Friday, December 30, 2022

నారాయణ తీర్థులు - శ్రీ కృష్ణ లీలా తరంగిణి


నారాయణ తీర్థుల వారి కృష్ణ లీలా తరంగిణి పుస్తకము (వావిళ్ళ వారి ప్రచురణ) పుస్తక ప్రదర్శన ఉత్సవంలో లభించినది.  ఆంధ్ర తాత్పర్య సహితము. 

త్యాగరాజు - అన్నమయ్య - రామదాసు - నారాయణ తీర్థులు - సదా శివ బ్రహ్మేంద్ర స్వామి - క్షేత్రయ్య ....

ఎంతటి మహనీయులు వారు ? ఎటువంటి గొప్ప అనుభూతి తో, భక్తితో సంగీత సాహిత్య సృష్టి చేశారు. 

వారు మనకు అందించిన అమూల్య సంపదను భక్తితో కాపాడుతూ, కొనసాగిస్తూ వస్తున్న వారి శిష్య ప్రశిష్యులు, రస హృదయులు, మహారాజ పోషకులు - ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.🙏🙏🙏

ఈ పుస్తకము నుంచి కొన్ని విశేషములు.

కృష్ణ భక్తాగ్రేసరులలో నారాయణ తీర్థుల వారిది ఉన్నత స్థానము . మాధవానలుడను వైష్ణవుడు వెనుకటికి బిల్హణుడు గా, లీలా శుకుడు గా, జయదేవుడు గా నవతరించి చివరికి నారాయణ తీర్థులుగ నుదయించి ముక్తి చెందిరి. వీరు కాశీ క్షేత్రము లో గంగా తీరమున బహు కాలము నివసించి బ్రహ్మ విద్యా ప్రచారము గావించిరి. తదుపరి దక్షిణ దేశమును చేరి 1745 వ సంవత్సరములో కావేరీ తీరమునందు ఒక గ్రామమున సిద్ధిపొందిరి. వారు డెబ్బది సంవత్సరములు జీవించిరి అని యూహ చేయబడుచున్నది. 

శ్రీ కృష్ణ లీలా తరంగిణి సంస్కృత భాష లో వ్రాయబడిన సంగీత రూప కావ్యము. భాగవతమున ద్వాదశ స్కంధములు యున్నట్లే ఈ కావ్యమున పన్నెండు తరంగములు కలవు. కృష్ణుని లీలలు తరంగముల వలె సుందర లలిత మృదు మధుర పదముల తో వర్ణింప బడుటచే శ్రీ కృష్ణ లీలా తరంగిణి యను కావ్య నామము ఎంతైన సార్థకము యగుచున్నది.

జయదేవుని గీత గోవిందము శృంగార రస ప్రధానము కాగా కృష్ణ లీలా తరంగిణి కావ్యము భక్తి రస ప్రధానముగా నిర్మించబడినది.

నారాయణ తీర్థులు ఆంధ్రులు. తల్లావజ్ఝల వంశము. వీరి పూర్వాశ్రమ నామము గోవింద శాస్త్రి. గుంటూరు సీమ లోని కాజ గ్రామ వాసులు అని యూహించిరి.

వీరి కృతులలో నారాయణ తీర్థ ముద్రను చూపినారు.

గీత గోవిందము, శ్రీ కృష్ణ కర్ణామృతము, శ్రీ కృష్ణ లీలా తరంగిణి -- ఈ మూడు కావ్యములు కృష్ణ భక్తి సాహిత్యము లో అత్యుత్తమ రచనలు గా ప్రసిద్ధి పొందినవి.

ఈ కావ్యము యొక్క  ప్రథమ తరంగము కృష్ణుని జనన వృత్తాంతము తో ప్రారంభించి కృష్ణుని బాల్యము, లీలలు, గోవర్ధనోద్ధారము, రాస క్రీడ, అక్రూర వృత్తాంతము, కంస వధము, ద్వాదశ తరంగమున రుక్మిణీ కల్యాణముతో పూర్ణమవుతున్నది. కావ్యము అంతయు రమణీయ వర్ణనలతో, అత్యంత మనోహరముగా నిర్మింప బడినది.

ఈ కావ్యము లోని శబ్ద సౌందర్యము , భావ వైచిత్రి, పరమాత్మ తత్త్వ నిరూపణము, భక్తి పారమ్యము లను వర్ణించుట కంటే అనుభూతి చెందుట ఆనంద దాయకముగా తోచును. 

---------

ఒక ప్రసిద్ధ తరంగము. రాగము. ముఖారి. ఆది తాళము.

పల్లవి. 

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

అనుపల్లవి.

కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా

బాలకృష్ణం కలయ సఖి సుందరం

చరణములు.

1. నృత్యంతమిహ ముహురత్యంత మపరిమిత భృత్యానుకూలం  అఖిలసత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

2. ధీరం భవజలధిపారం సకలవేదసారం సమస్తయోగితారం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

3. శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరీ ఖేల సంగం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

4.రామేణ జగదభి రామేణ బలభద్రరామేణ సహావాప్త కామేన సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

5. రాధారుణాధర సుధాపం సచ్చిదానందరూపం జగత్త్రయ భూపం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

6.దామోదరమఖిల కామాకరం         ఘన శ్యామాకృతిమసుర భీమం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

7.అర్థం శిధిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థ పరమపురుషార్థం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

-----------

తాత్పర్యము ఇచ్చిన తీరు :

ఓ చెలీ సుందరాకారుడగు నా బాలకృష్ణుని జూడుము.

సకల లోకములకు గారణ భూతుడైనను, రాక్షసులకు శత్రువగు శ్రీమన్నారాయణుడయ్యును, విషయము లందు ఇచ్ఛ లేని వాడయ్యును, బాలుని వలె నటించు చున్నాడు.

----------

షష్ఠ, సప్తమ, అష్టమ తరంగములలో గోపికలు, కృష్ణుడు, రాధా దేవి  జరిపిన సంభాషణలు, రాసక్రీడ అత్యంత రమణీయంగా కృతుల రూపంలో కూర్చబడినవి. గోపికా బృందమునకు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమును గురించి సగుణ బ్రహ్మ రూపముగా కృష్ణుడు చేసిన యుపదేశములు, యథార్థమును గ్రహించి వారు చేసిన స్తుతులు,   ఈ తరంగములకు ఆంధ్రము నందు ఇచ్చిన తాత్పర్యము, వ్యాఖ్య  ద్వైత అద్వైతముల సమన్వయము, వివిధములుగా కనిపించే ఒకే పరమ సత్యమును అద్భుతంగా  ఆవిష్కరించినది. 

ఆద్యంతమూ శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడే యను నుత్తమాశయము పోషింపబడినది. 

-------

కృష్ణం కలయ సఖి సుందరం, 

నీల మేఘ శరీర, 

ఆలోకయే శ్రీ  బాలకృష్ణం, 

గోవర్ధన గిరిధర గోవింద,

బాల గోపాల కృష్ణ పాహి,

ఏహి ముదం కృష్ణ దేహి,

జయ జయ దుర్గే జితవైరి వర్గే 

---------

ఇత్యాది తరంగములు బహుళ ప్రచారము పొందినవి.

ఈ తరంగములు పాడుకొనుటకే గాక నృత్య రూపకములకు కూడా అనువుగా ఉన్నవి. ఈ గ్రంథమును పరిశీలనాత్మక దృష్టితో చదివి అందలి సారమును గ్రహించవలసి ఉన్నది.

కృష్ణం కలయ సఖి సుందరం - తరంగం

నీల మేఘ శరీర - కూచిపూడి నృత్యం

శ్రీ వేంకటేశ్వర భక్తి ప్రసార వాహిని వారు ప్రతి వారం ఒక కృష్ణ లీలా తరంగమును శిక్షణా పూర్వకమైన కార్యక్రమం ద్వారా ప్రసారం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం.

కృష్ణం వందే జగద్గురుమ్.

వందే పరమానంద మాధవం.

🙏🙏🙏









4 comments:

  1. కృష్ణలీలాతరంగిణి గురించి వ్రాసారు. చాలా సంతోషం. రెండు ముఖ్యమైన మాటలు. మొదటిది. మీరు టపాలోని తరంగం కొంచెం శ్రధ్ధగా తప్పులు దిద్దుకోవలసింది. ఉదాహరణకు ధీరం భవజలధిపారం అని ఉండాలి. రెండవది. నారాయణ తీర్ధుల వారి గృహస్థనామధేయం తల్లావజ్ఝల గోవిందశాస్త్రి గారు. వారు ఆంధ్రులు గుంటూరు సీమ వారు. ఈవిషయాలు మీరు టపాలో చెప్తే ఇంకొంచెం బాగా ఉండేది. అన్నట్లు ఈకృష్ణలీలాతరంగిణి ఎప్పుడూ‌ నా ఎదురుగా టేబుల్ మీదే ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. వావిళ్ళ వారి ప్రచురణ లో ధరం అని ఉన్నది. అయితే తాత్పర్యం లో ధైర్య వంతుడు అని ఉన్నది. ధీరం అని సరి చేస్తాను.

      నారాయణ తీర్థుల వారి పూర్వాశ్రమ నామం స్వగ్రామం విషయం పోస్టులో వ్రాశాను . అయితే పోస్టు మధ్యలో ఉన్నందువలన మీరు గమనించలేదు సర్.

      Delete
    2. నాదగ్గర ఉన్నది కూడా వావిళ్ళవారి ముద్రణయే. 1996 నాటిది. ఈతరంగం అందులో 59 - 60వ పేజీల్లో ఉంది. పాఠంలో ధీరం అనే ఉందండి. ధీరం అన్న పదానికి వారు మిగుల దైర్యవంతుడు అనే తాత్పర్యమే చెప్పారు. ఒక గమనించవలసిన విషయం ఏమిటంటే వావిళ్ళవారి ముద్రణలో ప్రతిపాదాన్ని యతిస్థానంలో విరచి అక్కడ ఎక్కువ స్పేసింగ్ ఇచ్చి పాఠం అంతా రెండు కాలమ్స్‌గా వచ్చేటట్లుగా ముద్రించారు. మీరు తీర్ధులవారు పూర్వాశ్రమస్వగ్రామాదులు ప్రస్తావించినది నేను సరిగా గమనించలేదు. క్షంతవ్యుడను.

      Delete