ఆకాశం అద్దుకున్న నీలం
ఆత్మ చుట్టుకున్న చేలం
నిన్నటి లోయలోకి జారిపోతూ
రేపటి ఊబిలో కూరుకు పోతూ
ఇప్పటి క్షణం ఆవిరవుతుంది.
ఘటం ఘనంగా పలుకుతుంది
మృత్తిక మౌనంగా ఉంటుంది.
ఎగసి ఎగసి అలసి సొలసి
కడలి ఒడిని అల సేద తీరుతుంది.
అద్దంలో నగరపు తళుకులు
స్వప్నంలో మెరుపుల మరకలు
సప్త వర్ణమయ దీప కాంతిలో
రంగురాళ్ల జిలుగు తెల్లబోతుంది.
జ్యోతి వెలుగులో రజ్జువును చూసి
భ్రాంతి సర్పం చల్లగా జారుకుంటుంది.
దేహాభిమానం దగ్ధమైతే
మరణం మహోత్సవం అవుతుంది.
మట్టి బండి లో మహాయాత్ర
ముగిసి పోతుంది.
(బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి అద్వైత బోధల స్ఫూర్తితో )
baavuni advaitha spurthi.
ReplyDelete