Saturday, October 10, 2020

పాశ్చాత్య దేశపు సనాతన ధర్మయోగి - Dr. David Frawley - ( పండిత్ వామదేవ శాస్త్రి ) & Other Western Sadhakas.


కొంతమంది గొప్ప సనాతన ధర్మ యోగులు సాధకులు జన్మత: పాశ్చాత్త్యులైనా   భారత దేశం వైపుకు సహజంగా ఆకర్షించబడి  దశాబ్దాల కాలంగా  సాధన చేస్తున్నారు. వారి జీవితం, వారి ధర్మ నిరతి, సనాతన ధర్మం పట్ల వారి నిబద్ధత, హిందువులపై వారికి ఉన్న ప్రేమ సానుభూతి చాలా గొప్పవి. 

అటువంటి ఆధునిక యోగులలో Dr. David Frawley - ( పండిత్  వామదేవ శాస్త్రి ) గారు ముఖ్యులు. 

ఆయన 1950 లో అమెరికా లో జన్మించారు. బాల్యం నుండే ఆధ్యాత్మికత వైపు ఆకర్షించబడి క్రైస్తవం , కమ్మ్యునిజం , బౌద్ధం, హైందవం .. అన్ని మతాలు ప్రతిపాదించిన సిద్ధాంతాలను  బాగా  పరిశోధించారు. 

జీవుడు, జగత్తు, దేవుడు, మోక్షము, బంధము - వివిధ  మతాలు  ఈ ఐదింటి గురించి  ఏమి ప్రతిపాదిస్తున్నాయి అన్న విషయాన్ని తులనాత్మక అధ్యయనం చేశారు. వారు నిష్పాక్షిక పరిశోధన, సాధన చేసి సనాతన ధర్మం గొప్పతనాన్ని నిర్ద్వంద్వము గా ప్రకటించారు. 

Dr. David Frawley గారు సనాతన ధర్మం ప్రతిపాదించిన   మహా వాక్యాలు - ప్రజ్ఞానం బ్రహ్మ , అయం ఆత్మా బ్రహ్మ , తత్ త్వం అసి , అహం బ్రహ్మా అస్మి - త్రికరణ శుద్ధి గా నమ్మి సాధన చేస్తున్నారు. వేదాలు,  వేదాంగాలు,ఉపనిషత్తులు, శాస్త్ర పురాణాలు, క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆయుర్వేదం పై పరిశోధనలు చేస్తున్నారు. అమెరికాలో వేద మత వ్యాప్తికై విశేష కృషి చేస్తున్నారు. భారత ప్రభుతం చేత పద్మ భూషణ్ అవార్డు పొందారు. (2015). 

A few other prominent western followers of Sanatana Dharma.

  • Smt. Maria Wirth is a German national who is settled in India for the past 38 years and dedicated to the cause of Sanatana Dharma. వారి బ్లాగు లో సరళమైన భాష లో చక్కని వ్యాసాలు  వ్రాస్తున్నారు. 

  • Sri Francois Gautier - A French National Journalist who has settled in India and supporting Hinduism through his talks, writings, exhibitions. 

  • బెల్జియం దేశస్థులైన   Sri  Koenraad Elst - An eminent research scholar in Indic studies and great Historian. He has dedicated his life to debunk the deliberate false history created by leftist anti Hindu distorians -  Romila Thapar  Irfan Habib etc.. 

India and Hindus are indebted to the above eminent sadhakas who have dedicated their lives for defending and spread of Sanatana Dharma. They firmly believe that Sanatana Dharma is the truly pluralistic Dharma which shows the right path for the well being of all living and non living things.

The book ' How I became a Hindu' by Dr.David Frawley chronicles his spiritual journey. This is a very interesting book and gives deep insight into the sincerity and dedication of Dr. Frawley as a Sadhaka.
It is available as download in the net. తప్పక చదవ వలసిన పుస్తకం. 

The book 'Thank you India' by Smt. Maria Wirth is also a very honest book which captures her amazing spiritual journey in India.

We become wonderstruck at the perseverance and painstaking sadhana of the above true followers of Sanatana Dharma. They totally reject the parochial exclusivist religions. 

I regularly follow their writings  through Social Media like Youtube and Twitter.

  ఇతర సాధకులను అవహేళన చేసే వారి గురించి , అటువంటి వారిని ఉద్దేశించి   Dr. David Frawley గారు వ్రాసిన కొన్ని వాక్యాలు .. 
Some Hindus who uncritically fancied themselves
spiritual or enlightened dispensed with human
decency along the way. They indulged in negative
gossip and sought to defame their competition,
even their students who might stand on their own.
It is easy to turn oneself into a guru and then place
one’s behavior beyond scrutiny, focusing on the
faults of others rather than on improving oneself.
But the true Hindu way is one of self-introspection
in which we examine our own faults before casting
a critical eye on others. And it is not the personality
of the other that we should find fault with but
wrong doctrines that distort the soul, which is
good, divine and wonderful in all creatures.


అనేకమంది హిందువులలో సనాతన ధర్మం పట్ల తిరస్కార భావం, ఉదాసీనత ; అన్య సంకుచిత మతాల  మిషనరీలు, ఉగ్రవాదులు, వామపక్ష కుహనా మేధావులు, వక్ర చరిత్ర కారులు హైందవ సమాజానికి, సనాతన ధర్మానికి చేస్తున్న హాని గురించి Dr. David Frawley గారు ఎంతో ఆవేదన చెందుతారు. సనాతన ధర్మం సకల మానవాళికి ఆచరణీయమైన మార్గం అని చాటి చెబుతున్న Dr. David Frawley గారికి ఇతర పాశ్చాత్య దేశ సాధకులకు ప్రణామాలు. ఈ మహనీయుల రచనల ద్వారా, ప్రసంగాలు వినడం ద్వారా భారతీయులకు ఎంతో  మేలు జరుగుతుంది. వారికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి .  🙏🙏🙏



 

Saturday, September 26, 2020

పాటల పల్లకీ లో ఊరేగిన చిరుగాలి - కంటికి కనపడవే నిన్నెక్కడ వెదకాలి '

బాలు గారి ఆకస్మిక  నిష్క్రమణం అభిమానులను కలత పెట్టింది.  కనీసం మరో పదేళ్లు ఉత్సాహం గా పాడగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయనను ప్రతి రోజూ ఏదో ఒక చానెల్ లో చూస్తూ  వినడం అందరికీ జీవితం లో ఒక భాగం అయిపొయింది . ఉల్లాసం, ఉత్సాహం, సంస్కారం, నుడికారం, మాధుర్యం అనే పదాలకు చిరునామా ఆయన ఇక లేరు అంటే ఒప్పు కోలేము. 

Maybe he is the last of the great play back singers. ఆయన తరువాత నేపథ్య గాయకులు లేరని కాదు.  ఎందరో పాడు తున్నారు కానీ ఆనాటి పాటల ఆ గాయకుల  స్థాయి ఇప్పుడు లేదు అన్నది సత్యం. 

ఘంటసాల, కిశోర్ కుమార్, రఫీ, లతా మంగేష్కర్, ఆశా భోస్లే, ముఖేశ్ , జేసుదాసు, సుశీల, జానకి. ఈ మహా నేపథ్య  గాయకుల వరుస లో చివరి తరం వ్యక్తి  S P  బాలసుబ్రహ్మణ్యం . ఈ  స్థాయి మరెవరూ అందుకోలేరు.  ఆ సినీ సంగీత వైభవం పొందే గాయకులూ, ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. 

SPB గొప్ప స్థానం చేరుకోవడానికి కొన్ని అంశాలు. 

  • 1) జన్మత : ఉన్న ప్రతిభ. 
  • 2) లక్ష్య సాధన  కోసం తీవ్రంగా శ్రమించే గుణం  
  • 3) తనను తాను  మెరుగు పరచుకునే తత్త్వం
  • 4) అవకాశం అంది పుచ్చుకునే  గుణం
  • 5) మంచి మానవ సంబంధాలు నెరపడం 
  • 6) స్నేహ పూర్వక నడవడిక 
  • 7)  సినీ  రంగం లో  1970 - 2010 వరకు  ఉన్న పరిస్థితులు
  • 8) తమిళ, తెలుగు, కన్నడం, మళయాళ సినీ పరిశ్రమ మద్రాసు లో ఉండడం
  • 9) తనకు వెన్నంటి నిలిచిన సంగీత దర్శకులు, నటులు, దర్శక నిర్మాతలు 
  • 10) సినీ రంగం తో పాటు టీవీ రంగం లోకి సరైన వేదిక ద్వారా ప్రవేశం
  • 11) కొంత chutzpah 
  • 12) అన్నిటితో పాటు 'దైవ బలం'. 
He was destined to achieve great success. 

చిరకాల మిత్రుడు ఇళయరాజా తో 2019 లో  విభేదాలు రావడం ఆయనను బాధ పెట్టింది. అయితే ఈ ఏడాది ఆ మనస్పర్థలు తొలగి పోయి ఇద్దరు మరల కలిసి పోవడంతో అభిమానులు  సంతోషించారు.  

అవి అలాగే ఈ నాటికి  కొనసాగి ఉంటే ఇళయరాజా ను అది జీవితాంతం కలచి వేసేది.  

career ఆరంభం లో పీల గా ఉన్న గొంతును మృదుత్వం , గాంభీర్యం ల మేలు కలయిక గా ఆయన మలచుకున్న తీరు అనితర సాధ్యం.  అన్ని వేల పాటలు పాడటం అనేది ప్రపంచ చరిత్ర లోనే ఒక మహా అద్భుతం. 

SPB Sir, P Susheelamma, S. Janaki Amma - They are true legends. We are indeed fortunate to have born in their era.

 బాలు గారు 'భారత రత్న' పురస్కారానికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి. ఈ విషయం లో వెంకయ్య నాయుడు గారు చొరవ చూపించి బాలు గారికి ఈ సంవత్సరం 'భారత రత్న' అవార్డు తో గౌరవించాలి. 

ఒక రెండు పాటలను గుర్తు చేసుకుంటాను. అవి ఎన్ని సార్లయినా వినవచ్చు. 

1) ' నలివ గులాబి  హూవె ' - పాట (Kannada movie auto raja 1980)

2) '  పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి '   - పాట ( నువ్వు వస్తావని చిత్రం 2000)

SPB Sir, You are inseparable part in the lives of millions of fans. . You are forever Sir. ఆ స్వచ్ఛమైన నగుమోము ఎన్నటికీ  మరచి పోలేము  నీకూ మరణం ఉన్నదని చెబితే ఎలా నమ్మేది. అనుకొని ఎలా బ్రతికేది. 🙏🙏🙏





Friday, August 7, 2020

కుంతల వరాళి థ్రిల్లానా - బాలమురళి - సెమ్మంగూడి - సంగీత కబుర్లు

Semmangudi Srinivasa Iyer
    

బాలమురళి గారు స్వరపరచిన తిల్లానాలు అనితర సాధ్యం. అమిత ప్రాచుర్యం పొందాయి. శ్రోతల చేత   'థ్రిల్లానా'లు గా పేరు గడించాయి.

వాటిలో కుంతల వరాళి తిల్లానా మరింత ప్రియమైనది. The genius of balamurali Garu is displayed in this beautiful composition. 

బాలమురళి గారి మద్రాసు సంగీత ప్రస్థానం లో ఒక unsavoury incident ఉంది. 

వారు గణపతి, మహతి, లవంగి ... ఇత్యాది కొత్త రాగాలను కనుగొన్నారు. అవి కర్ణాటక సంగీత విద్వాంసుల చేత ఆమోదించ బడ్డాయి.

అయితే ఎస్. బాలచందర్ అనే ఒక వైణికుడు  కొత్త రాగాల సృష్టి సమ్మతం కాదు అంటూ బాలమురళి తో వివాదానికి దిగాడు. 

బాలమురళి కొంత సంప్రదాయ పరిధి దాటి చేసిన ప్రయోగాలు కూడా పరమ  సాంప్రదాయ వాదులైన సెమ్మంగూడి శ్రీనివాస అయ్యర్  వంటి వారికి నచ్చలేదు. ఈ నవ రాగ సృజన  వివాదం పెద్దదై కోర్టు దాకా వెళ్లిందని అందులో బాలమురళి గారికి అనుకూలంగా నిర్ణయం వచ్చిందని  బాలమురళి గారి శిష్యులైన శ్రీ బాలకృష్ణ శాస్త్రి గారు చెప్పారు.

బాల చందర్ అసూయ తో బాలమురళి గారిపై అనవసర వివాదం కల్పించాడు అని వారు చెప్పారు. ఈ బాల చందర్ సెమ్మంగుడి గారి తో కూడా స్వాతి తిరుణాల్ మహారాజు కృతుల విషయం లో విభేదించాడు. 

అయితే బాలమురళి గారికి కర్ణాటక సంగీతములో మేరు నగ సమానులైన సెమ్మంగూడి గారంటే అపార గౌరవం భక్తి భావం కూడా ఉన్నాయి. ఈ వివాదం  విషయం లో వారు నొచ్చుకో కూడదని బాలమురళి గారు సెమ్మంగూడి గారి ఇంటికి వెళ్లి వారికి  కొత్త బట్టలు పెట్టి పాదాభివందనం చేశారు  సెమ్మంగూడి గారి ఇంటిలో భోజన ఆతిథ్యం స్వీకరించారు. ఆ సందర్భంలో సెమ్మంగూడి గారి కుటుంబ సభ్యులు  బాలమురళి గారిచే కుంతల వరాళి తిల్లానా పాడించుకొని ఆనందించారు అని శాస్త్రి గారు చెప్పారు. 

కొన్ని కచేరీలలో సెమ్మంగూడి గారికి బాలమురళి గారు వయొలిన్ పక్క వాద్యం కూడా వాయించారు.

Puritans like Semmangudi, Madurai Mani Iyer, Ariyakudi, KV Narayana Swamy etc. don't like to swerve from the traditional classical carnatic music format. Balamurali garu was more prone to experimentation. He was open to all forms of music including semi classical, light music, film music etc.  The ego clash between conservatives and liberals is inevitable. At the same time everyone used to respect the others. All are giants in their own right.


ఈ కుంతల వరాళి రాగం హరికాంభోజి జన్యము. 

స్వాతి తిరునాళ్ కృత ' భోగీంద్ర శాయినం '  ఎమ్మెస్ అమ్మ  గారి గాత్రం లో.  సంస్కృత కీర్తనల ఉచ్చారణలో ఎమ్మెస్ అమ్మ గారు అందరికీ ఆదర్శం. 

ఈ రాగం లో ' ఆది దైవమా జోహారు ' అనే పాట భక్తి రంజని లో వినిపించేది. 

ఒక తమిళ సినీ గీతం ఈ రాగం లో  MSV  సంగీతం లో ఉన్నది . మంచి పాట. (జయచంద్రన్ - ఎస్ జానకి అమ్మ )

 సంగీత కబుర్లు స్వస్తి. 🐇🐘🐘

Saturday, May 2, 2020

సినారె గారి సినీ గీత సాహిత్య సౌరభం





జ్ఞానపీఠ గ్రహీత మహా కవి డా.  సి. నారాయణ రెడ్డి  గారు రచించిన అభినందన మందారమాల పాట  ఒక మధుర  గీతం.  ఈ పాట పల్లవిలో ఉపయోగించిన సంస్కృత పదాలు చరణాలలో వినిపించే అచ్చ తెనుఁగు పదాలు వినసొంపుగా ఉన్నాయి .రాజేశ్వరరావు గారు  చక్కని బాణీ,  సుశీలమ్మ, జేసుదాసు గారి గానం, మంచి చిత్రీకరణ కలిసిన గీతం ఇది. 


చిత్రం : తాండ్రపాపారాయుడు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : కె.జె.జేసుదాస్, పి.సుశీల


పల్లవి :
అభినందన మందారమాల... (3)
అధినాయక స్వాగతవేళ...
అభినందన మందారమాల
స్త్రీ జాతికీ ఏనాటికీ స్మరణీయ మహనీయ వీరాగ్రణికి
అభినందన మందారమాల...
అధినాయక స్వాగతవేళ...
అభినందన మందారమాల


చరణం : 1
వేయి వేణువులు నిన్నే పిలువగ
నీ పిలుపు నావైపు పయనించెనా॥
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా (2)
నీ చూపు నా రూపు వరియించెనా
నా గుండెపై నీవుండగా...
దివి తానే భువిపైన దిగివచ్చెనా
అభినందన మందారమాల...
అలివేణీ స్వాగతవేళ...
అభినందన మందారమాల
సౌందర్యమూ సౌశీల్యమూ నిలువెల్ల
నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల


చరణం : 2
వెండి కొండపై వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో॥
సగము మేనిలో ఒదిగిన దేవత (2)
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
ప్రియ భావమే లయరూపమై
అలలెక్కి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల
ఉభయాత్మల సంగమ వేళ
అభినందన మందారమాల


సందర్భానికి సన్నివేశానికి తగిన  సాహిత్యం తో సినారె అద్భుత గీతం  అందించారు. 


సినారె వ్రాసిన మరొక అద్భుత సాహిత్యం. 

అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిది 
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే 
అవతార పురుషుడైనా 
ఓ అమ్మకు కొడుకే. 


సినారె అద్భుత సాహిత్యం కలిగిన ఎన్నో సినీ గీతాలు ఉన్నాయి. ఆయన తొలి గీతం నన్ను దోచుకుందువటే , పగలే వెన్నెల, నిన్న లేని అందమేదో, ప్రణయ రాగ వాహిని, చిత్రం భళారే విచిత్రం, ఎంత మధురం ఈ క్షణం, ఎదురుగా  నీవుంటే, వటపత్ర శాయికి, సంగీత సాహిత్య సమలంకృతే, చరణ కింకిణులు, ఏమో ఏమో ఇది, వస్తాడు నా రాజు ఈ రోజు, నేడే ఈ నాడే మురిపించె  నన్ను, వ్రేపల్లె వేచేను, నీ పేరు తలచినా చాలు ...కొన్ని వందల గీతాలు..   అన్ని కూడా ఆణిముత్యాలు. 

మనకు ఎందరో గొప్ప సినీ గీత రచయితలు ఉన్నారు.  ఎన్నో మంచి గీతాలు రచించారు. అయితే సినారె గారు నా అభిమాన రచయిత అని చెబుతాను. ఆయన సినీ గీతాలు ఒక అపురూప సంపద. ఎన్నటికీ నిలిచి ఉంటాయి. 



Friday, April 17, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-5- కన కన రుచిరా కనకవసన! నిన్ను


సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ:  


శ్రీ స్వామివారు  అనుగ్రహించిన   'కన కన రుచిరా కనకవసన నిను'  కీర్తన తో    పంచ రత్నములపై వ్రాసిన వ్యాస పంచకం పూర్ణమవుతున్నది. 

ఇవి అభిమాన పూర్వకంగా విషయ సేకరణ చేసి వ్రాసిన పరిచయ వ్యాసాలు కానీ లోతైన  విశ్లేషణాత్మక వ్యాసాలు కావు. 

ఈ ఘనరాగ కృతి 39 వ మేళకర్త రాగమైన ఝాలవరాళి జన్యము ' వరాళి.' రాగములో స్వరపరచ  బడినది. 

కనకమయ చేలుడైన  శ్రీరామ చంద్రునిఎంత చూసినా తనివి తీరని రూపము అని స్వామివారు కీర్తించడం ఈ కృతిలో కనబడుతుంది. 

కీ ర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 
-----------------------------------------------------
పల్లవి : కన కన రుచిరా కనక వసన ! నిన్ను

అనుపల్లవి : దిన దినమును మనసున చనువున నిన్ను-
కన కన రుచిర కనక వసన నిన్ను

చ. 1: పాలుగారు మోమున శ్రీయపార మహిమ తనరు నిన్ను-
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 2కళకళమను ముఖకళ గలిగిన సీత
కులుకుచు నోరకన్నులను జూచే నిన్ను-
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 3బాలార్కాభ సుచేల! మణిమయ మాలాలంకృత కంధర !
సరసిజాక్ష ! వరకపోల! సురుచిర కిరీటధర !
సంతతంబు మనసారగ -
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 4: సాపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాటల వీనుల చురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి 
సుఖియింపగ లేదా యటు -
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 5 : మృగమదలలామ శుభనిటల! వర జటాయు మోక్ష ఫలద! పవమాన సుతుడు నీదు మహిమ దెల్ప 
సీత తెలిసి వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను -
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 6 : సుఖాస్పద! విముఖాంబుధర పవన !
విదేహ మానస విహారాప్త సురభూజ! మానిత గుణాంక! చిదానంద! ఖగ తురంగ! ధృత రథాఙ్గ!  పరమ దయాకర! కరుణారస వరుణాలయ! భయాపహర! శ్రీ రఘుపతే! -
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 7 : కామించి ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొనువాడు సాక్షి; రామ నామ రసికుడు కైలాస సదనుడు సాక్షి; మరియు నారద పరాశర శుక శౌనక పురందర 
నగజాధరాజ (నగజాధర + అజ)  ముఖ్యులు సాక్షి గాద సుందరేశ ! సుఖ కలశాంబుధి వాసా ! శ్రితులకే - 
కన కన రుచిరా కనక వసన నిన్ను

చ. 8: సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత!
ముఖజిత కుముదహిత! వరద! నిన్ను -
కన కన రుచిరా కనక వసన నిన్ను

కన కన రుచిరా
-------------------------------------------------------------------
  • బాలార్కాభ సుచేల - ఉద్యద్భాను వర్ణముతో ప్రకాశిస్తున్న మంచి  వస్త్రములు ధరించిన వాడు. 
  • సాపత్ని మాతయౌ సురుచి..  - సవతి తల్లి పరుషవాక్కులను భరించ లేని ధ్రువుడు 
  • విముఖాంబుధర పవన - శత్రువులు అనే మేఘములను చెదరగొట్టే పవనము వంటి వాడు.  
  • విదేహ మానస విహారాప్త - . విదేహ రాజు జనక మహారాజు మనసున విహరించు వాడు
  • ధృత రథాఙ్గ - రథాఙ్గము అనగా చక్రము ధరించినవాడు.
  • పురందర - నారదుడు.  
  • ప్రేమమీద కరముల నీదు పాద కమలముల బట్టుకొనువాడు - హనుమంతుడు 
-----------------------------------------------------------

ఈ రాగములో  బాలమురళి గారు పాడిన  భద్రాచల రామదాసు కృతి  అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి '  సుప్రసిద్ధమైనది. 

త్యాగరాజ స్వామి వారి మరొక వరాళి రాగ కృతి 
'యేటి జన్మమిది'  (వోలేటి గారి గాత్రములో)
---------------------------------------------------
ప. ఏటి జన్మమిది హా ఓ రామ

అ. ఏటి జన్మమిది ఎందుకు కలిగెను
ఎంతని సైరింతు హా ఓ రామ (ఏటి)

చ1. సాటి లేని మార కోటి లావణ్యుని
మాటి మాటికి జూచి మాటలాడని తన(కేటి)

చ2. సారెకు ముత్యాల హారయురము పాలు
కారు మోమును కన్నులార జూడని తన(కేటి)

చ3. ఇంగితమెరిగిన సంగీత లోలుని
పొంగుచు తనివార కౌగిలించని తన(కేటి)

చ4. సాగర శయనుని త్యాగరాజ నుతుని
వేగమే జూడక వేగెను హృదయము (ఏటి)
-------------------------------------------------------

మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్దియే,
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్.  

శ్రీ  కారుణ్యసముద్రాయ లోకానుగ్రహకారిణే
సాకేతాధిపభక్తాయ త్యాగరాజాయ మంగళం

Sunday, April 5, 2020

శ్రీ త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు-4 - దుడుకు గల

సద్గురు శ్రీ  త్యాగరాజ స్వామినే నమ:


శ్రీ స్వామివారు ప్రసాదించిన  పంచ రత్నములలో అతి సుందరమైన శైలిలో రచింపబడి   'గౌళ ' రాగం లో స్వరపరచబడిన 'దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా '  కీర్తన శ్రీరామ చంద్రమూర్తికి  స్వామివారు నిర్మింపజేసిన కృతిమణిమంటపము లో  విశిష్ట రత్నఖచిత  స్వర్ణ సింహాసనము వలె విరాజిల్లుతున్నది. 

గౌళ రాగము 15 వ మేళకర్త రాగమైన అతి ప్రసిద్ధమైన , పెద్ద ముత్తైయుదువు రాగాలలో ఒకటైన   'మాయా మాళవ గౌళ'  జన్యము. 

ఆరోహణ లో ఔడవ (ఐదు స్వరాలు) - స రి మ ప ని స

అవరోహణలో షాడవ- వక్ర (వరుస మార్చుకునే  ఆరుస్వరాలు) 

స ని ప మ రి గ మ రి స -  మూర్చన కలిగి ఉన్నది. 

స్వామి వారు - దుడుకు గల , ఎన్నో అవలక్షణాలు, బలహీనతలు  గల,  మనలాంటి మనుష్యుల గురించి శ్రీరామునికి నివేదిస్తున్నారు అని తెలియటం సమంజసంగా ఉంటుంది.  శ్రీ స్వామివారు 'దుడుకు గల' అన్నా అన్నమాచార్యులు  ' పురుషోత్తముడవీవు, పురుషాధముడ నేను' అన్నా అది మనగురించే కాని పరమభక్తులు, దైవంశ సంభూతులైన తమ గురించి కాదు అని భావించవలెనని పండితులు విశద పరిచినారు . 

కీర్తన పూర్తి పాఠం దిగువన ఇవ్వబడింది. 

పల్లవి - దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో -దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

అనుపల్లవి - కడు దుర్విషయాకృష్టుడై  గడియ గడియకు నిండారు  -దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 1 - శ్రీ వనితా హృత్కుముదాబ్జ! అవాంగ్మానసగోచర!

దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 2 - సకల భూతముల యందు నీవై యుండగ మతి లేక పోయిన - దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 3 - చిరుత ప్రాయముల  నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన 
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 4 - పర ధనముల కొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 5 - తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 6 - తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదేశించి సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 7 - దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవాది దేవ నెరనమ్మితిని గాకను
పదాబ్జ భజనంబు మరచినదుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 8 - చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన

దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

చ. 9 - మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక , మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక నరాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా

అనుబంధము - సతులకై కొన్నాళ్లాస్తికై  సుతులకై కొన్నాళ్లు 
ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొరకొడుకు బ్రోచురా
----------------------------------
అనుక్షణం దుర్విషయాలకు ఆకర్షితుడవుతూ - 
కుతర్కముతో బాల్య, కౌమార, యౌవన  దశలలో జీవితం వ్యర్థ పరచుకుంటూ  
సుఖ జీవనమొక్కటే పరమావధిగా భావించుచూ-  
లలన (సతులు) అర్భక (సంతతి) సదన (గృహము) సేన (అనుచరులు) అమిత ధనాదులకై పరితపించుచూ - 
బ్రహ్మత్వానికి దూరమై తామసిక జీవనం గడుపుచూ 
శ్రీ రాముని చింతన మరచిపోయిన జనులను  చూసి ఇటువంటి జనులను ఏ దొర కొడుకు బ్రోచునో యని 
స్వామివారు  పొందిన  ఆవేదన ఈ కీర్తనలో కనిపిస్తుంది. 

ఇదే సందర్భంలో రెండు  అన్నమయ్య కృతులు స్మరించుకోవడం సముచితంగా ఉంటుంది. 
-------------------------
పురుషోత్తముడ వీవు పురుషాధముడ నేను
ధరలో నాయందు మంచితన మేది

అనంతాపరాధములు అటు నేము సేసేవి
అనంతమయినదయ అది నీది
నిను నెఱగకుండేటి నీచగుణము నాది
నను నెడయకుండేగుణము నీది

సకలయాచకమే సరుస నాకు బని
సకలరక్షకత్వము సరి నీపని
ప్రకటించి నిన్ను దూరేపలుకే నా కెప్పుడూను
వెకలివై ననుగాచేవిధము నీది

నేర మింతయును నాది నేరు పింతయును నీది
సారెకు నజ్ఞాని నేను జ్ఞానిని నీవు
యీరీతి శ్రీ వేంకటేశ యిట్టే నన్ను నేలితివి
ధారుణిలో నిండెను ప్రతాపము నీది
-----------------------------------------
ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది |
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||
చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము |
మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ ||
మరచెద సుజ్ఞనంబును మరచెద తత్త్వ రహస్యము  |
మరచెద గురువును దైవము మాధవ నీ మాయ ||
చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు |
విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ |
విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబును |
విడిచెద నాచారంబును విష్ణుడ నీమాయ ||
చ|| తగిలెద బహు లంపటముల తగిలెద బహు బంధముల |
తగులను మోక్షపు మార్గము తలపున యెంతైనా |
అగపడి శ్రీ వేంకటేశ్వర అంతర్యామివై |
నగి నగి నను నీవేలితి నాకా యీమాయ ||
------------------------------------
మాయకు లోనై దుష్కర్మలను ఆచరించే మనుష్యులనుద్దేశించి భగవద్గీతలో

" మమ మాయా దురత్యయా, 
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే " అని చెప్పారు. 


Malladi Brothers Voice - దుడుకు గల 


రామే చిత్తలయః సదా భవతు మే భో ! రామ ! మాముద్ధర