Sunday, February 12, 2023

మును తపమేమి జేసెనో - యదుకుల కాంభోజి రాగం - కొన్ని సంగీత ముచ్చట్లు

శ్రీరామ జయ రామ అన్న త్యాగరాజ స్వామి సంప్రదాయ కీర్తన సుమధురం. సుప్రసిద్ధం. సులభ గ్రాహ్యం. అత్యంత మనోహరం. భక్తి భావ భరితం. యదుకుల కాంభోజి రాగ స్వరీకృతం.

ఈ కీర్తన లోని భావ ప్రకటనా రీతి (idiom) తెలుగు వారికి మాత్రమే పూర్తిగా అవగత మవుతుంది అనిపిస్తుంది.   శ్రీమద్రామాయణం లోని హృద్యమైన సన్నివేశాలు  కళ్లముందు ఒక్కసారి కదలాడుతాయి. శుద్ధ సత్వ గుణం అక్షర రూపం దాల్చి ప్రకటితమయిన భావన కలుగుతుంది.  సాహిత్యం చదివినా లేక పాట విన్నా కూడా మాటల్లో చెప్పలేని మధుర భావం ముప్పిరి గొంటుంది. అది అనుభవైక వేద్యం మాత్రమే.

-----------

పల్లవి :

శ్రీరామ జయరామ శృంగార రామ యని చింతింపరాదే ఓ మనసా

చరణం :

1. తళుకు జెక్కుల ముద్దుబెట్ట కౌసల్య మును తపమేమి జేసెనో కౌసల్య

తపమేమి చేసెనో తెలియ

2. దశరథుడు శ్రీరామ రారా యనుచు పిల్వ మును  తపమేమి జేసెనో దశరథుడు 

తపమేమి చేసెనో తెలియ

3. తనివార పరిచర్య జేయ సౌమిత్రి మును తపమేమి చేసెనో సౌమిత్రి 

తపమేమి చేసెనో తెలియ

4. తన వెంట చన జూచి యుప్పొంగ కౌశికుడు తపమేమి చేసెనో కౌశికుడు 

తపమేమి చేసెనో తెలియా

5. తాపంబణగి రూపవతియౌట కహల్య తపమేమి చేసెనో అహల్య 

తపమేమి చేసెనో తెలియ.

6. తన తనయ నొసగి కనులార గన జనకుండు తపమేమి జేసెనో జనకుండు తపమేమి జేసెనో తెలియ

7. దహరంబు కరగ కరము బట్ట జానకి తపమేమి చేసెనో జానకి 

తపమేమి చేసెనో తెలియ

8. త్యాగరాజాప్తాయని పొగడ నారదమౌని తపమేమి చేసెనో ఆ మౌని 

తపమేమి చేసెనో తెలియ

శ్రీరామ జయరామ శృంగార రామయని చింతింపరాదే ఓ మనసా

------- ప్రముఖ గాయని పంతుల రమ గారు భావయుక్తంగా పాడారు.

-----------

యదుకుల కాంభోజి రాగం లఘు చరణాలలో  మధుర భక్తి భావన ప్రకటనకు మిక్కిలి అనువైన రాగం.

ఈ రాగం లో ఘంటసాల గారు పాడిన అద్భుత భక్తి గీతం శేషాద్రి శిఖరాన 

-----------

శేషాద్రి శిఖరాన, స్థిరముగ వెలసిన

శ్రీ వేంకటేశ్వర ప్రభో పాలయశ్రీవేంకటేశ్వరా

శంఖ చక్రముల చెరియొక్క చేతనుసొంపుగా పట్టితివా ప్రభో శ్రీశా

వరద ముద్రను బూని, యూరువున కేలుంచి

ఒయ్యార మొలికింతువా ప్రభో శ్రీశా

తిరుమోము నందున శ్రీపాదరేణువునా 

తిరునామముంచితివా ప్రభో శ్రీశా

వజ్రాంగి కవచము, వయ్యారముగ దొడిగి తోమాల వైచీతివా, ప్రభో శ్రీశా

ఉరమునా యిరువంక, శ్రీదేవి, భూదేవి

రయ చెన్నెలరింతువా ప్రభో శ్రీశా

పద్మావతీ రమణ పాలింపవే నన్నుపాదాల నెర నమ్మితీ ప్రభో శ్రీశా

-----------

ఘంటసాల గారి అమృత తుల్య గాత్రం లో ఈ పాట తెలుగు వారి ప్రతి ఇంట పలుకుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి రూపం కనులముందు ప్రత్యక్ష మవుతుంది.

త్యాగరాజ స్వామి కృతి నుంచి స్ఫూర్తి పొంది నట్లుగా స్వరాభిషేకం అనే   కె. విశ్వ నాథ్ గారి చిత్రం లో 

----------

అనుజుడై లక్ష్మణుడు అన్నా యనుచు బిలువ తపమేమి జేసెనొ ఈ రామయ్య 

అగ్రజుడు రాఘవుడు తమ్ముడా యనుచు బిలువ తపమేమి జేసెనో లక్ష్మణుడు

-------------

అన్న మంచి పాట వచ్చింది. కల్యాణి రాగం లో ఈ పాటకు విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు. వేటూరి సాహిత్యం. కె జే. జేసుదాసు, ఎస్పీ బాలు గారు అద్భుతంగా పాడారు.

అలాగే ఈ రాగం లోని భద్రాచల రామదాసు కీర్తన సీతమ్మకు జేయిస్తి చింతాకు పతకము రామచంద్ర పాట అంటే తెలుగువారికి ఆరో ప్రాణం. బాల మురళి గాత్రం లో ఆ పాట వినడం అంటే అరిటాకులో పండుగ భోజనం చేసినంత ఆనందం. యదుకుల కాంభోజి రాగం తెలుగువారికి స్వంతం అని చెప్పడం అతిశయోక్తి కానేరదు.

🙏🙏🙏


1 comment:

  1. చాలా బాగా విశదీకరించారు. చక్కగా,హాయిగా,అర్ధమయ్యింది.ధన్యవాదాలు.

    ReplyDelete