Wednesday, April 1, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-3 - జగదానంద కారక

సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ:
శ్రీ స్వామివారు అనుగ్రహించిన పంచ రత్నములలో పూర్తిగా సంస్కృతం లో వ్రాయబడి  'నాట' రాగం లో స్వరపరచబడిన 'జగదానంద కారక'  కీర్తన శ్రీరామ చంద్రునికి స్వామివారు సమర్పించిన సంగీత మకుటంలోని  ఇంద్రనీలమణి గా  భాసిల్లుతున్నది. 

పల్లవి 'జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయక' విన్నంతనే పట్టాభిషిక్తుడై  అయోధ్యాపుర వాసుల జయ జయ ధ్వానాలు అందుకుంటున్న , శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీరామ చంద్రుడు మనోనేత్రంపై సాక్షాత్కారం పొందిన అనిర్వచనీయమైన ఆనందం కలుగజేస్తుంది.

కృతి లో అత్యద్భుతమైన అమృతతుల్యమైన పద బంధాలు , భక్తిసాగరం లో ఓలలాడింపజేసే సమాసాలు ఆద్యంతం మేలిమి బంగారు హారంలో మణులవోలె పొదగబడ్డాయి. 

నాట రాగం 36 వ మేళకర్త రాగం 'చల నాట' జన్యం. నాట రాగం సహజాత 'గంభీర నాట రాగం'. ఆరోహణలో సంపూర్ణ, అవరోహణలో ఔడవ (ఐదు) స్వరాలు కలిగి ఉన్నది.  

నక రాగమైన చలనాట కంటే కూడా నాట రాగం ప్రాచుర్యం పొందింది. కచేరి ప్రారంభం లోనే నాట రాగ కృతి పాడడం  మంగళప్రదం గా భావించడం జరుగుతుంది. 

  
నాట రాగం లో ప్రసిద్ధి పొందిన కృతి శ్రీ  ముత్తుస్వామి దీక్షితుల వారి ' మహా గణపతిం మనసా స్మరామి' ఉన్నది.

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

పల్లవి : జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

అనుపల్లవి : గగనాధిప సత్కులజ ! రాజ రాజేశ్వర !

సుగుణాకర ! సురసేవ్య! భవ్య దాయక !
సదా సకల - జగదానంద కారకా

చ. 1 : అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణానఘ !  సుర సురభూజ !దధి పయోధి వాస హరణ! సుందరతర వదన! సుధామయ వచోబృంద ! గోవింద ! సానంద! మావరాజరాప్త శుభకరానేక (మా వర +అజర  + ఆప్త శుభకర) -

జగదానంద కారకా

చ. 2. నిగమ నీరజామృతజ పోషకానిమిశవైరి వారిద సమీరణ

ఖగ తురంగ సత్కవి హృదాలయాగణిత (హృదాలయ+  అగణిత) వానరాధిప నతాంఘ్రియుగ ! - జగదానంద కారకా

చ. 3. ఇంద్ర నీలమణి సన్నిభాపఘన (సన్నిభ+ అపఘన)   చంద్ర సూర్య నయనా ప్రమేయ (నయన + అప్రమేయ) వాగిన్ద్ర జనక ! సకలేశ! శుభ్ర !నాగేంద్ర శయన ! శమన వైరి సన్నుత - జగదానంద కారకా


చ.4. పాద విజిత మౌని శాప ! సవ పరిపాల ! వర మంత్ర

గ్రహణ లోల ! పరమ శాంత చిత్త ! జనకజాధిప! సరోజభవ !వరదాఖిల  -  జగదానంద కారకా

చ. 5. సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదాసమాన గాత్ర (ఫలద + అసమాన గాత్ర)! శచీపతి నుతాబ్ధి మద హరా (శచీపతి నుత +అబ్ధి మద హర)  అనురాగ రాగరాజిత కధాసార! హిత!

జగదానంద కారకా

చ. 6. సజ్జన మానసాబ్ధి సుధాకర ! కుసుమ విమాన !సురసారిపు కరాబ్జ లాలిత చరణావగుణాసురగణ మద హరణ !సనాతనాజనుత! (సనాతన + అజనుత)  - జగదానంద కారకా


చ. 7. ఓంకార పంజర కీర ! పుర హర, సరోజ భవ, కేశవాది రూప ! వాసవరిపు జనకాంతక ! కళాధర  కళాధరాప్త కరుణాకర శరణాగత జనపాలన సుమనోరమణ! నిర్వికార! నిగమ సారతర! జగదానంద కారకా


చ. 8. కరధృత శరజాలాసుర మదాపహరణావనీసుర సురావన కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత -  జగదానంద కారకా


చ. 9. పురాణ పురుష !నృవరాత్మజ ! ఆశ్రిత పరాధీన ! ఖర   విరాధ  రావణ విరావణ ! అనఘ ! పరాశర మనోహరావికృత ! త్యాగరాజ సన్నుత ! - జగదానంద కారకా


చ. 10 .అగణిత గుణ ! కనక చేల ! సాల విదళనారుణాభ సమాన చరణాపార మహిమాద్భుత సుకవిజన హృత్సదన ! సుర మునిగణ విదిత ! కలశనీర నిధిజా రమణ ! పాప గజ నృసింహ !వర త్యాగరాజాధినుత ! - జగదానంద కారకా


జయ జానకీ ప్రాణ నాయకా

జగదానంద కారకా

విశేషఅంశాలు :


 • గగనాధిప సత్కులజ - ఉత్తమమైన సూర్యవంశం లో జన్మించిన వాడు . 
 • అమర తారక నిచయ - దేవతలు అనే నక్షత్ర తతికి 
 • కుముద హిత పరిపూర్ణ - పూర్ణ చంద్రుని వంటివాడు. 
 • సుర సురభూజ - దేవతలకే కల్పవృక్షము వంటి వాడు. 
 • దధి పయోధి వాస హరణ - కృష్ణుడిగా పెరుగు, పాలు, గోపికల వస్త్రములు హరించినవాడు. 
 • మావరాజరాప్త శుభకర (మా వర +అజర  + ఆప్త శుభకర) - లక్ష్మీదేవి వల్లభుడు, నిత్య యవ్వనుడు, ఆప్తులకు శుభములు చేకూర్చువాడు) 
 • నిగమ నీరజామృతజ పోషక (వేదములు అనే పద్మములకు పోషణ నొసగే సూర్యుని వంటివాడు) 
 • అనిమిశవైరి వారిద సమీరణ (అనిమిషేయులు (ఱెప్పపాటు  లేనివారు) అయిన దేవతలకు శత్రువులైన రాక్షస మేఘాల పాలిటి సుడిగాలి వంటివాడు.)
 • వాగిన్ద్ర జనక - వాగధీశ్వరి శ్రీ సరస్వతి దేవి నాథుడైన బ్రహ్మ కు తండ్రి.  
 • శమన వైరి సన్నుత - కాలకాలుడైన పరమశివునిచే పూజింపబడువాడు. 
 • పాద విజిత మౌని శాప - పాద స్పర్శచే అహల్యాదేవి శాపము బాపినవాడు. 
 • సవ పరి పాల - కౌశికు యాగము కాచిన వాడు.  
 • నురాగ రాగరాజిత కధాసార - ప్రేమానురాగాలకు ప్రతిరూపమైన రామాయణ కథకు  సారభూతుడు. 
 • సురసారిపు కరాబ్జ లాలిత చరణా - సురస అనే రాక్షసిని సంహరించిన ఆంజనేయ స్వామిచే పూజించబడువాడు. 
 • సనాతనాజనుత - (సనాతనుడు, అజ (బ్రహ్మ) నుతుడు. )
 • ఓంకార పంజర కీర - ఓంకార పంజరము లోని  శుకుడు.
 • వాసవరిపు జనకాంతక - ఇంద్రజిత్తు తండ్రి అయిన రావణుని అంతము చేసినవాడు. 
 • కళాధర  కళాధరాప్త - షోడశ కళాధరుడైన చంద్రుడి కళను ధరించిన వాడు అయిన శివుడికి ఆప్తుడు.   
 • అవనీసుర సురావన - భూసురులు , దేవతలను కాపాడు వాడు. 
 • కవీన బిలజ మౌని - కవిసూర్యుడు, వాల్మీకి మహర్షి 
 • సాల విదళన - ఏడు సాల చెట్లను ఒక్క బాణముతో  కూల్చిన వాడు
 •  కలశనీర నిధిజా రమణ - క్షీరాబ్ధి కన్యక యైన శ్రీ మహాలక్ష్మి నాథుడు. 
 •  పాప గజ నృసింహ - మదగజపు పరిమాణం గల పాపపు రాశి పాలిట నరసింహుడు. 
ఈ కీర్తనలో  స్వామివారి నోట అమృతధార లాగ జాలువారిన  ఒక్కొక్క పదం  తారక మంత్రమై  శ్రీరామ చంద్రుని భక్తి సామ్రాజ్యంలో   పుష్పాభిషేకం చేసిన అనుభూతి కలుగిస్తుంది. 

ఈ కీర్తన చెవాలియార్ బాలమురళి గళములో  


శ్రీ శార్వరి నామ సంవత్సర శ్రీరామ నవమి సందర్భంగా 'జగదానంద కారకుని జయ జానకీ నాయకుని' స్మరించుకోవడం  పరమానంద దాయకం. 

శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి | 


శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే | | 
2 comments:


 1. నాలుగో కీర్తనకోసం ఎదురు చూపు

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా sir. త్వరలోనే పోస్ట్ చేస్తాను.

   Delete