Saturday, March 28, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-2 - ఎందరో మహానుభావులు

సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ: 





స్వామి వారు మనకు ప్రసాదించిన అతి మధురమైన అమిత ప్రాచుర్యం పొందిన  పంచరత్న కృతి - ఎందరో మహానుభావులు అందరికీ వందనములు (శ్రీ రాగం, ఆది తాళం)

స్వామి వారు రామ చంద్రునితో పాటుగా రామ భక్తులను కూడా ప్రస్తుతించడం, భక్తులు ఆనందంతో గానం చేయడాన్ని చూసి పరమానందం పొందడం కొన్ని కీర్తనలలో చూడ వచ్చు. (హరిదాసులు వెడలె ). ఈ కీర్తన పూర్తిగా హరి భక్తులను కీర్తిస్తున్నది.  

' ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ' అన్న పాట ఎత్తుగడ లోనే హృదయం ఉప్పొంగిపోతుంది.

అనుపల్లవిలో చందురు వర్ణుని అని శ్రీరాముని వర్ణించారు. స్వామి నీల మేఘ శ్యాముడు  కానీ ఇక్కడ వర్ణుని అంటే చల్లని వెండి చందమామ  వంటి ఆహ్లాదకరమైన ప్రకాశం కలవాడు అనే అర్థం కావచ్చును. పాఠ అంతరం లో చందురు  వదనుని అని కూడా కనిపిస్తుంది.  

శ్రీ రాగం 22వ మేళకర్త రాగమైన  ఖరహరప్రియ జన్యము. రాగం మూర్చన లోని 

ఆరోహణలో  ఔడవ (ఐదు స్వరాలు) - "స రి మ ప ని స "

అవరోహణ లో  వక్ర సంపూర్ణ రాగం -
 " స ని ప (ద ని ప) మ రి గ రి స "

వరోహణ లోని   'రి గ రి స ' , 'ప ద ని ప మ' వరుసలు ఈ రాగానికి ఎనలేని సొగసును మాధుర్యాన్ని కలుగజేస్తాయి. 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

ప: ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

అ .ప. : చందురు వర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

చ. 1: సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

చ 2. మానసవన చర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగనే వారెందరో మహానుభావులు

చ 3. సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువారెందరో మహానుభావులు

చ 4.  పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు

చ 5. హరిగుణ మణిమయ సరములు గళమున
శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు

చ 6. హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు

చ 7. పరమ భాగవత మౌనివర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనకకశిపుసుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమలభవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

చ 8. నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము ఈవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు

చ 9. భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను శివాది షణ్మతముల  గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన
వారెందరో మహానుభావులు

అనుబంధము:  ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

విశేషఅంశాలు : 

మానస వనచర సంచారము నిలిపి  - మనస్సు అనే కోతి నిలకడలేమిని కట్టడి చేసి . 

స్వాంతమను - మనస్సు అను 

కమలభవ సుఖము - బ్రహ్మానందము  

ఒక్కొక్క చరణం విస్తరించుకుంటూ చివరి చరణం లో ఒక crescendo కు చేరుకోవడం ,చివరికి  అనుబంధం తో ముక్తాయించడం మనసును పరవశింపజేస్తుంది. 

ఎందరో మహానుభావులు కీర్తన ఎందరో మహా గాయకులు పాడినా సంగీత సామ్రాట్ బాలమురళి గాత్రంలో వినడం ఒక మధురానుభూతి కలిగిస్తుంది. 

స్వ. నాగయ్య గారు జీవం పోసిన త్యాగయ్య చిత్రం లోని 

అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచిన అన్నమాచార్య గీతం ' ఓ పవనాత్మజ ఓ ఘనుడా' లో ' పాద సరోరుహ' అన్న పదం దగ్గర ' ప ద ని ప మ ' అన్న శ్రీరాగం ముద్ర స్పష్టంగా తెలుస్తుంది.

శ్రీరామ చంద్ర చరణౌ శిరసా నమామి. 




Thursday, March 26, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-1 - సాధించెనే






సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు నాకు అత్యంత ప్రీతి పాత్రమైనవి. 

ఎన్నాళ్లూరకే యుండి ఇప్పుడు అభిమాన పూర్వకం గా ఈ కీర్తనలపైన కొన్ని మాటలు  వ్రాయ సంకల్పించాను. 

ఒక సాధారణ  అభిమానిగా మాత్రమే తప్ప  విపుల భాష్యం చెప్పేటంత పరిజ్ఞానం నాకు లేదు. 

శ్రీ త్యాగరాజ స్వామి వాగ్గేయకారునిగా విశ్వరూపం చూపించిన అద్భుత గీతాలు ఈ పంచరత్న కృతులు. 

తెలుగునాట ప్రతి ఇంటా ,  ప్రతి నోటా ఈ పంచరత్న కృతులు పలికే / చేరువ అయ్యే  రోజు రావాలని నా అభిమతం. 

తొలిగా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన 'సాధించెనే' గీతం.  (రాగం - ఆరభి, తాళం - ఆది) . 

ఆరభి, సామ, శుద్ధ సావేరి రాగాలు అప్ప చెల్లెళ్లు. అప్ప గారైన  ఆరభి అతి మధురమైన రాగం. ఈ మూడు రాగాలు అర్ధనారీశ్వర స్వరూపమైన శంకరాభరణం రాగం ముద్దు బిడ్డలు. 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

పల్లవి : సాధించెనే ఓ మనసా !

అనుపల్లవి :  బోధించిన సన్మార్గవచనముల బొంకు జేసి తా బట్టినపట్టు సాధించెనే ఓ మనసా

(1) దేవకీ వసుదేవుల నేగించినటు - (సాధించెనే)


(2) రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు -
     (సాధించెనే)

(3) గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
     (సాధించెనే)

(4) సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు                 
      సకలాధారుడు - (సాధించెనే)

(5) వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
      పరమాత్ముడదియు గాక యశోద తనయుడంచు
      ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
      (సాధించెనే)

(6)  పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ
      మనఘుడీ కలి బాధలు దీర్చు వాడనుచునే   
      హృదంబుజమున జూచు చుండగ      (సాధించెనే)

(7)  హరే! రామచంద్ర! రఘుకులేశ ! మృదు సుభాష! శేష     
       శయన ! పర నారీ సోదరాజ ! (సోదర + అజ) 
       విరాజ తురగరాజ !రాజనుత ! 
       నిరామయాపఘన ! సరసీరుహ దళాక్ష! యనుచు 
       వేడుకొన్ననన్ను తా బ్రోవకను (సాధించెనే)

(8)  శ్రీ వేంకటేశ! సుప్రకాశ! సర్వోన్నత !సజ్జన మానస     
      నికేతన ! కనకాంబరధర ! లసన్మకుట కుండల విరాజిత! 
      హరే ! యనుచు నే పొగడగా త్యాగరాజ గేయుడు 
      మానవేంద్రుడైన రామచంద్రుడు (సాధించెనే)

అనుబంధము : సమయానికి తగు మాటలాడెనే
      సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ గొనెనే
      అలుగ వద్దననే విముఖులతో జేరబోకుమనెనే
      వెత గలిగిన తాళుకొమ్మనెనే దమశమాది 
      సుఖదాయకుడగు శ్రీ త్యాగరాజ నుతుడు
      చెంత రాకనే 

       సాధించెనే  ఓ మనసా సాధించెనే

కొన్ని విశేషాలు : 

మహాగాయకులు ఈ కీర్తన  పాడడంలో కొంత వైవిధ్యము కనబడుతున్నది . వారి వారి సంప్రదాయం అనుసరించి  ప్రతి చరణం / చిట్ట స్వరం  ముగిసిన తదుపరి 'సమయానికి తగు మాటలాడెనే' అని గానీ 'సాధించెనే' అని గానీ పాడడం జరుగుతున్నది.  రెండు పద్ధతులు కూడా ఆమోదయోగ్యమూ అనుసరణీయము అని పెద్దలు నిర్ణయించారు . 

త్యాగరాజ స్వామి ప్రతి కీర్తనలోనూ చరణాలతో పల్లవికి అనుబంధం, భావ సమన్వయం ఎంతో  అందంగా కుదరడం వారి ప్రత్యేక శైలి అని చెప్పవచ్చు.  

దేవకీ వసుదేవుల నేగించినటు - సాధించెనే 

దేవకీ వసుదేవులు బాల్యంలో కృష్ణుడి లీలలను చూడలేక పోయినందుకు దు:ఖితులైనారు. అదే తీరుగా  నన్ను కూడా సాధిస్తున్నాడు

సొక్కజేయుచును - పరవశింపజేస్తూ 

నిరామయాపఘన! - ఏ దోషమూ అనారోగ్యము లేని శరీరము కలవాడా. 

కీర్తన సంస్కృత , తెలుగు  పడికట్టు పదాల మేలు కలయికగా సాగుతూ అద్భుత శబ్ద సౌందర్యం తో ఆకట్టుకుంటుంది. ప్రతి పదంలో  స్వామి వారి భక్తి అణువణువునా ద్యోతక మవుతుంది. 

అనుబంధంలో  అలుగ వద్దననే విముఖులతో జేరబోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మనెనే అని చెప్పడం ఆత్మీయంగా అనిపిస్తుంది. 

శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతుల ఆలాపనలో సంగీత స్వయంభువు మంగళం పల్లి బాలమురళీకృష్ణ గారిది benchmark. 






శ్రీ సద్గురు త్యాగరాజ స్వామినే నమ:



Wednesday, March 18, 2020

మీరా లాగా పిలిస్తే భగవానుడు ఎందుకు రాడు - మియా కి మల్హర్ - కొన్ని సంగీత కబుర్లు.


Meera Bai is known as a mystic poet, staunch devotee of Lord Krishna of 15th century. So many anecdotes are available on her. Where fact ends and fiction takes over is difficult to say. She is an enigma.


మీరా బాయి జీవితం మనసా వాచా కర్మణా కృష్ణునికే అంకితం. కృష్ణుడే ఆమె సర్వస్వము . మీరా కృష్ణుడు వేరు కాదు. నీవే తప్ప ఇత: పరంబెఱుంగఁ  అని సర్వకాల సర్వావస్థలందూ భావన చేస్తుంది ఆమె. 


Meera Bhajans are a fountainhead of Bhakti. లతా మంగేష్కర్ గానం చేసిన మీరా భజనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. 

అందులో  మియా మల్హర్ లేదా miyan ki malhar అనే హిందూస్తానీ రాగం లో స్వర పరచ బడిన ఒక గీతం. 

మ్హారా రే గిరిధర్ గోపాల్  దూస్ రా నా కోయా - పాట బాణీ , లతాజీ high pitch లో పాడిన తీరు అద్భుతం. 

మియా మల్హర్ రాగం లో బోలె రే పపిహరా (గుడ్డీ చిత్రం- 1971- వసంత్ దేశాయి సంగీతం- వాణీ జయరాం గానం )  - A Golden classic song. this song is forever. 

ఈ పాట వల్ల మియా మల్హర్ రాగం ఎంతో ప్రాచుర్యం పొందింది.  1978 లో వచ్చిన మీరా బాయి చిత్రంలో వాణీ జయరాం గారు దాదాపు అన్ని పాటలు పాడారు. సంగీతం పండిట్ రవి శంకర్ జీ. 

లతాజీ గారు -వాణీ జయరాం గారు హిందీ సినిమాలలో పాడడాన్ని ఇష్టపడలేదని అప్పట్లో అనుకునేవారు. 

తెలుగు లో కూడా పెండ్యాల గారు ఒక పాట ను మియా మల్హర్   రాగంలో స్వర పరచినట్టు తెలుస్తుంది. 

అలకలు తీరిన కన్నులు ఏమనె  ప్రియా (మా నాన్న నిర్దోషి - సుశీల గారు - బాలు - పెండ్యాల- 1970) - హిందూ స్థాని రాగాన్ని అంత  అందంగా ఒక యుగళ గీతం కోసం మలచడం మహా సంగీత దర్శకులు పెండ్యాల గారికే చెల్లింది. 

కర్ణాటక సంగీతం లో సాహిత్యానికి, సంగీతానికి రెంటికీ పెద్ద పీట ఉంటుంది. కచేరి format అరిటాకు వేసి వడ్డించిన షడ్రసోపేతమైన విందులా ఉంటుంది.  కానీ ఒక్కో సారి ఎవరో తరుముతున్నట్లు వేగం గా పాడడం అవసరమా అనిపిస్తుంది. 

హిందూ స్థానీ సంగీతం లో శృతి కి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక చోట నిలబెట్టి పాడుతూ మెల్లిగా ధారలా జారుతుంది. వారికి రాగం ప్రధానం. సాహిత్యానికి రెండో స్థానమే. 

ద్రాక్ష పాకం నారికేళ పాకం పోలిక చెప్పవచ్చు. 

कौन कहते है भगवन आते नहीं , तुम मीरा के जैसे बुलाते नहीं అని ఇటీవలి కాలం లో విన్న ఒక పాట బాగుంటుంది.  

అందమైన,  నిజమైతే బాగుండు అనిపించే కల్పన , నిజాల చుట్టూ అల్లుకున్న అందమైన కల్పనలు ఇవి కూడా నిజాలే. నిజం కల్పనల మధ్య సరిహద్దు ఎప్పుడు చెరిగిపోయిందో ఇలాంటి పాటలు వింటే తెలియదు. 











Tuesday, March 3, 2020

వేగమే నను బ్రోచేవారెవరురా - ఎందుకే నీకింత తొందరా

ఖమాస్  రాగం పై కొన్ని సంగీత కబుర్లు :

కర్ణాటక సంగీతం లో అధికంగా జన్య రాగాలు కలిగిన / అతి పురాతన మైన  పెద్ద ముత్తయిదువ  రాగాలు.

1) కల్యాణి 2) శంకరాభరణం 3) హరి కాంభోజి 4) మాయా మాళవ గౌళ 5) ఖరహర ప్రియ 6) తోడి 7) భైరవి .( భైరవి రాగం అతి సనాతనమైన రాగం.) 

అందులో హరికాంభోజి జన్యమైన  ఖమాస్  రాగమంటే తెలుగు వారికి  ప్రీతి  ఎక్కువే. ఆర్తి ,ఆర్ద్రత , భక్తి భావాలు ఈ రాగం లో ధ్వనిస్తాయి. 

ఈ రాగం లో మిక్కిలి ప్రసిద్ధమైన " బ్రోచేవారెవరు రా" (మైసూరు వాసుదేవాచార్య కృతి) శంకరాభరణం సినిమా ద్వారా బహుళ ప్రజాదరణ పొందింది. 

ఖమాస్ రాగం లో నాకు బాగా ఇష్టమైన రెండు గీతాలు. 

(1) జి. బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన అన్నమయ్య గీతం

 'మెరుగు వంటిది అలమేలు మంగ'  

(పాట  గానం, సంగీతం, ధ్వని ముద్రణ మొదటి శ్రేణి లో ఉన్నాయి ఈ పాట లో)

(2)" పల్లవియే సరణం " (SP బాలు - S జానకి - ఇళయరాజా)

The trio SP బాలు - S జానకి - ఇళయరాజా weave magic in this beautiful song. 

సంగీత దృశ్య కావ్యం  'మల్లీశ్వరి' లోని "ఎందుకే నీకింత తొందర' పాట ను స్మరించకుండా ఖమాస్  రాగం పై కబుర్లు పూర్తి కావు. 

( రాజేశ్వర రావు - భానుమతి - దేవులపల్లి గారులు )

The genius of Rajeswara rao and Bhanumathi garu in bringing out the nuances and subtle variations of khamas ragam is evident in the song. 

Immortal lines from the song.

"బాధ లన్నీ పాత గాధలై  పోవునే 
వంతలన్నీ వెలుగు పుంతలో మాయునే "

ఒకవైపు   వేగమే నను బ్రోచేవారెవరురా .... 

మరోవైపు ఎందుకే నీకింత  తొందరా 

అని వింటూ ఉంటే నవ్వు వస్తుంది.