్షిక సత్యాలు ఆవిష్కరింప బడతాయి.
అంతటితో ఆగక universal truth అనుభవం అయ్యేదాకా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
కొందరి ప్రయాణం నల్లేరు మీద బండి నడక లాగా, కొందరిది నత్త నడకన సాగినట్లు అనిపిస్తుంది.
తెలిసి సాగేవారు కొందరు. తెలియక ప్రవాహంలో పడి పోయేవారు కొందరు. ఊరి బయట కొండ ఎక్కి ఇదే బెస్టు, లేదు ఎవరెస్టు అనేవారు కొందరు.
కొందరిది పురోగమనం కొందరిది తిరోగమనం. ఏది ఏమైనా ప్రయాణం తప్పదు. రంగుల రాట్నం ఎక్కి కూర్చున్నాక తిరగక తప్పదు. ఆట ముగిసిన తరువాత దిగక తప్పదు.
అలలు ఎంత ఎగసిపడినా చివరకు కడలి ఒడిలో చేరి విశ్రమించ వలసిందే.
చంకలో పిల్లాణ్ణి పెట్టుకుని ఊరంతా వెతుకుతూ ఉందాము.
ఆనందంగా గజస్నానం చేసుకుందాము.
రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కు వేసుకుందాము.
Journey continues from lower truth to higher truth.