Monday, March 31, 2014

మండుటెండల్లో మల్లెలు, మంచి గంధం ఇంకా కొంచెం మలయమారుతం .


మలయమారుతం ఉదయరాగం. మేలుకొలుపులకు అనువుగా ఉంటుంది. మల్లెమొగ్గలపై నిలిచిన నీటి తుంపరలంత నవ్యంగా ఉంటుంది.

ఒక్క పాట ను పునశ్చరణ చేసుకుంటాను.
ఈ పాట 'ఒరు ఓడై నదియాగిరదు' అన్న చిత్రం లోనిది. పాడినవారు కృష్ణ చంద్రన్, శశిరేఖ. సంగీతం ఇళయరాజా. ఈ పాట మలయమారుతానికి ఒక చక్కని ఉదాహరణ. పాటలో రఘువరన్ dance చేస్తే amusing గా అనిపిస్తుంది. ఇదే cinema లో ఇళయరాజా రీతిగౌళ లో ఒక  అద్భుతమైన పాట స్వరపరిచాడు.

మలయమారుతం  విన్న తరువాత వేసంకాలంలో తెల్లారగట్ల చన్నీటిస్నానం చేసినట్టుగానూ పునర్జన్మ ఎత్తినట్తుగానూ అనిపిస్తుంది.  కొత్తకుండలో నీళ్ళు తాగినట్టుగా కూడా ఉంటుంది. మంచిగంధం మైనలదికొన్నట్టుగా కూడా ఉంటుంది. 

వేసవి మధ్యాహ్న వేళ  చలివేన్దిర పెట్టినట్టుగా, మజ్జిగలో నిమ్మపండుపిండి, చిటికెడు ఉప్పు, కరివేపాకు వేసి తాగి సేదతీరినట్టుగా కూడా ఉంటుంది.

మలయమారుతంలోని 'కొండగాలి తిరిగింది పాటను, మేలుకో శృంగార రాయ' అన్నమయ్య పాటను పాత టపాలలో  చెప్పుకున్నాను. 

అయినా చైత్రంవచ్చీరాకముందే చిత్రంగా ఎండలు చిటపటమంటున్నాయి ఎందుకో. తొందరపడి ఏ కోయిలైనా ముందే కూసేసిందేమో. 



  

Sunday, March 2, 2014

ఇదివరకే విన్నానా- మళ్ళీ కొత్తగా వింటున్నానా



కొన్ని పాటలకు మనసును దేశ, కాలాంతర సంచారం చేయించే లక్షణం ఉంటుంది. పాటలు విన్నతరువాత కాలమాగినట్టు, నయగారా జలపాతం హిమంగా మారే మహిమ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది.

'విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం,  నిజాంతర్గతం'  అన్నట్టుగాను కొండ అద్దమందు కొంచమై ఉండదా అనికూడా అనిపిస్తూ మనసులోనే విశ్వదర్శనం అవుతుంది. .

ఆత్మసౌందర్యం ఉట్టిపడే అలాంటి మూడు పాటలను ఒక్కసారి గుర్తు చేసుకుంటాను.
మూడింటికీ ఇళయరాజా సంగీతం.

1) 'జొతెయలి జొతె  జొతెయలి' ఈ పాట గీత  (1981) అన్న కన్నడ చిత్రంలోనిది.  పాటలో బాలుగొంతు ఎంతో బాగుంటుంది. ఇదే బాణీలో పాట    cheeni kum చిత్రంలో కూడా ఉంది.

2) పుత్తం పుదు కాలై అనే ఈ పాట 'అలైగళ్ ఓయ్వదిల్లై ' (1981) (తెలుగులో సీతాకోక చిలుక) చిత్రంలోనిది.  గానం  s జానకి గారు. పాటను ఎంతో గొప్పగా 'clean vocals ' తో పాడారు.

3) 'పూ మాలయే'  - పగల్ నిలవు (1985) చిత్రంలోనిది. పాడినవారు ఇళయరాజా, s జానకి గారు.

ఇళయరాజా best output 1980 నుంచి 1988 కాలంలో ఇచ్చాడని నా అభిప్రాయం. సినీ సంగీతాన్ని తన avant garde quality తో redefine చేసాడు అని చెప్పవచ్చు.

పై పాటలు వచ్చి ముప్పై ఏళ్ళు అయినా ఇంకా contemporary గా అనిపిస్తున్నాయి. అది  గొప్ప పాటల లక్షణం.  విన్నకొద్దీ sense of  deja vu.